పార్టీలకు అతీతంగా ‘విశాఖ గర్జన’లో పాల్గొందాం

విశాఖ గర్జన పోస్టర్‌ ఆవిష్కరించి మంత్రి అమర్‌నాథ్‌

విశాఖపట్నం: వికేంద్రీకరణ సాధనకై ఈనెల 15వ తేదీన విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు విశాఖ గర్జన పోస్టర్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విడుదల చేశారు. విశాఖ గర్జనకు వైయస్‌ఆర్‌ సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా విశాఖ గర్జనను ఆవిష్కరించిన అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ గర్జనలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 

గర్జన రోజే మీటింగ్‌ పెట్టుకోవడం అవసరమా పవన్‌..?
విశాఖ గర్జనకు పిలుపునివ్వగానే పవన్‌ కల్యాణ్‌ నిద్రలేచాడని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ఏర్పాటు చేసిన రోజే పవన్‌ కల్యాణ్‌ మీటింగ్‌ పెట్టుకోవడం అవసరమా..? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు. అమరావతిలో 29 గ్రామాలేనని, ఉత్తరాంధ్రలో 6 వేల గ్రామాలు ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లు అని, రాజకీయాలు పక్కనబెట్టి ప్రజల కోసం నిలుద్దామని పిలుపునిచ్చారు. 
 

Back to Top