ఏడాది పాలనపై చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా..?

చంద్రబాబు, టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌

ఏడాదికాలంలో దళితుల కోసం రూ.6,891 కోట్లు ఖర్చు చేశాం

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళిత పక్షపాతి

చంద్రబాబును దళిత సమాజం ఎప్పటికీ క్షమించదు

టీడీపీ హయాంలో కేటాయింపులు గణం.. ఖర్చులు శూన్యం

తాడేపల్లి: దళిత సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, ఏడాది పాలనలోనే దళిత సంక్షేమానికి రూ.6,891 కోట్లు ఖర్చు చేశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఏడాదికాలంలో 80,86,187 మంది ఎస్సీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.6,891 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి చేర్చగలిగామన్నారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో దళితులు, బడుగు, బలహీనవర్గాలకు చేసిన కార్యక్రమాలపై... వైయస్‌ఆర్‌ సీపీ ఏడాది పాలనలో చేసిన మేలుపై ఎక్కడైనా శాఖల వారీగానైనా, పథకాల వారీగానైనా.. ఏ విషయంలో తీసుకున్నా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు సిద్ధమా అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌ విసిరారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ పాలనను రాష్ట్ర ప్రజలంతా మెచ్చుకుంటుంటే.. తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా మాత్రం విషం చిమ్ముతున్నాయన్నారు. దళితులకు అన్యాయం జరిగిందని ఎల్లో మీడియా బ్యానర్‌ ఐటమ్స్‌ రాస్తున్నాయని, ఇలాంటి పిచ్చి రాతలను ప్రజలెవరూ పట్టించుకోరన్నారు. 

2014–19 వరకు టీడీపీ పాలన ఏ విధంగా సాగిందో రాష్ట్ర ప్రజలంతా చూశారని, చంద్రబాబు హయాంలో బడ్జెట్‌లో కేటాయింపులు గణం.. ఖర్చులు మాత్రం శూన్యమని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదోవ పట్టించింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. దళితులను కించపరుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. దళితుల పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర ఖజానాను టీడీపీ దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడిన మాటలను ఎవరూ మర్చిపోలేదని, దళితులపై అంత చులకన భావం ఉంది కాబట్టే నాలుగేళ్లుగా ఆ మాటను చంద్రబాబు ఉపసంహరించుకోలేదన్నారు. కేవలం దళితులను ఓటు బ్యాంక్‌గా చూసి. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే చంద్రబాబు రాజకీయం చేశాడని దుయ్యబట్టారు.  

ప్రజారంజక పాలన అందిస్తున్న వైయస్‌ఆర్‌ సీపీపై టీడీపీ, ఎల్లోమీడియా విషం చిమ్ముతోందని, తప్ప తాగి వీరంగం చేసిన డాక్టర్‌ సుధాకర్‌బాబు అంశానికి కులం ఆపాదిస్తూ నానా యాగి చేశారన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ బాబు కేసులు సీబీఐకి అప్పగిస్తే.. తప్పతాగి వీరంగం సృష్టించిన డాక్టర్‌పై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేసిన విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. నిన్నటి రోజున ఆంధ్రా యూనివర్సిటీలో దళిత హక్కుల కోసం పోరాడుతున్న ప్రొఫెసర్‌ విషయంపై రాజకీయ రంగు పులమాలని చూసి చంద్రబాబు తనయుడు లోకేష్‌ లోకేష్‌ చేతులు కాల్చుకున్నాడన్నారు. చంద్రబాబుకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే.. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం దళితులకు భూములు కేటాయించడాన్ని ఎందుకు వ్యతిరేకించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top