కూటమి నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మెట్టు గోవిందరెడ్డి

ఫ్లెక్సీలతో దుష్ప్రచారం, దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

రాయదుర్గం: రాష్ట్రంలో కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తూ శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో సీఐ జ‌య‌నాయ‌క్‌కు మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతల ప్రోత్సాహంతో హిందువులు, ప్రజల మనోభావాలను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫ్లెక్సీలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ప్రశ్నించిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని, బ్రహ్మనాయుడు తదితరులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను “రెడ్ బుక్ రాజ్యాంగం”తో నడుపుతున్న పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. దుష్ప్రచారం, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోరాల శిల్ప, నియోజకవర్గ పరిశీలకుడు ఎల్.ఎం. మోహన్ రెడ్డి, గౌని ఉపేందర్ రెడ్డి, రాయదుర్గం టౌన్ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, మండలాల ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top