మీరు వేసే ఓటు వల్ల తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి

పూత‌ల‌ప‌ట్టు మేమంతా సిద్ధం స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది

ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు

జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు

ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు

ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం

ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే.

ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు

మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..?

ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా?

ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి.

ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం

అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్‌గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు.

మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్‌ వారి చేతుల్లో పెట్టినట్లే.

చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి

ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి

ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి

చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తు వస్తుందా

14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా?

రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు?

ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్‌ మీడియాం తెచ్చిందెవరు?

విలేజ్‌ క్లీనిక్‌, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు?

ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్‌డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్‌

ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్‌.

3 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు

ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు

66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే.

53 లక్షల మంది తల్లుల  అకంట్లలో అమ్మఒడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం.
  
31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

చిత్తూరు జిల్లా:  మీరు వేసే ఓటు వల్ల రాష్ట్ర భ‌విష్య‌త్‌, మ‌న తలరాతలు మారుతాయని ఆలోచించుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రేపు జ‌రిగే ఎన్నిక‌లు జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి  అన్నారు. ఈ యుద్ధంలో నేను ప్రజలపక్షాన ఉన్నానన్నారు.  మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా?. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్‌ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయ‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

పూతలపట్టులో జనసముద్రం.*

మన చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఈరోజు నాకు ఇక్కడ ఒక మహాజనసముద్రం కనిపిస్తోంది. ఇది ప్రజల సముద్రం. జరగబోతున్న మహాసంగ్రామంలో మంచి వైపున నిలబడి యుద్ధం చెయ్యడానికి సిద్ధం అంటున్న ఒక మహా ప్రజా సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన నా ప్రతి అక్కా చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వా,తాతకూ, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్, మీ బిడ్డ శిరస్సు వంచి పేరు పేరునా çహృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. 

 

*విశ్వసనీయత, మోసం మన మందున్న రెండు ప్రత్యామ్నాయాలు.*

ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరో వైపున ఉన్నాయి. ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరో వైపున. మంచి ఓవైపున, చెడు మరో వైపున. వెలుగు ఓ వైపున, చీకటి మరో వైపున. ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపు. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ఘడియలు. 

 

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింటి అభివృద్ధి, ఇంటింటి మంచి, పిల్లల భవిష్యత్తు కోసం సత్యనిష్టతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి ప్రభుత్వం మంచి చేసి ఓవైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు.. గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా.. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి.. వీటిని ప్రజలకు రిటర్న్‌ గిఫ్ట్‌ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. 

 

*మోసం చేయడం చంద్రబాబు అలవాటు*

ఈ ఎన్నికలు జగన్‌ కు, చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు ఒక హబిట్చువల్‌ అఫెండర్‌ అంటే ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ.. నాది ప్రజల పక్షం అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాను.

 

*రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం– చంద్రబాబు పక్షం.*

ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి. ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా. ఈ పాటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5,  వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ. వీరంతా కూడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం. వీరిది చంద్రబాబు పక్షం. 

 

*బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలను రక్షించేందుకు సిద్దమేనా?*

కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద వీరందరూ యుద్ధం చేస్తున్నారు. వీరందరూ యుద్ధానికి వస్తున్నారు.  ఇన్ని జెండాలు ఏకమవుతున్నాయి. ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుతంత్రాలు, కుట్రలు జరుగుతున్నాయి. కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. మరి మే 13న జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మీ బిడ్డకు మీరు తోడుగా ఉండటంతో పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీనవర్గాలు, మైనార్టీలు, వృత్తి వర్గాలు.. వీరందరి తరఫున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా..సిద్ధమేనా అని అడుగుతున్నాను. ధర్మాన్ని గెలిపించడానికి, విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా.. సిద్ధమేనా? అని అడుగుతున్నాను. 

 

 

*డబుల్‌ సెంచరీ సర్కాస్‌ స్ధాపించేందుకు సిద్ధమేనా?*

అవినీతి జీవుల్ని, పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ఓడించేందుకు.. ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకుని పేదల భవిష్యత్‌ కు తోడుగా ఉంటూ డబుల్‌ సెంచరీ సర్కార్‌ ను స్థాపించేందుకు సిద్ధమేనా.. అని అడుగుతున్నాను. అందరూ ఆలోచనచేయమని అడుగుతున్నాను. ఇదే ఘడియల్లో ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను.

 

*మంచి కోసం కుటుంబం అంతా కూర్చుని ఆలోచించండి.*

ఒక మనిషి జీవిత కాలంలో ప్రతి రోజూ కూడా ఎంతో విలువైనది. మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా?.. ఏకంగా వచ్చే 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు.. మీ భవిష్యత్‌ వాళ్ల చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఏకంగా మీ ఓటు ద్వారా.. వచ్చే 5 సంవత్సరాలు అధికారం ఇవ్వటం అని, మనకు మంచి జరిగే మంచికిగానీ, మన ఇళ్లలో మనకు జరిగే చెడుకుగానీ, చేసే అధికారం మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. కాబట్టే వచ్చే 5 ఏళ్లలో మన ఇంటి అభివృద్ధిని, మన ఇంటి సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును, మన ఆదాయాన్ని, ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని.. ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకుని మీ కుటుంబం అంతా కూర్చుని ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

 

*మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి.* ఆడపడుచులు, అక్కచెల్లెమ్మలతో, ఇల్లాలితో, చిన్న పిల్లలని వదిలేయకుండా పిల్లలతో కూడా మాట్లాడండి. అభిప్రాయం తెలుసుకోండి. అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్నది ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోమని, తర్వాతే ఓటు వేయండి అని అడుగుతున్నాను. ఇంతకు ముందే నేను చెప్పాను. ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదిది. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుందన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. 

 

*ఇంటింటికీ వెళ్లి గతానికీ నేటికీ తేడా చూడండి.*

ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లండి. ఇంటి పక్కనే ఉన్న ఇరుగుపొరుగు ఇళ్లలో ఉన్న అక్కచెల్లెమ్మల కుటుంబాలనూ సందర్శించండి. గత పదేళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు, మీ బిడ్డ పాలన ఈ 5 సంవత్సరాలు.. మొత్తం పదేళ్లు. ఈ పదేళ్లూ.. మొదట 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత ఐదేళ్లు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి.

 

మీమీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్‌ మెంట్‌ కాపీ. మీ దగ్గరే పెట్టుకోండి. ఆ స్టేట్‌ మెంట్‌ ను ఒక్కసారి చూడండి. మీ బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు అందించిన వివరాలు ఎంత? ఏమిటి? ఎవరి హయాంలో ఎవరు మీ కుటుంబానికి బాగు చేయడం కోసం ఎవరు ఎంత ఇచ్చారు? ఏ స్కీము మంచి చేయడం కోసం పెట్టారు? మీ సాధికారతకు, మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు, ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎవరి హయాంలో మీకు మంచి జరిగిందన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాను. 

 

*ఒక్క మంచీ చేయని బాబు పాలన.*

ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా, ఇంతగా ఎందుకు చెబుతున్నానో ఆలోచనచేయమని కోరుతున్నానంటే కారణం.. ఈ ఓటు వల్ల మన తలరాతలు మారతాయి కాబట్టి కచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతున్నాను. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పని చేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు, మీ ఇంటికీ ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే.. మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే, ఆయన పాలన చూస్తే ఆయన పేరు చెబితే, ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? కనీసం ఒక్క రూపాయి అయినా ఆయన బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అయినా కనిపిస్తుందా? 

CM Jagan Comments On Chandrababu At Puthalapattu Sabha - Sakshi

*మీ జగన్‌ హయాంలో అడుగడుగునా*

అదే మీ జగన్‌.. మీ బిడ్డ మీ ఇంటికి మీ గ్రామానికి, ఏం చేశాడు అంటే.. గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి, ఏ పట్టణానికి వెళ్లినా కూడా అక్కడే కనిపిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, తీసుకు వచ్చింది ఎవరు అనంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఆ సచివాలయాల నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. రైతన్నను చేయి పట్టుకుని నడిపించేందుకు కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే.. మీ జగన్‌. మీ బిడ్డ. 

 

మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్‌ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ మార్చి అందులో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చింది ఎవరు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. మీ బిడ్డ. గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్‌ క్లినిక్‌. అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌. అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష. అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. మీ బిడ్డ. ఇంటింటికీ పౌర సేవల్ని డోర్‌ డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వాతాతల ముఖాల్లో 1వ తేదీ వచ్చే సరికే అది సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే.. ఒకటో తేదీ వచ్చే సరికే.. ఆ ఇంటికే వెళ్లి తలుపుతట్టి చిరునవ్వులతో గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు, ఆనందాలు తీసుకొస్తున్న ఆ వాలంటీర్‌ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే.. మీ జగన్‌. గుర్తుకొచ్చేది మీ బిడ్డ. 

 

ప్రతి గ్రామ సచివాలయానికీ అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీసు వ్యవస్థ తీసుకు వచ్చింది ఎవరు అంటే మీ జగన్‌. గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ఆ ప్రతి అక్కా చెల్లెమ్మ ఫోన్లో వారి భద్రత కోసం దిశ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకుని ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ ఎప్పుడైనా కూడా ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, లేదా 5 సార్లు ఫోన్‌ షేక్‌ చేసినా వెంటనే అక్కచెల్లెమ్మకు ఫోన్‌ వచ్చి 10 నిమిషాల్లోనే అక్కడే పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మా ఏమైంది? అని అడిగే పాలన వచ్చింది.. తీసుకు వచ్చింది ఎవరు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. మీ బిడ్డ. 

 

అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష. ప్రతి ఇంటికీ కూడా విలేజ్‌ క్లినిక్స్‌ తో అనుసంధానమై జల్లెడ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా, ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ల చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని రూ.25 లక్షల దాకా ప్రతి పేదవాడికీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ. గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్కచెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ల పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతున్నా కాలనీలు. ఆ కాలనీలు చూస్తుంటే ఆ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీలు చూస్తుంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ. గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

*ఎప్పుడూ చూడని, జరగని విధంగా లబ్ధి.*

ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా ఆలోచనకు రాని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, లేదా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడం.. అంటే మధ్యలో ఎక్కడా దళారుల్లేరు. మధ్యలో ఎక్కడా జన్మభూమి కమిటీల్లాంటి దళారుల్లేరు. లంచం అనే మాట ఎక్కడా లేదు. వివక్షకు అసలు చోటే లేదు. నేరుగా ఈ మాదిరిగా బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం, నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ల చేతిలో పెట్టడం.. ఇవన్నీ కళ్ల ఎదుటే కనిపిస్తున్నప్పుడు గుర్తుకొచ్చేది.. మీ బిడ్డ. గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

మనసున్న ప్రభుత్వంగా పేదలు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వాతాతలు, సామాజిక వర్గాల వారు.. ఇలా అందరికీ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో బటన్‌ నొక్కి ఎంతగా మేలు చేశామో అర్థమై చంద్రబాబు, ఆయన కూటమి, ఆయన పొత్తుల జెండాలు, ఆయన ఎల్లో మీడియా, మన ప్రభుత్వం మీద ఎంతగా అసూయ పడుతున్నారో, ఎంతగా అక్కసు కక్కుతున్నారో మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. 130 సార్లు మీ బిడ్డ బటన్‌ నొక్కాడు. డీబీటీగా అంటే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ రూ.2.70 లక్షల కోట్లు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు ఆ వివరాలు స్థూలంగా మీ ముందు ఈరోజు మాట్లాడతాను. 

 

*దేశంలో ఎక్కడాలేని విధంగా 66.36లక్షల మందికి పెన్షన్‌.* 

వైయస్సార్‌ పెన్షన్‌ కానుకగా దేశంలో ఎక్కడా లేదు. ఏ రాష్ట్రమూ లేదు. ఇలా రూ.3 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. జనాభా ప్రకారం తీసుకుంటే ఇలా 66.36 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం కూడా దేశంలోనే ఎక్కడా లేదు. వైయస్సార్‌ పెన్షన్‌ కానుకగా 66.36 లక్షల మంది నా అవ్వాతాతలకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, నా దివ్యాంగులకు అందించింది ఎంతో తెలుసా అక్షరాలా రూ.84,731 కోట్లు. 

 

*రైతును చేయిపట్టుకుని నడిపిస్తూ...*

ఇక రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి రైతన్న ఇబ్బందులు పడుతున్నా కూడా పాలకులు చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ రైతన్నకు తోడుగా నిలబడలేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు తోడుగా వైయస్సార్‌ రైతు భరోసాగా ఏకంగా 53.58 లక్షల మంది రైతన్నలకు అందించింది అక్షరాలా రూ.34,370 కోట్లు. రైతన్నలకు సున్నా వడ్డీగా అందించింది మరో 2,050 కోట్లు, ఉచిత పంటల బీమాగా రైతులకు అందించింది మరో రూ.7,800 కోట్లు, ఇన్‌ పుట్‌ సబ్సిడీగా సమయానికే ఇచ్చింది మరో రూ.3261 కోట్లు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు కనిపించే విధంగా జరుగుతున్నాయి. 

 

*అక్కచెల్లెమ్మలకు అండగా...*

ఇక అక్కచెల్లెమ్మలు.. ఏకంగా 53 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ ఆ పిల్లల  చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిగా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టింది అక్షరాలా రూ.26,067 కోట్లు. పెద్ద చదువులకు ఏ తల్లీతండ్రీ కూడా తమ పిల్లల్ని చదివించేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేద కుటుంబానికీ కూడా రాకూడదని, ఆ పిల్లలకు, ఆ తల్లులకు, ఆ కుటుంబాలకు తోడుగా ఉంటూ జగనన్న విద్యాదీవన, వసతి దీవెన ద్వారా ఏకంగా 29.65 లక్షల మంది పిల్లలకు, వారి తల్లులకు అందించింది అక్షరాలా మరో రూ.18 వేల కోట్లు. పెద్ద చదువుల కోసం ఆ పిల్లలకు, ఆ తల్లులకు డోడుగా ఉంటూ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వైయస్సార్‌ చేయూత. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా వైయస్సార్‌ చేయూతగా 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి కాళ్ల మీద వారు నిలబడేట్టుగా వారిని ప్రోత్సహిస్తూ, అదే అక్కచెల్లెమ్మకు వరుసగా అండగా ఉంటూ, ఒక్క చేయూత పథకం ద్వారా అందించింది మరో రూ.19,189 కోట్లు అని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను.  

 

ఇదే క్రమంలో ఈబీసీ నేస్తం కింద 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించింద మరో రూ.1876 కోట్లు. కాపు నేస్తం కింద 3.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించింది మరో రూ.2,029 కోట్లు. వైయస్సార్‌ ఆసరాగా చంద్రబాబు మాటలు నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలంతా దివాళా తీసే పరిస్థితి నుంచి ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఏకంగా 78.94 లక్షల పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ ఆసరా ద్వారా అందించింది రూ.25,571 కోట్లు. అదే అక్కచెల్లెమ్మలకు చేయి పట్టుకుని నడిపిస్తూ కుదేలు కాకుండా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ సున్నా వడ్డీ కింద అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది మరో రూ.4,960 కోట్లు. ఒక్క ఆరోగ్యశ్రీ కింద పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా 39.39 లక్షల మందికి ఇచ్చినది రూ.12,463 కోట్లు. వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా మరో 23.29 లక్షల మందికి ఇచ్చింది మరో రూ.1,390 కోట్లు. మత్స్యకార భరోసాగా 2.44 లక్షల మందికి మంచి చేస్తూ ఇచ్చినది రూ. 538 కోట్లు. స్వయం ఉపాధికి మరింత ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం ద్వారా 82 వేల మందికి అందించింది మరో రూ. 982 కోట్లు. చేదోడుగా సహాయం చేస్తూ నా రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు 3.38 లక్షల మందికి ఇచ్చింది మరో రూ.1260 కోట్లు. వాహన మిత్ర ద్వారా 2.76 లక్షల మంది సొంత ఆటో సొంత క్యాబు నడుపుతున్న నా అన్నదమ్ములకు అండగా ఉంటూ చెల్లించినది మరో రూ.1300 కోట్లు. 

 

10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటూ వారికోసం ఇచ్చింది మరో రూ. 906 కోట్లు. ఇలా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లాయి. ఆలోచన చేయమని అడుగుతున్నాను. మరి ఇదే చంద్రబాబు హయాంలో ఏ ఒక్క అక్కచెల్లెమ్మకు అయినా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తుందా? అని అడుగుతున్నాను. 

 

రాష్ట్రంలో ఇవి కాక మరో 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేసి అందులో ఏకంగా 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతుంది. ఆ ఇల్లు పూర్తయ్యే సరికే ఆ అక్కచెల్లెమ్మలకు ఇలా ఏకంగా ఒక్క ఇంటి స్థలం, ఇంటి మీదనే దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆస్తి కల్పించిన పరిస్థితి. ఈ రకంగా నా అక్కచెల్లెమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా మరో రూ.3 లక్షల కోట్లు పైచిలుకు అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్లవుతుంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను.

 

ఇవన్నీనేను ఎందుకు చెబుతున్నానంటే.. ఇవన్నీ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ పాలనలో ఈరోజు జరుగుతున్నాయన్న సంగతి ఆలోచన చేయమని మీ అందరితో కోరుతున్నాను. 

 

నా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ వారి కుటుంబాల తలరాతలు మార్చాలని, ఆ పేదింటి పిల్లల చదువుల మీద, వారి బడి మీద మనం పెడుతున్న ఖర్చు, మనం పెడుతున్న దృష్టి మరో 10 సంవత్సరాల్లో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత.. ఆ గవర్నమెంట్‌ బడుల్లో చదువుతున్న ప్రతి పేద పిల్లాడూ కూడా ఏమాదిరిగా ఇంగ్లీషు మాట్లాడతాడంటే.. ధనికులే ఆ పిల్లలను చూసి మా పిల్లలకన్నా ఆ పేద పిల్లాడు గొప్పగా మాట్లాడుతున్నాడనే విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతి అడుగూ కూడా ధనికుల పిల్లలకు ఒక రకమైన చదువు ఉండకూడదు, పేద పిల్లకు ఇంకో రకంగా చదువు ఉండకూడదు, మన పేద పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా అవే క్వాలిటీ, గొప్ప చదువులు ఆ ప్రతి పేద ఇంట్లో కూడా అందాలని, ఆ పేద పిల్లల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ ఈ 58 నెలలుగా ప్రతి అడుగూ వేశాడు ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. 

 

*బాబు పాలనకు– మీ బిడ్డ పాలనకు తేడా గమనించండి.*

మీ అందరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసిన ఈ పాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి గానీ, స్కీముగానీ ఎందుకు గుర్తుకు రాదు అని అడుగుతున్నాను. ఆలోచన చేయమని కోరుతున్నాను.  

 

*జెండాలు జత కడుతున్నారు...*

ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా మీ అందరి దగ్గరకూ వచ్చాడు. కూటమి అన్నాడు. జెండాలు జతకట్టాడు. ముగ్గుర్ని తీసుకొచ్చాడు ఆయనతోపాటు ఒక దత్తపుత్రుడిని, ఆయనతోపాటు ఢిల్లీకి వెళ్లి మోడీ గారిని కూడా తీసుకొచ్చాడు. 2014లో తీసుకొచ్చి ఈ మాదిరిగా.. గుర్తుందా ఈ పాంప్లేట్‌ ప్రతి ఇంటికీ వచ్చింది. గుర్తుందా.. చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది. గమనించారా? ఈ ముగ్గురి ఫొటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు. 

 

*చంద్రబాబు – విఫల హామీలు.*

ముఖ్యమైన హామీల్లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా.. రైతుల రుణ మాఫీపై మొదటి సంతకం. ముఖ్యమైన హామీ ఇది. రూ.87612 కోట్లు.. రుణ మాఫీ చేశాడా? గట్టిగా రెండు చేతులూ పైకెత్తి ఇలా ఇలా ఇలా.. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లేట్‌ లో రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ రూ.14205 కోట్లు ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతున్నాను. ముఖ్యమైన హామీలు.. మూడో హామీ చంద్రబాబు చెప్పింది. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అంకౌంట్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. మీ అందరికీ ఆ బిడ్డలు పుట్టారు కదా.. లేకపోతే పక్కింటోళ్లకన్నా ఆడ బిడ్డలు పుట్టారు కదా.. ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా అని అడుగుతున్నాను. ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగభృతి. 5 సంవత్సరాల్లో నెలకు రూ.2 వేల చొప్పున అంటే రూ. 1.20 లక్షలు ఇచ్చాడా అని అడుగుతున్నాను. 

 

ఇంకా చెప్పుకొంటూ పోతే అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇళ్లు.. ఇచ్చాడా అని అడుగుతున్నాను. ముఖ్యమైన హామీ ఇది.. ఇచ్చాడా? కనీసం ఒక్క సెంటన్నా స్థలం ఇచ్చాడా? ఇలా చెప్పుకొంటూ పోతే రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలన్నీ మాఫీ అన్నాడు. ఇచ్చాడా? చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు. మీకు ఏమైనా కనిపించిందా? ఇవీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసంచేసేందుకు ఆయన, ఆయనతోపాటు ఇదే కూటమి ఓ దత్తపుత్రుడు, మోడీ గారి ఫొటో ఇంటింటికీ పంపించాడు సంతకం పెట్టి. ఇందులో ఒక్క హామీ అయినా కూడా కనీసం పూర్తి చేయనప్పుడు మరి ఇదే పెద్దమనిషి మళ్లీ ఇదే ముగ్గురితో కలిసి ఈరోజు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటున్నాడు. ప్రతి ఇంటికీ ఒక బెంజ్‌ కారు కొనిస్తానంటున్నాడు. ఇదే పెద్ద మనిషి సూపర్‌ సిక్స్‌ అంటున్నాడు. సూపర్‌ సెవెన్‌ అంటున్నాడు. నమ్మొచ్చా అని అడుగుతున్నాను. 

 

 

*1వ తేదీ పొద్దున్నే సూర్యుడు రాకపోయినా వాలంటీర్‌ వస్తాడు.*

ఇదే పెద్ద మనిషి ఎంతగా దిగజారిపోయాడు అంటే ఈ మధ్య కాలంలోనే గత మూడు రోజులుగా అవ్వాతాతలు పడుతున్న బాధలన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే ఆ వాలంటీర్లు వెళ్లి అవ్వాతాతల ఇంటికి వెళ్లి గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ చిరునవ్వుతో 1వ తారీఖున ఎప్పుడూ క్రమం తప్పకుండా మిస్‌ కాకుండా నెల 1వ తారీఖు వచ్చే సరికే సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదోగానీ, వాలంటీర్‌ మాత్రం చిరునవ్వుతో వచ్చి తలుపుతట్టి సెలవుదినమైనా, పండుదిగనమైనా వచ్చి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూస్తూ మనవళ్లుగా, మనవరాళ్లుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్‌ పెట్టే ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్‌ కమిషన్‌ కు నిమ్మగడ్డ రమేష్‌ అనే తన మనిషి చేత లేఖలు రాయించి, ప్రజర్‌ పెట్టించి ఏకంగా వాలంటీర్‌ అనే వాడే లేకుండా, వ్యవస్థ అనేదే లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తుంటే ఈరోజు ఆ నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు ఆ పెన్షన్‌ అందుకునేందుకు ఈరోజు పడుతున్న అగచాట్లు చూస్తున్నప్పడు ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక శాడిస్టా అని  ఈ సందర్భంగా అడుగుతున్నాను. 

 

*చంద్రముఖిని పెట్టెలో బిగించాల్సిన సమయం.*

ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తికి మనం ఓటు వేయడం ధర్మమేనా? వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మరొక్కసారి చెబుతున్నాను. మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారతాయి. ప్రతి ఇంటికీ వెళ్లి ఈ ప్రతి విషయం కూడా చెప్పి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరిగి ఉంటే ఇదే సరైన సమయం.. ఇప్పుడే బయటకు రావాలి. జగనన్ననే మళ్లీ తెచ్చుకోవాలి, జగనన్నే మళ్లీ వస్తే మళ్లీ వాలంటీర్‌ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్‌ క్యాంపెయినర్లను బయటకు తీసుకొచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటూ కూడా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కి చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలకా అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. 

 

*సిద్ధమైతే సెల్‌ఫోన్‌ టార్చ్‌ వెలిగించండి.*

సిద్ధమే అయితే, జేబులోంచి సెల్‌ ఫోన్‌ తీయండి. టార్చ్‌ లైట్‌ ఆన్‌ చేయండి. సిద్ధమే అని చెప్పి గట్టిగా నినదించండి. ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాను గుర్తుమీద నిలబడే మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తున్నాను. ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి మీ ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్ప అన్న.. మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మంచి వాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు రెడ్డప్ప అన్నపై ఉంచాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. నాకు పితృ సమానుడు లాంటి వాడు. మీ అందరి చల్లని దీవెనలు కచ్చితంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ సునీల్‌ కూడా పరిచయస్తుడే. డాక్టర్, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు సునీల్‌ పై కూడా ఉంచాల్సిందిగా కోరుతున్నాను. పలమనేరు ఎమ్మెల్యేగా మన వెంకటే గౌడ కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటే గౌడ్‌ పై కూడా ఉంచాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చంద్రగిరి నుంచి మోహిత్‌ నిలబడుతున్నాడు. భాస్కర్‌ కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు. మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్‌ పై ఉంచాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. 

 

కృపాలక్ష్మి.. జీడీ నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న కూతురు. మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనల కోసం మీ దగ్గరికి వచ్చింది. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. చిత్తూరు నుంచి విజయ్‌ నిలబడుతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు,మీ అందరికీ పరిచయస్తుడు. మీ చల్లని దీవెనలు విజయ్‌ పై ఉంచాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

నగరి నుంచి రోజమ్మ నిలబడుతోంది. నా చెల్లెలు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచాల్సిందిగా సవినయంగా మీ అందర్నీ ప్రార్థిస్తున్నాను. కుప్పం నుంచి.. భరత్‌ మీ వాడు,  మీ లోకల్, మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, నా తమ్ముడు, గెలిపించండి. ఈ సారి కేబినెట్‌ లో మంత్రి పదవి ఇచ్చి మీ అందరికీ మంచి చేయిస్తాను. 

 

 

*ఫ్యాన్‌ గుర్తుపై మీ చల్లని దీవెనలు.*

మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్‌ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్నందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, చీకటైంది కాబట్టి ర్యాంప్‌ పై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్లు కూడా వద్దంటున్నారు కాబట్టి మరోలా మరోలా భావించవద్దని సవినయంగా ప్రార్థిస్తున్నాను. అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

 

Back to Top