ఇండియా కెమ్‌ అంతర్జాతీయ సదస్సుకు హాజ‌రైన మంత్రి గౌతంరెడ్డి

 
న్యూఢిల్లీ:  ఢిల్లీలోని హోట‌ల్ తాజ్ ప్యాల‌స్‌లో నిర్వ‌హిస్తున్న 11వ ఇండియా కెమ్‌ అంతర్జాతీయ సదస్సుకు ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి హాజ‌ర‌య్యారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా  గౌతమ్‌రెడ్డి ఢిల్లీ లో ఈనెల 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు జ‌రిగే  పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.  100కు పైగా దేశాల నుంచి 7,000 మందికిపైగా వ్యాపారసంస్థల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు మంత్రి మేకపాటి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రణాళికలను పూర్తి చేసింది.

ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్‌ కారిడార్‌తో పాటు కృష్ణపట్నం నోడ్‌లో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశముంది. పెట్రో కెమికల్స్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 17న మధ్యాహ్నం నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఐటీసీ మౌర్యా హోటల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సులో కూడా మంత్రి మేకపాటి పాల్గొంటారు. 18, 19 తేదీలలో మంత్రి మేకపాటి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.  

Back to Top