గ‌త రెండేళ్లు కూట‌మి ప్ర‌భుత్వం అట్ట‌ర్‌ఫ్లాప్‌

ఏ ఒక్క వ‌ర్గం కూడా సంతోషంగా లేదు

ఈ ఏడాదైనా కూటమి నేతలకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి 

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆకాంక్ష‌

శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు విశాఖలోని తమ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్‌, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీ కేకే రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కూట‌మి పాల‌న‌లో యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారు

బీమా ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమై రైతులను నష్టపరుస్తోంది

బొత్స సత్యనారాయణ ఆగ్ర‌హం

రెండేళ్లుగా వితంతు పింఛన్లు మంజూరు చేయడం లేదు 

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడి తప్పింది. 

మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆక్షేప‌ణ 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి

దేవాలయాలపై దాడులు జరిగితే మౌనం పాటించడం సనాతన ధర్మానికి విరుద్ధం 
 
భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూమి నుంచి అనుమతుల వరకు అన్నీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వమే చేసింది

బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టీక‌ర‌ణ‌
 
రైతులు, పేదలను నష్టపరచే విధానాలు కొనసాగితే వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమానికి దిగక తప్పదు  

కూట‌మి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన‌ మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

విశాఖ‌:  గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప‌రిపాల‌న‌లో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, పేదలు, మహిళలు, యువత సహా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా హామీలను మరిచి పాలన సాగించడం దారుణమని ఆక్షేపించారు. కనీసం ఈ ఏడాదైనా ప్రజల పక్షాన ఆలోచిస్తూ, కూటమి నేతలకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం విశాఖ‌ప‌ట్నంలోని క్యాంపు కార్యాల‌యంలో మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్‌, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీ కేకే రాజుతో కలిసి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏమ‌న్నారంటే..

ఈ ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం అయినా ప్రజలకు మళ్లీ అలాంటి కష్టాలు రాకూడదని, ఈ ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా రైతులు ఎరువుల కొరతతో నానా అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నా దొరకని పరిస్థితి నెల‌కొంది. రూ.260 ధర ఉన్న యూరియాను రూ.500లకు బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ఒడిశా నుంచి అక్రమంగా యూరియా తెచ్చుకుని శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో రైతులు అవసరాలు తీర్చుకుంటున్నారు.

ప్ర‌భుత్వ‌మే రైతుల‌ను న‌ష్టాల్లోకి నెట్టుతోంది
పంట‌ల బీమా విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది, కానీ ప్రస్తుతం రైతే కట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణం. రైతులు ప్రీమియం చెల్లించినా.. ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో నష్టపరిహారం అందడం లేదు. ప్రభుత్వ వాటా  చెల్లించ‌క‌పోవడంతో బీమా కంపెనీలు రైతుల నుంచి ప్రీమియం తీసుకోవడానికే నిరాకరిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులను నష్టపరిచే పరిస్థితి ఏర్పడింది.

గత రెండేళ్లుగా వితంతు పింఛన్లు ఏవీ? 
సంక్రాంతి పండగ సమీపిస్తున్నా, భర్తలను కోల్పోయిన పేద మహిళలకు పండగలే లేని పరిస్థితి నెలకొంది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రతి ఏడాది రెండు విడతలుగా వితంతు పింఛన్లు మంజూరు చేశాం. గతంలో మంజూరైన పింఛన్లు కొనసాగించడం తప్ప, కొత్తగా ఒక్క వితంతు పింఛన్‌ కూడా ఇవ్వలేదు. వితంతువుల ప‌ట్ల కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. టీవీ డిబెట్ల‌లో వితంతు పింఛన్లు, రైతుల సమస్యలపై చ‌ర్చించాలి.

మార్క్‌ఫెడ్ ద్వారా ఎందుకు కొనుగోలు చేయ‌డం లేదు
ఉత్తరాంధ్ర ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీలు క్రమంగా మూతపడుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మార్కెట్‌ ఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు కొనుగోళ్లు జరిగాయి. గతేడాది మార్కెట్‌ ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదు. చెరుకు రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి, లేదంటే రైతుల తరఫున ఉద్యమం చేయాల్సి వస్తుంది.

సూపర్‌ సిక్స్‌ హామీలు ఏమ‌య్యాయి?
బడికి వెళ్లే పిల్లలకు అమ్మ ఒడి ఇస్తామని చెప్పి, కొంతమందికి మాత్రమే రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఇచ్చారు.  ప్రతి మండలంలో 300 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదు. దాదాపు మూడు లక్షల మంది పిల్లలకు ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వని ప‌రిస్థితి. పీ4 పేరుతో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసిన‌ చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పటివరకు దత్తత తీసుకున్నవారికి ఏం ఇచ్చిందో చెప్పాలి. పింఛన్లు, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఆ మూడు పార్టీలు ఎందుకు ఖండించ‌డం లేదు
రామతీర్థం ఘటన సమయంలో పెద్ద ఎత్తున హడావిడి చేసిన కూటమి పార్టీలు, ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై ఎందుకు స్పందించడం లేదు. అధికారం కోసం నిందలు వేయడం, ఘటనలను దాచిపెట్టడం సరికాదు. హిందూ ధర్మం, సనాతన ధర్మం పేరిట మాట్లాడే పార్టీలు ఇలాంటి ఘటనలను ఖండించకపోవడం సిగ్గుచేటు.  డీజీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి, వాహనాలు లేవని నిందితులను నడిపించామని చెప్పడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. చంద్రబాబు ప్రభుత్వంలో, వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో జరిగిన నేరాలపై టేబుల్‌ వేసి పోల్చండి. వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలుస్తాయి. 

రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లపై ఎందుకు స్పందించ‌డం లేదు
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపేశానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం, రేవంత్‌రెడ్డి మాటలు నిజమే అన్నట్లుగా ఉంది.

జీఎంఆర్‌కు అభినంద‌న‌లు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పునాది వేసింది. భూసేకరణ, అనుమతులు, టెండర్లు అన్నీ మా ప్రభుత్వమే పూర్తి చేసింది. జీఎంఆర్‌ సంస్థ ఇచ్చిన మాట ప్రకారం ట్రయల్‌ రన్‌ జరగడం సంతోషకరం, జూన్‌లో పూర్తి స్థాయిలో ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్న జీఎంఆర్‌కు వైయస్‌ఆర్‌సీపీ తరపున అభినందనలు. అయితే ఎయిర్‌పోర్టుకు అవసరమైన కనెక్టివిటీ, విస్తృత రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్య‌మంత్రి హోదాలో విదేశాల‌కు వెళ్తున్నారంటే ప్ర‌జ‌ల‌కు జ‌వాబు చెప్పాలి క‌దా? ఏ ఊరు వెళ్తున్నారో చెప్ప‌కుండా ఇలా విదేశాలు వెళ్లిన ముఖ్య‌మంత్రి దేశంలో ఎవ‌రూ లేరు. రాష్ట్రం ఎటుపోతుందో ప్ర‌జ‌లు ఆలోచ‌న చేయాలి.  ప్రజలను మోసం చేస్తూ, సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Back to Top