చంద్రబాబు మరో స్కామ్‌ ఇందాపూర్‌ డెయిరీ

ఆ డెయిరీ పేరుతో హెరిటేజ్‌కు దోచి పెట్టేందుకు కుట్ర

టీటీడీకి నెయ్యి కాంట్రాక్ట్‌ దక్కించుకునే కుతంత్రం

అందుకే లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారంటూ నిందలు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు. దుష్ప్రచారం

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.

ఇందాపూర్‌ డెయిరీతో చంద్రబాబు కుట్ర బట్టబయలు

సభలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం పారిపోయింది

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫైర్‌

ఇందాపూర్‌ డెయిరీ, హెరిటేజ్‌ డెయిరీలు వేర్వేరు కాదు

హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా ఇందాపూర్‌ డెయిరీ

గుట్టు రట్టు కావడంతో, వెబ్‌సైట్‌లో వివరాలు మార్చిన హెరిటేజ్‌

ఇందాపూర్‌ డెయిరీని కో–మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా చూపిన హెరిటేజ్‌

ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ వెల్లడి 

ఇకనైనా కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు మానాలి

ధైర్యముంటే ఇందాపూర్‌ డెయిరీపై చర్చకు ముందుకు రావాలి

రైతులకు ఏ మాత్రం న్యాయం చేయని ప్రభుత్వం

ఉద్యోగాల కల్పనపైనా ప్రభుత్వం అసత్యాల మాటలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ఆక్షేపణ

అసెంబ్లీ మీడియా పాయింట్, వెలగపూడి: చంద్రబాబు మరో స్కామ్‌ ఇందాపూర్‌ డెయిరీ అని, ఆ డెయిరీ పేరుతో హెరిటేజ్‌కు దోచి పెట్టేందుకు ఆయన కుట్ర చేశారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టీటీడీకి నెయ్యి కాంట్రాక్ట్‌ దక్కించుకునే కుతంత్రం చేసిన చంద్రబాబు, తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడారంటూ నిందలు వేశారని, వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వంపై విమర్శలు, దుష్ప్రచారం చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఇందాపూర్‌ డెయిరీ వ్యవహారంతో చంద్రబాబు కుట్ర బట్టబయలు అయిందని, అందుకే సభలో తాము చర్చకు పట్టుబడితే ప్రభుత్వం పారిపోయిందని అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడిన బొత్స సత్యనారాయణ చెప్పారు.

మీడియాతో మాట్లాడిన బొత్స ఇంకా ఏమన్నారంటే..:

చంద్రబాబు మరో స్కామ్‌ ఇందాపూర్‌ డెయిరీ:
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో భారీ ఎత్తున ప్రజల సంపదను తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి కట్టబెట్టడానికి చంద్రబాబు పూనుకున్నాడని, ఆ దుర్బుద్దితోనే కల్తీ నెయ్యి పేరుతో శ్రీవారి ప్రసాదంపై నిందలు మోపాడు. దోపిడీ ధ్యేయంగా తిరుమల వేంకటేశ్వరుడి లడ్డూ పేరుతో చంద్రబాబు చేసిన కుట్రలు బట్టబయలయ్యాయి. అందుకే ఇందాపూర్, హెరిటేజ్‌ అనుబంధం గురించి మండలిలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం పారిపోయింది. 

అందుకే లడ్డూపై దుష్ప్రచారం:
    ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో భక్తితో పూజించే కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూశాడు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సహా కూటమి నాయకులు దుష్ప్రచారం చేశారు. అయితే జంతువుల కొవ్వు కలిసిందంటూ వారు చేసిన ప్రచారమంతా పచ్చి అబద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్, ఛార్జిషీట్‌తో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే లడ్డూపై దుష్ప్రచారం చేయడం వెనుక ఉన్న దుర్బుద్ధి బయట పడింది. తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ డెయిరీకి లాభం చేకూర్చడానికి దేవుడి లడ్డూని వాడుకున్నాడు. పనిలో పనిగా వైయస్‌ జగన్‌ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి భారీ కుట్ర చేశాడు. 

2014–19 మధ్య నెయ్యి కాంట్రాక్టులు ఇందాపూర్‌ డెయిరీకే:
    2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులను ఇందాపూర్‌ డెయిరీ అనే సంస్థ ముసుగులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెట్టారు. ఈ ఇందాపూర్‌ డెయిరీ అనేది హెరిటేజ్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థే. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్‌పర్సన్‌గా ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు దేశంలో పాలు, పాల ఉత్పత్తులు (డెయిరీ ప్రొడక్ట్స్‌) తయారు చేసే 22 సంస్థలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ‘ఇందాపూర్‌ డెయిరీ అండ్‌ మిల్క్‌  ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌’ కూడా వాటిలో ఒకటి. ఆ ఇందాపూర్‌ డెయిరీకే ఏకపక్షంగా 2014–19లో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు ఇందాపూర్‌ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్‌ 2016లో ల్యాబ్‌ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డెయిరీపై అనర్హత వేటు వేశారు. కానీ కేవలం ఆరు నెలల్లోనే ఆ అనర్హతను తొలగించారు. ఆ తర్వాత 2019లో అధికారం నుంచి దిగిపోయే వరకు ఇందాపూర్‌ డెయిరీకి వందల కోట్ల విలువైన నెయ్యి కాంట్రాక్టులు అప్పగించారు.
    2019లో టీడీపీ అధికారం కోల్పోగానే హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన ఇందాపూర్‌ డెయిరీ టీటీడీ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకుంది. అయిదేళ్ల పాటు కనీసం బిడ్లు కూడా దాఖలు చేయలేదు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మళ్లీ తెరపైకి వచ్చింది. 2025 డిసెంబరులో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొంది. 

హెరిటేజ్‌ డెయిరీకి ఇందాపూర్‌ ముసుగు:
    ఇందాపూర్‌ డెయిరీకి హెరిటేజ్‌ డెయిరీతో ఉన్న అనుబంధం గురించి హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లోనే స్పష్టంగా రాసి ఉంది. ఇందాపూర్‌ డెయిరీని మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్స్, ఫ్యాక్టరీల అడ్రస్‌ల పేరుతో స్పష్టంగా రాసుకుంది. ఇండోర్‌ అడ్రస్‌తో 17వ యూనిట్‌గా ఇందాపూర్‌ డెయిరీ గురించి రాశారు. ఈ ఇందాపూర్‌ డెయిరీ ద్వారానే హెరిటేజ్‌ ఫుడ్స్‌ తిరుమలకు నెయ్యి తయారు చేసినట్టు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియగానే హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఇందాపూర్‌ ప్లాంట్‌ను అనుబంధ సంస్థగా మార్చేసి మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారు. వెబ్‌సైట్‌లో అప్పటి వరకు ఇందాపూర్‌ డెయిరీని మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల జాబితాలో చూపిన హెరిటేజ్‌ డెయిరీ, తమ వ్యవహారం బట్టబయలు కావడంతో.. ఇందాపూర్‌ డెయిరీని మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల జాబితా నుంచి తొలగించి, కో–మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లలో చేర్చారు.

చర్చకు ప్రభుత్వం భయపడింది:
    హెరిటేజ్‌ డెయిరీతో ఇందాపూర్‌ డెయిరీతో ఉన్న అనుబంధం గురించి చర్చించాలని మండలిలో వైయ‌స్ఆర్‌సీపీ పట్టుబడితే ప్రభుత్వం భయపడి పారిపోయింది. రూ.300కు స్వచ్ఛమైన కేజీ నెయ్యి వస్తుందా అని మాట్లాడిన చంద్రబాబు మాటల వెనుక మర్మం ఇందాపూర్‌ డెయిరీకి డబుల్‌ రేటుకి నెయ్యి కాంట్రాక్టు కట్టబెట్టడమేనని తేలిపోయింది. 
    2025 డిసెంబరులో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొన్న ఇందాపూర్‌ డెయిరీ.. రూ.658కి కేజీ నెయ్యి సరఫరా చేస్తామని కోట్‌ చేసింది. దీంతో అదే ధరకు నెయ్యి సరఫరా చేసేలా, గత ఏడాది డిసెంబరులో టీటీడీ ఇందాపూర్‌ డెయిరీకి కాంట్రాక్ట్‌ ఖరారు చేసింది. 
    అధిక ధరలకు హెరిటేజ్‌కి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడానికి తిరుమల లడ్డూ గురించి చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. దోచుకోవడం కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం కన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేస్తూ భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం సిగ్గుచేటు. 

చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు:
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో చంద్రబాబు హెరిటేజ్‌ డెయిరీకి వందల కోట్లు దోచిపెట్టడానికి సిద్ధపడ్డాడు అనేది సుస్పష్టం. అందులో భాగంగానే కల్తీ నెయ్యి ముసుగులో రాజకీయ వికృత క్రీడకు దిగాడు. టాయ్‌లెట్లు క్లీన్‌ చేసే కెమికల్స్‌ని కూడా లడ్డూ తయారీకి వాడారని చెప్పడం సిగ్గుచేటు. ఇది క్షమించరాని తప్పు. దోపిడీ చేయడమే ధ్యేయంగా దేవదేవుడి మీద నిందలు మోపిన వారిని ఆ దేవుడు క్షమించడు.
    ఇందాపూర్‌ డెయిరీపై మండలిలో చర్చ జరిగితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్న భయంతోనే ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయింది. కల్తీ ముసుగులో అడ్డగోలుగా తప్పులు చేసిన చంద్రబాబు దేవుడి ముందు దొరికిపోయాడు. అధికారం గర్వంతో ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కల్తీ నెయ్యి పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దేవుడి ముసుగులో చంద్రబాబు చేసిన దారుణాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

వ్యక్తిగత ప్రతిష్ట పెంపునకే బిల్‌గేట్స్‌కు ఆహ్వానం:
    చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత లబ్ధి మాత్రమే తప్ప.. ప్రజాప్రయోజనాలను అస్సలు పట్టించుకోడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడని తిరుమల లడ్డూ పేరుతో చేసిన కుట్రలే రుజువు చేస్తున్నాయి. వ్యక్తిగత ప్రతిష్ట కోసమే బిల్‌గేట్స్‌ని పిలిపించుకుని చంద్రబాబు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఇంటింటికీ ఉచిత వైద్యం అందించేలా విలేజ్‌ క్లీనిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు నిర్వీర్యం చేశాడు. నాడు వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న విద్య, వ్యవసాయ రంగాలను నాశనం చేసిన చంద్రబాబు.. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారం పేరుతో బిల్‌గేట్స్‌ని పిలిపించి పబ్లిసిటీ చేసుకోవడం దుర్మార్గం. వైయ‌స్ఆర్‌సీపీ మీద అడుగడుగునా బురద జల్లడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. సభ్యుల హాజరు నమోదు చేయడానికి అసెంబ్లీలో ఫేస్‌ రికగ్నిషన్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, కౌన్సిల్‌లో ఆ పని ఎందుకు చేయడం లేదు?.

పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
:పి.రామసుబ్బారెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో శనగ పంటను విస్తారంగా సాగు చేస్తారు. పంట కోతలు పూర్తయి 25 రోజులవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం శనగ పంటకు రూ.5,650 మద్ధతు ధర ప్రకటించినా రైతులకు గిట్టుబాటు కావడం లేదనుకుంటే, దళారులు రూ.4,600లకు మించి కొనుగోలు చేయడం లేదు. అలా ఒక్కో క్వింటాకు రూ.1000 చొప్పున, ఎకరాకు రూ.10 వేల చొప్పున శనగరైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో శనగ మాత్రమే కాకుండా జొన్న, మొక్కజొన్న పంటలను రైతు తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం తక్షణం మద్ధతు ధరలు పెంచడంతో పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేయాలి. 

ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి
:కల్పలతారెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో కూటమి చేస్తున్న కుట్రలపై వైయ‌స్ఆర్‌సీపీ తరఫున వాయిదా తీర్మానం కోరితే ప్రభుత్వం చర్చించకుండా పారిపోయింది. రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు చేసిన కుట్రలు బయటపడటంతో కూటమి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ లో స్పష్టంగా చెప్పినప్పటికీ దుష్ప్రచారం ఆపలేదు. దేవుడి మీద తప్పుడు ప్రచారం చేయడం చేసి మత రాజకీయాలు చేయడం మానుకోవాలి. దేవుడి లడ్డూ పేరుతో చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమేనని ప్రజలకు తెలిసిపోయింది.  

ఇందాపూర్‌పై విచారణకు చంద్రబాబు సిద్ధమా?.
:వరుదు కళ్యాణి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– దేవదేవుడి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు సహా కూటమి నాయకులంతా చేయకూడని తప్పుడు ప్రచారం చేసి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇందాపూర్‌ డెయిరీకి రెట్టింపు ధరకు నెయ్యి కాంట్రాక్టును కట్టబెట్టడం కోసం చంద్రబాబు దిగజారి ప్రవర్తించిన తీరుతో కూటమి నాయకులంతా సిగ్గుపడాలి. కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా దేవదేవుడి ప్రతిష్టను మసకబార్చడానికి కూడా వెనుకాడలేదు. సున్నితమైన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసి సిబీఐ సిట్‌ చార్జిషీట్‌తో అడ్డంగా దొరికిపోయారు. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా పతనం కావాల్సిందేనని లడ్డూ వివాదం తర్వాతైనా కూటమి నాయకులకు తెలిసి రావాలి. ఇందాపూర్‌ డెయిరీకి, హెరిటేజ్‌ డెయిరీతో ఉన్న వ్యాపార సంబంధాలపై విచారణ చేయించడానికి చంద్రబాబు సిద్ధమా? 

ఉద్యోగాల భర్తీపై తప్పుడు ప్రకటన.
:రమేష్‌యాదవ్‌. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.

– సూపర్‌ సిక్స్‌ పేరుతో కూటమి ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను రెండేళ్లయినా నెరవేర్చకుండా పూర్తిగా గాలికొదిలేశారు. గత రెండు బడ్జెట్‌లలో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వదిలేసిన కూటమి ప్రభుత్వం.. మూడో బడ్జెట్‌లో సైతం నిరుద్యోగులు, ఆడబిడ్డలకు హ్యాండిచ్చింది. కూటమి ప్రభుత్వం మోసం చేయడంతో ఇప్పటివరకు 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందని వైయ‌స్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే 5,72,280 ఉద్యోగాలిచ్చేశామని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన డీఎస్సీ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి 20 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. కానీ 5,72,280 ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ఇస్తోంది.

Back to Top