ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి..

రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించింది

ఈనాడు తప్పుడు కథనాల‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫైర్‌

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఈనాడు పత్రిక దగ్ధం చేసిన నేతలు

కర్నూలు: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రిక అసత్య కథనాలు రాస్తోందని, వారికి అనుకూలమైన వ్యక్తి చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతోనే ఈనాడు పత్రిక దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మండిపడ్డారు. ఈనాడు తప్పుడు కథనాలపై వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఫైరయ్యారు. కలెక్టరేట్‌ వద్ద ఈనాడు పత్రికను దగ్ధం చేశారు. అనంతరం కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, మేయర్‌ బీ.వై.రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ఘటనకు సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఈనాడు పత్రిక తప్పుడు వార్తను సృష్టించిందని మండిపడ్డారు. పత్రికా విలువలను తుంగలో తొక్కే విధంగా ఎల్లో మీడియా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. రామోజీరావుకు వయసు పెరిగి.. బుద్ధి మందగించిందన్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలను రాయాలన్నారు. 

ప్రజలను మోసం చేయాలని ఈనాడు కుట్ర
చంద్రబాబుకు అనుకూలంగా ఎల్లో మీడియా పనిచేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. సంబంధం లేని ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసం చేయాలని ఈనాడు పత్రిక యాజమాన్యం కుట్ర చేసిందని, సోషల్‌ మీడియా దెబ్బకు దిగొచ్చి క్షమాపణ కోరిందన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తుంటే.. దాన్ని జీర్ణించుకోలేక నిత్యం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవాలను రాయాలని, లేనిపక్షంలో ప్రజల్లో మరింత చులకన అయిపోతారని హెచ్చరించారు. 

చంద్రబాబు మాత్రం బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతం
ఈనాడు పత్రిక పుట్టిందే అసత్య వార్తలు రాయడానికి అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. ఈనాడు పత్రిక ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అని, అబద్ధాలు రాసేందుకు రామోజీరావు ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నాడన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు చంద్రబాబు మాత్రం బాగుండాలనేది రామోజీరావు సిద్ధాంతమని, రాష్ట్ర ప్రయోజనాలకు, అభివృద్ధిని అడ్డుకోవడమనే ఏకైక లక్ష్యంతో ఈనాడు పత్రిక పనిచేస్తోందని ధ్వజమెత్తారు. 
 

Back to Top