కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి

15 మండలాలకే పరిమితం చేయడం దారుణం 

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు: కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కేవలం 15 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేక కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వివిధ కారణాలు చూపుతూ తక్కువ సంఖ్యలో మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం వల్ల మిగిలిన ప్రాంతాల రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ రంగంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.

పంటలు సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, వర్షాభావంతో పంటలు సాగు చేయలేని ప్రాంతాల్లో ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పంటల బీమా సదుపాయం లేకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి తక్షణ సహాయక చర్యలు అందడం లేదని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.

Back to Top