కర్నూలు: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకువచ్చారని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమానికి సంబంధించిన 104 వాహనాలను మంత్రి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, మేయర్ బీవై రామయ్య, వైయస్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైయస్ జగన్ సర్కార్ కీలక ముందడగు వేసిందన్నారు. ప్రాథమికంగా ప్రజలకు వైద్య సేవల్ని మరింత బలోపేతం చేయాలని.. మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. నిపుణుల కమిటీ సిఫార్సులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, భాగస్వాములతో సమగ్రంగా చర్చలు జరిపిన తర్వాత సెకండరీ, టెరిటరీ ఆస్పత్రులపై పెరుగుతున్న రోగుల భారాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సీఎం వైయస్ జగన్ అందుబాటులోకి తెచ్చారన్నారు.
దేశంలోనే తొలిసారి ఏపీలో అమలు: డాక్టర్ సతీష్
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను దేశంలోనే తొలిసారి ఏపీలో అమలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఎన్‌సిడి స్క్రీనింగ్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్‌ను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అవసరమైన వారికి, NCD కేసులకు ఫ్యామిలీ డాక్టర్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుందన్నారు.ఈ NCDని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను సాధించొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు.
ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్యాధికారి, మిగిలిన బృందం గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను నెలలో రెండుసార్లు సందర్శిస్తారని ఆదిమూలపు సతీష్ చెప్పారు. అక్కడ ట్రీట్మెంట్‌తో పాటూ ఆరోగ్య శ్రీ సేవలపైనా సమన్వయం చేస్తారని.. ప్రాథమిక వైద్య సేవల్లో భాగంగా.. ప్రతి 2వేలమందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని.. ఈ క్లినిక్‌లకు వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌గా నామకరణం చేశామన్నారు. 6,313 సబ్ సెంటర్స్.. అలాగే మరో 3,719 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు అయినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10, 032 వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఒక్కో క్లిన్ పరిధిలో 2వేలమందికి సేవలు అందిస్తారన్నారు. అలాగే ప్రతి 5వేలమంది జనాభాకు హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో ఓ ఏఎన్‌ఎం, ఒక ఎమ్‌ఎల్‌హెచ్‌పీ (Mid-Level Health Provider renamed as Community Health Officer-CHO), ఆశా వర్కర్లు సేవలు అందిస్తారు. ఈ విలేజ్ క్లినిక్‌లలో అన్ని రకాల వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంటాయి. గ్రామ స్థాయిలో నయం కాని ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. చిన్న పిల్లలు, గర్భిణిలకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ విలేజ్ క్లినిక్‌లకు టెలీ మెడిసిన్, టెలీ హబ్‌ల ద్వారా మెడికల్ ఆఫీసర్‌తో పాటూ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత మెల్లిగా వైద్య సేవలను ఇంటికే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఆశా వర్కర్లు వైద్యం అవసరమైన వారిని గుర్తిస్తారని చెప్పారు.
ఈ హెల్త్ క్లినిక్‌ల ద్వారా 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ కిట్స్.. 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. అలాగే రాష్ట్రంలో ప్రతి పౌరుడికి.. వారి ఇంటి వద్ద పరీక్షలు జరిపి వారి ఆరోగ్య సమాచారాన్ని " డిజిటలైజ్" చేస్తారు. ప్రతి పౌరుడి వివరాలు , వారి అనుమతి తీసుకోని, డిజిటలైజ్ చేస్తారు. ప్రతి పౌరుడికి డిజిటల్ HEALTH ID ఇస్తారు. ఈ ID కేంద్ర ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ఉందన్నారు.