తాడేపల్లి: చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి లు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని (వెంకట్రామయ్య) మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీనిలో భాగంగానే వారు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వైయస్ఆర్‌సీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు అసత్యలతో కూడిన పోస్టులను పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం జరిగినా, ఆలయ ఆస్తుల దోపిడీ జరిగిన గత బీజేపీ- టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తే వైయస్సార్సీపీ ఆలయంలో స్వామి వారి మూర్తులను ప్రతిష్టించడంతో పాటు ఆలయాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. ఆనాడు అంతర్వేది రథాన్ని దహనం చేస్తే దానిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ నాటి సీఎం వైయస్ జగన్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. నేడు కూటమి పాలనలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి వేల కోట్ల విలువైన ఆలయ భూములను కూటమి నేతలు పంచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఈ దారుణాలన్నీ మాధవ్, పురందేశ్వరి కళ్ళకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఎక్కువగా కూల్చేసినా, హిందూ మతానికి అవమానం జరిగినా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసున్నప్పుడే జరుగుతుంది. పాపాలన్నీ చేసేది, చేయించేది, చేస్తుంటే చూస్తూ ఊరుకునేది వాళ్లే. కానీ హిందూ మతం ముసుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడమే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒకేరోజు, ఒకే సమయానికి కూడబలుకున్నట్టుగా అక్షరం పొల్లుపోకుండా ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. గతంలో జరిగిన విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహ ధ్వంసం, నారసింహుడి రథం తగలబడిపోయిన ఘటనలను ఉటంకిస్తూ ఇప్పుడు బురద జల్లడానికి పూనుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాసి పంపించిన మేటర్‌ని వీళ్లు తమ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమా వీళ్లు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నది? ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ మాదిరిగా వీళ్లు కూడా ఏపీ బీజేపీని టీడీపీకి అద్దెకిచ్చేశారా అనిపిస్తుంది. వాస్తవాలను వక్రీకరించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లడమే చంద్రబాబు ధ్యేయం అయితే అందుకు సహకరించే పాత్రధారులే మాధవ్, పురంధరీశ్వరి. - రామతీర్థంలో ఆలయం, అంతర్వేదిలో రథం ఇచ్చాం రామతీర్థంలో రఘురాముడి విగ్రహం తలను ధ్వంసం చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అన్న విషయం వారికి తెలియదా? విగ్రహం తలను ధ్వంసం చేసిన నిందితుడైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసి శిక్షించకుండా సీఎంఆర్ఎఫ్ కింద రూ.5 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో తీసుకున్న ఫొటోను కూడా మాధవ్, పురందేశ్వరి పోస్ట్ చేస్తే బాగుండేది. అపచారం జరిగిన వెంటనే నాటి సీఎం వైయస్ జగన్ కొత్త విగ్రహాలను తయారు చేయించి విగ్రహ ప్రతిష్టాపన చేయడంతోపాటు గుడిని అభివృద్ది చేశారు. వైయస్సార్సీపీ హయాంలోనే తిరుపతిలో శిథిలావస్థకు చేరిన వకుళామాత ఆలయాన్ని పునర్ నిర్మాణం చేశాం. ఇవన్నీ వారు తమ పోస్ట్‌లో ఎందుకు రాయలేదు? అంతర్వేదిలో నారసింహుడి రథాన్ని దుండగులు తగలబెడితే వెంటనే కొత్త రథాన్ని తయారు చేయించడంతో పాటు తానే స్వయంగా వచ్చి గుడికి అందచేసిన ఘనత కూడా నాటి సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుంది. దాంతో పాటు ఈ రథం తగలబెట్టిన అంశంపై సీబీఐతో విచారణ జరిపించమని నాడే కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. దీనిపై ఎందుకు విచారణ చేయించడం లేదని అమిత్‌షాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి అడగొచ్చు కదా. ఇవన్నీ వీళ్లిద్దరూ మర్చిపోయారు? - ఈ దారుణాలన్నీ ఎలా మర్చిపోయారు? తాడేపల్లిగూడెంలో బీజేపీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెంటపాడు అనే గ్రామంలో స్వామివారి ఆలయంలో రథాన్ని దహనం చేస్తే కేసు లేదు. కొత్త రథం తయారు చేసి ఇవ్వలేదు. దీన్ని మర్చిపోదామా? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వేయి కాళ్ల మండపాన్ని నాటి సీఎం చంద్రబాబు తిరుమలలో ధ్వంసం చేయించిన విషయాన్ని ఎలా మర్చిపోయారు? చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని ఇటీవలే కూల్చేశారు. నేడు బీజేపీ-టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండి ఏం చేశారు? ఆలయాన్ని ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన ముద్దాయిని ఎలా మర్చిపోయారు? ఇవి కాకుండా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. సింహాచలంలో అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలి భక్తులు మరణించారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే ముక్కోటి ఏకాదశి సందర్భగా గతేడాది తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనం టోకెన్ల కోసం వెళ్లినప్పుడు క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటతో అమాయకులైన భక్తులు అసువులు బాశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకనే వైయస్సార్ కడప జిల్లాలో ప్రసిద్ధ కాశినాయన క్షేత్రాన్ని కూల్చివేశారు. ఇదే ఆలయానికి అటవీశాఖ భూములు కేటాయించాలని సీఎంగా ఉండగా 2023 ఆగస్టులో వైయస్ జగన్ కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాశారు. అంతేకాదు ఈఏడాది జనవరి 1న కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి మరోసారి లేఖ రాశారు. కానీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఆలయ సత్రాన్ని కూల్చివేసింది. శ్రీకాకుళం జిల్లా కూర్మం అనే గ్రామంలో సాధువులు నివసిస్తుంటే ఆ గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడలో 200 ఆలయాలను ధ్వంసం చేశారు. ఆనాడు దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే ఉన్నాడు. దీనికి ఎంపీ పురందేశ్వరి, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమాధానం చెప్పాలి. ఈ దారుణాలన్నీ ఎలా మర్చిపోయారు? - ఆలయ భూములపై కూటమి నేతల కన్ను విజయవాడకి ఆనుకుని గొల్లపూడి పంచాయతీలో మచిలీపట్నం గొడుకుపేటకు చెందిన నలభై ఎకరాల శ్రీ వేంకటేశ్వరస్వామి భూమిని తెలుగుదేశం నాయకులు కబ్జా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మీ కంటికి కనిపించడం లేదా? 2019కి మందు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని వైయస్ జగన్ సీఎం అయ్యాక రూ.1.80 కోట్లతో పునర్ నిర్మించారు. చినజీయర్ స్వామీజీతో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని గాలికొదిలేసింది. 40 ఎకరాల భూమిని కాజేయడానికి మాత్రం తెలుగుదేశం నాయకులు వ్యూహ రచన చేశారు. దీని గురించి ఏనాడైనా మాట్లాడారా? కూటమి నాయకులు దేవుడి ఆస్తిని దోచుకుతింటుంటే మీ కంటికి కనిపించడం లేదా? భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఐదెకరాల భూములు రాసిచ్చేందుకు కలెక్టర్ లెటర్ రాయడం ఇంకా దారుణం. ఐదెకరాల్లో గోల్ప్ క్లబ్ ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పనేనా? మీకు తెలియదా? మరో 35 ఎకరాలు విజయవాడ ఉత్సవ్ పేరుతో ఏటా ఉత్సవాలు నిర్వహించేలా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ దోపిడీ వెనుక ఉన్నది తెలుగుదేశం నాయకులు కాదని వీరిద్దరూ చెప్పగలరా? ఈ 40 ఎకరాల వ్యవసాయ భూమిలో రాత్రికిరాత్రే నాలుగు అడుగుల మేర మట్టి తోలి చదును చేస్తే ఆ విషయం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే మాధవ్, పురందేశ్వరి లకు కనిపించడం లేదా? - రూ.400 కోట్ల విలువైన దేవుడి భూమిని కాజేసేందుకు స్కెచ్ మూడు రోజుల క్రితమే ఈనెల 8వ తేదీన నియోజకవర్గంలోని మంత్రి కొల్లు రవీంద్ర క్యాంప్ ఆఫీసులో టీడీపీ నాయకుడు పట్టాభి, ఆలయ పాలకవర్గంతో సమావేశమై ఏం గూడుపుఠాణీ చేశారో ప్రజలకు తెలియాలి. విజయవాడ ఉత్సవ్ పేరుతో మొదట రెండు మాసాలకు తాత్కాలికంగా అద్దెకు తీసుకుని ఆ తర్వాత కాజేయాలని చూస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి రూ. 400 కోట్ల విలువైన 40 ఎకరాల దేవుడి భూములను కాజేసేందుకు వ్యూహ రచన చేయడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని నాటి సీఎం వైయస్ జగన్‌ని తిట్టినందుకు ప్రతిఫలంగా పట్టాభికి దేవుడి ఆస్తులు రాసిచ్చేస్తారా? ఇంత దారుణంగా బరితెగుస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నట్టు? భూములు కాపాడాల్సిందిపోయి వారికి వంతపాడటం న్యాయమా? కలెక్టర్‌ని వీరిద్దరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? బహిరంగ వేలం ద్వారా మాత్రమే దేవుడి ఆస్తులను లీజుకివ్వడమో లేదా అమ్మకం చేయాలని కోర్టులు బలంగా తీర్పులు ఇచ్చి ఉన్నాయి. అంతేకానీ అప్పనంగా ఇచ్చేస్తామంటే కోర్టులు ఒప్పుకోవు. కోర్టు ఆదేశాలను కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదు. ఆలయ భూముల్లో మెరక తోలితే కలెక్టర్ దాన్ని ఎందుకు తీయించలేదు? నిందితుల మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఒక పక్క ఆలయ భూముల అవినీతిలో 20 శాతం వాటాదారుడైన మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నంలో ప్రెస్‌మీట్ పెట్టి కలెక్టర్‌ని తిట్టి భూములు కాపాడేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఆలయ భూములపై ఎవరూ నోరెత్తకుండా మంత్రి మేనేజ్ చేస్తే రెండు నెలల్లో లీజు ఆర్డర్ తెస్తానని పట్టాభి చెప్పుకు తిరుగుతున్నాడు. దేవుడి ఆస్తులను వాటాలేసుకుని పంచేసుకుంటుంటే విశ్వహిందూ పరిషత్ పట్టించుకోదా? ఈ దోపిడీని వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. కోర్టులను ఆశ్రయించి కాపాడుకుంటాం. పాపాలను మూటకట్టుకుని మళ్లీ పాపాలు చేస్తున్న పాపాత్ములను ప్రశ్నించకుండా ఆలయాలను కాపాడుతున్న వైయస్సార్సీపీ మీద బురదజల్లుదామని చూస్తే ఊరుకునేది లేదు. వారి తప్పులను తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ... - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. మెడికల్ కాలేజీల పెండింగ్ పనులను పూర్తి చేసి అడ్మిషన్లు నిర్వహించకుండా క్లోజ్ చేసింది. తీరా 15 నెలల తర్వాత పీపీపీ పేరుతో అప్పనంగా తన వారికి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇదే జరిగితే పేదవాడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందే పరిస్థితి ఉండదు. అందుకే ఎన్ని ఒప్పందాలు జరిగినా అధికారంలోకి వచ్చాక వాటిని ప్రభుత్వం తీసుకుంటుందని, ఈ విషయంలో రెండోమాటకు తావులేదని మా అధ్యక్షులు వైయస్ జగన్ స్పష్టంగా చెప్పారు.