కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్‌ అక్రమం

వైయస్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అక్ర‌మ‌మ‌ని వైయస్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్ అయ్యారు. ఇవాళ‌ ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించ‌డాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్‌ చేయడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఏమన్నారంటే..:

ఆ పార్టీల వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? : తూమాటి మాధవరావు. ఎమ్మెల్సీ.
 టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులు హత్య అని ప్రచారం చేశారు. తెలుగుదేశం అధికారిక సోషల్‌ మీడియాలోనూ విస్తృతంగా అది హత్య అని ప్రచారం చేశారు. కానీ వారిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఆధారాలు లేకుండా హత్య అని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించినందుకు వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అక్రమ కేసులోఅరెస్టు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే వెంకటరెడ్డి మీద ఈ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టడం సిగ్గుచేటు.
సతీష్‌కుమార్‌ మృతి విషయం బయటకొచ్చిన వెంటనే టీడీపీ నాయకులు హత్య అని ప్రచారం చేస్తుంటే వారిని కట్టడి చేయలేకపోయింది. కానీ, హత్య అని ఏ ఆధారాలతో చెబుతున్నారని ప్రశ్నించినందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడి మీద కేసు పెట్టి మరోసారి డైవర్షన్‌ పాలిటిక్స్‌కి తెర దీసింది. ఈ కేసు గురించి మాట్లాడటమే తప్పయితే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదో సమాధానం చెప్పాలి. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కడమే ధ్యేయంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. వెంటనే కారుమూరి వెంకటరెడ్డిని విడుదల చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ  డిమాండ్‌ చేస్తోంది. 

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు:టీజేఆర్‌ సుధాకర్‌బాబు. వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు.
వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండు వర్గాల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ తప్పుడు ప్రచారం ఏంటని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు. తెలుగుదేశం పార్టీ అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గొంతు విప్పుతున్న వారిని భయపెట్టాలనే కుట్రల్లో భాగంగానే కారుమూరిని అరెస్ట్‌ చేశారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు పోలీస్‌ వ్యవస్థను తమ జేబు సంస్థగా మార్చేసుకున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షం మీద అక్రమ కేసులు పెడుతున్నారు.

Back to Top