డిజైన్ల మార్పుతో..పెరిగిన పోలవరం హెడ్‌ వర్క్స్‌ వ్యయం

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు జల్‌ శక్తి మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : పోలవరం హెడ్‌ వర్క్స్‌ డిజైన్లలో జరిగిన మార్పుల వలన హెడ్‌ వర్క్స్‌ వ్యయం రూ. 5,535 కోట్ల నుంచి 7,192 కోట్లకు పెరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి  గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైయ‌స్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పోలవరం హెడ్‌ వర్క్స్‌లో డిజైన్ల మార్పు కారణంగా పెరిగిన అదనపు వ్యయాన్ని కేంద్రం భరించేది, లేనిది సూటిగా చెప్పకుండా జవాబును దాటవేశారు. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రాజెక్ట్‌ డిజైన్లు గోదావరి జలాల ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవో లేదో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించి ఆమోదించిన మీదటే వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని మంత్రి షెకావత్‌ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు చేసింది. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి చెప్పారు. 

విశాఖలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుపై అధ్యయనం
 విశాఖపట్నంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ప్రాధమిక అధ్యయనం జరుగుతున్నట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ జైరామ్‌ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలోని 35 నగరాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు ఆర్థిక వ్యవహాల కేబినెట్‌ కమిటీ ఆదేశించింది. లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు గుర్తించిన నగరాలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. ఎంఎంఎల్‌పీ అభివృద్ధి చేయడానికి ముందు ఆ ప్రాంతంలో సప్లై, డిమాండ్‌తోపాటు ఆచరణ సాధ్యతను అంచనా వేయడానికి ప్రాధమిక అధ్యయనం జరుగుతుందని మంత్రి తెలిపారు. విజయవాడలో ఎంఎంఎల్‌పీ ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనం పూర్తయింది. ప్రస్తుతం అక్కడ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు ఆశించినంత డిమాండ్‌ లేనట్లు అధ్యయనంలో వెల్లడైందని మంత్రి చెప్పారు. ఇక విశాఖపట్నంకు సంబంధించి ఈ తరహా ప్రాధమిక అధ్యయనం కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. 

పడో పర్దేష్‌తో 9,389 మైనార్టీ విద్యార్ధులకు లబ్ధి
 పడో పర్దేష్‌ పథకం కింద 2018-19 నుంచి 2020-21 వరకు 9,389 మంది మైనారిటీ విద్యార్ధులు లబ్ధి పొందినట్లు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి  ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి తెలిపారు. రాజ్యసభలో  ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ పడో పర్దేష్‌ పథకం కింద ఏటా 400 మంది మైనారిటీ విద్యార్ధులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గడచిన మూడేళ్ళలో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్ధులందరికీ పథకాన్ని విస్తరింపచేసినట్లు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top