విశాఖ నగరం ముస్తాబు 

 రేప‌టి నుంచి గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌

విశాఖకు పారిశ్రామిక దిగ్గజాలు..

స‌ద‌స్సులో పాల్గొన‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, కేంద్ర మంత్రులు

అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023కోసం విశాఖ నగరం ముస్తాబైంది. 26 దేశాల నుంచి సుమారు 8 వేల మంది హాజరుకానున్న ఈ భారీ పెట్టుబడుల సదస్సు నగరంలోని అన్ని రంగాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సదస్సు ప్రారంభం కాకముందే.. ఆతిథ్య రంగం మోములో చిరునవ్వులు తీసుకొచ్చింది. 

ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో పాల్గొనేందుకు కార్పొరేట్‌ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి. విశాఖ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్  నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం. గత సర్కారు మాదిరిగా ఆర్భాటాలు కాకుండా వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది.  

నగరానికి కార్పొరేట్లు, కేంద్ర మంత్రులు  
దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొంటున్నారు.

ప్రత్యేక అతిథులుగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ బజాజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ నవీన్‌ జిందాల్, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు, రెన్యూ పవర్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమంత్‌ సిన్హా, దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఎండీ పునీత్‌ దాల్మియా , సైయెంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సెంచురీ ప్లేబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ప్లానెట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య త్రిపాఠి, పెగాసస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సీఈవో క్రైగ్‌ కాట్, పార్లే ఫర్‌ ది అడ్వైజర్స్‌ ఓషన్స్‌ సిరిల్‌ గచ్, శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ మోహన్‌ బంగర్, ఒబెరాయ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ ఒబెరాయ్, టెస్లా కో¸ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.

ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి శర్బానంద సోనావాల్, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుచిత్రా ఎల్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి, వెల్‌ప్సన్‌ గ్రూపు ఎండీ రాజేష్‌ మండవేవాలా, క్రీడాకారిణి పీవీ సింధు పాల్గొంటారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ షెడ్యూల్ ఇలా..

నేటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వైజాగ్‌లో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం పాల్గొనున్నారు. రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస చేస్తారు.

3వ తేదీ షెడ్యూల్‌:
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.

4వ తేదీ షెడ్యూల్‌:
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top