ఎన్టీఆర్‌ గుండెల్లో చంద్రబాబు గునపం

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ 

ఎన్టీఆర్‌ పేరును చరిత్రలో నిలిపిన సీఎంగారు

ఎవరూ అడక్కపోయినా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు

నటనతో ప్రజల గుండెల్లో నిల్చారు ఎన్టీఆర్‌

సుపరిపాలనతో అందరి మనస్సుల్లో  వైయస్ఆర్‌

నిరుపేదల పాలిట దైవంలా ఆయన నిల్చారు

దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు

విద్య, వైద్య ఆరోగ్య రంగాలలో విప్లవాత్మక మార్పులు

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరికో ప్రాణదాత

ఎక్కడా లేని విధంగా 108, 104 సర్వీస్‌లు

అలాంటి ఆయన పేరును వర్సిటీకి పెట్టడం తప్పా?

ఒక్కసారి అందరూ ఆలోచించాలి

 ఆనాడు ఎన్టీఆర్‌ పేరే వద్దన్న చంద్రబాబు

ఇప్పుడు రాజకీయాల కోసం ఆయన పేరు!

చంద్రబాబు ఏడుపులు, డ్రామాలు ఎవరూ నమ్మొద్దు

ప్రెస్‌మీట్‌లో కోరిన మంత్రి జోగి రమేష్‌

తాడేపల్లి: ఎన్టీఆర్‌ గుండెల్లో చంద్రబాబు గునపం లాంటి వ్య‌క్తి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.     నారా చంద్రబాబునాయుడు గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత చాలా మాట్లాడారు. ఎక్కడ లేని బాధ వ్యక్తం చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి డాక్టర్‌ వైయస్ఆర్‌ పేరు పెట్టాం. నిజానికి ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, పదవి లాక్కుని, చివరకు ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు, ఇవాళ తనకు మాత్రమే ఎన్టీ రామారావుపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు.
    నిండు మనసుతో సగర్వంగా చెబుతున్నాం. నందమూరి తారక రామారావు పేరు చరిత్రపుటల్లో చెక్కుచెదరకుండా ఉండేలా, విజయవాడ నగరసాక్షిగా, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ సాక్షిగా.. ఆ మహానుభావుడి పేరు గుర్తుండి పోయేలా చేసిన ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌.
చరిత్ర ఉన్నంతవరకు రాష్ట్రంలో ఎన్టీఆర్‌ పేరుతో జిల్లా ఉంటుంది. ఆ విధంగా ఆయనకు శాశ్వత పేరు, గుర్తింపు ఉంటుంది. ఇది చరిత్రపుటల్లో కూడా నిల్చిపోతుంది.

ఎవరూ అడగకపోయినా..:
    సీఎంగారికి ఎన్టీ రామారావుగారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి కాబట్టే.. ఎవరూ అడగకపోయినా, ఆయన జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు నిమ్మకూరులో ఆయన ప్రతిపక్షనేతగా ఆ మాట చెప్పారు. కృష్ణా జిల్లాలో పుట్టి, జిల్లాకు ఎంతో వన్నె తెచ్చిన ఎన్టీ రామారావు పేరును జిల్లాకు పెడతానని ఆనాడు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు.

చంద్రబాబుకు ఆ హక్కు ఉందా?:
    ఇప్పుడు తెగ బాధ పడుతున్న, గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ, ఆ పని ఎందుకు చేయలేదు? కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. దీన్ని ఒకసారి ఆలోచించాలని ప్రజలను, ఎన్టీఆర్‌ అభిమానులను కోరుతున్నాం. 
    అసలు ఎన్టీ రామారావు పేరును ఉచ్ఛరించే హక్కు చంద్రబాబుకు ఉందా? ఎన్టీ రామారావు పార్టీ ఏర్పాటు చేసి, ప్రజల మనసు గెల్చుకుని, సీఎం అయ్యారు. దొడ్డిదారిలో పార్టీలో చేరిన చంద్రబాబు, ఆ తర్వాత పార్టీని చీల్చి, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయనను చెప్పులతో కొట్టించి, పార్టీని లాక్కుని, సీఎం పదవి ఎక్కారు. మానసిక క్షోభతో ఎన్టీ రామారావు పరమపదించారు. దానికి కారణం కచ్చితంగా చంద్రబాబునాయుడే.

పేరు ఎందుకు మార్చామంటే..:
    నిన్న సభలో చట్టం చేశాం. హెల్త్‌ వర్సిటీకీ డాక్టర్‌  వైయస్ఆర్ పేరు పెడుతూ చట్టం చేస్తూ, చర్చించాం. దానికి చంద్రబాబు హాజరు కావొచ్చు కదా? హెల్త్‌ వర్సిటీ పేరు ఎందుకు మారుస్తున్నామన్న విషయాన్ని సీఎంగారు స్పష్టంగా చెప్పారు. అన్ని అంశాలు వివరించారు. ఆనాడు సీఎంగా ఉన్న మహానేత  వైయస్ఆర్‌ వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోవద్దంటూ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టి, ఎందరికో ప్రాణదానం చేశారు. ఆయన ఒక దైవ స్వరూపుడు.
    గతంలో ఏనాడైనా 108 వంటి సర్వీస్‌లు చూశామా. ఎక్కడైనా నిమిషాల్లో రోగిని ఆస్పత్రికి చేర్చేలా ఆ సర్వీసులు పని చేశాయి. ఇక 104 సర్వీస్‌లు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కాపాడేందుకు ఆ సర్వీసులు.
వైద్య ఆరోగ్య రంగంలో ఆ విధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేశారు డాక్టర్‌ వైయస్సార్‌.
    ఎన్టీ రామారావుగారి మీద సీఎం వైయస్‌ జగన్‌కు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి. అవసరమైతే మరిన్ని వాటికి ఆయన పేరు పెడతామని కూడా ఆయన చెప్పారు. ఇవాళ కూడా రాష్ట్రంలో 108, 104 సర్వీసులు చాలా గొప్పగా పని చేస్తున్నాయి. ఆనాడు వైయస్సార్‌గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ తరహాలో ఇవాళ కేంద్రం కూడా ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తోంది.
    వైద్య ఆరోగ్య రంగంలో అంత సేవ చేసిన  వైయస్ఆర్‌ పేరు చిరస్థాయిగా నిల్చేలా ఆయన పేరు పెడితే తప్పేమిటన్నది ఒక్కసారి అందరూ ఆలోచించాలి.

ప్రభుత్వ వైద్య కళాశాలలు:
    స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1983 వరకు రాష్ట్రంలో కేవలం 8 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా, మహానేత  వైయస్ఆర్ గారి హయాంలోనే మరో మూడు మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. ఇప్పుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ఏకంగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. హెల్త్‌ వర్సిటీకి  వైయస్ఆర్‌ పేరు పెడితే, చంద్రబాబు ఎందుకు అంతగా గగ్గోలు పెడుతున్నాడో అర్ధం కావడం లేదు.

బాబూ ఆనాడు ఏమన్నావు?:
    చరిత్ర పుటల్లో నిల్చే విధంగా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరుపెడితే కనీసం స్వాగతించలేదు. హర్షించలేదు. అభినందించలేదు. చివరకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా ఆ పని చేయలేదు. ఎన్టీ రామారావుపై నిజమైన గౌరవం, అభిమానం ఎవరికి ఉన్నాయి? మాకు ఉన్నాయా? మీకు ఉన్నాయా? అయ్యా చంద్రబాబుగారూ, నీ వంటి నికృష్టులు, పాపిష్టులు రాజకీయాల్లో ఉండొచ్చా?.
    ఆనాడు నీవు సీఎం కాగానే, ఎన్టీఆర్‌ గురించి ఏం మాట్లాడావు? అంటూ.. అప్పుడు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌ చూపారు..
    ఆనాడు అలా మాట్లాడిన చంద్రబాబు, ఇవాళ అదే ఎన్టీఆర్‌ మీద వల్లమాలిన ప్రేమ చూపుతున్నాడు. ఇవాళ అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఈనాడు పత్రికలో కూడా, ఆనాడు ఎన్టీ రామారావుమీద విమర్శలు చేస్తూ, కార్టూన్లు వేశారు. ఆయనను చెప్పలతో కొట్టారు. పదవి లాక్కుని చావుకు కారణమయ్యారు.

నటనలో ఎన్టీఆర్‌. పాలనలో వైయస్సార్‌:
    ఎన్టీ రామారావు ప్రజల మనసులో ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం అదే ఎన్టీఆర్‌ గుండెల్లో గునపం గుచ్చారు. ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నటుడు. ఏ వేషం వేసినా అందరి మనసుల్లో నిల్చిపోయారు.
    అదే మాదిరిగా మహానేత  వైయస్ఆర్‌ గారు కూడా ప్రజల ముంగిట నిల్చారు. వారి బాగు కోసం తపించారు. శ్రమించారు. ఎందరో ప్రజలకు ప్రాణదానం చేశారు. అలా ఎందరో ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు.
ఇప్పుడు సీఎంగారు తీసుకున్న నిర్ణయం వెనక ఏ దురుద్దేశం లేదు. ఎన్టీ రామారావు కీర్తి ప్రతిష్టలను మరో రూపంలో పెంచే చర్యలు చేపడతాం.
అంతే కానీ, ఇవాళ చంద్రబాబు చెబుతున్నట్లు.. మేము వెన్నుపోటు పొడవం. ఒకరి పార్టీని లాక్కోము. పిల్లనిచ్చిన మామను మోసం చేయబోము. 
    ప్రజలందరికీ మరోసారి చెబుతున్నాం. ఎన్టీ రామారావు పేరును చిరస్థాయిగా నిల్చేలా.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి జగన్‌గారు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంది.

గవర్నర్‌కు వాస్తవాలు చెబుతాం:
    ఇవాళ చంద్రబాబుగారు గవర్నర్‌ను కలిశారు. ఆయనకు ఇక్కడి వాస్తవాలు తెలియదు. ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, పార్టీని, పదవిని లాక్కుని చివరకు ఆయన మరణానికి కారణం చంద్రబాబు అని గవర్నర్‌కు తెలిస్తే, ఆయనను కనీసం రాజ్‌భవన్‌ మెట్లు కూడా ఎక్కించి ఉండేవాడు కాదు. మేము చంద్రబాబు గురించి గవర్నర్‌కు తెలియజేస్తాం.

చంద్రబాబుకు నైతికత లేదు:
    ‘రాజకీయ తార్పుడుగాడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు’ అని ఆనాడు ఎన్టీఆర్‌ అన్నారు. ఆ మాట వింటే ఎవరైనా ఉరేసుకుంటారు. కానీ ఆయనకు సిగ్గు, శరం లేవు. దుర్మార్గుడైన చంద్రబాబు వగలమారి ఏడుపులను ప్రజలెవ్వరూ నమ్మబోరు. 
    ఎన్టీఆర్‌ పేరు చరిత్రలో నిల్చేలా జిల్లాకు ఆయన పేరు పెట్టాం. 
రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారు. ఆయనకు బుద్ధి లేదు. ఆయన హయాంలో వచ్చినవన్నీ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు మాత్రమే. కాటూరి, నారాయణ, ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీలు. అవన్నీ ఆయన వర్గానికి చెందిన వారివే కదా?
    చంద్రబాబుకు సిగ్గుండాలి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీకి తేడా తెలియదా?. అదే మేము గర్వంగా చెబుతున్నాం. ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.

వారు చంద్రబాబును వదిలేశారు:
    ఒకవేళ బీసీలు చంద్రబాబు వెంట ఉంటే, 2019 ఎన్నికల్లో ఆయనకు కేవలం 23 సీట్లే ఎందుకు వచ్చాయి. బీసీలకు ఆయన ద్రోహం చేశారు. ఆ విషయాన్ని బీసీలు గుర్తించారు కాబట్టే, గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే పథకాలు ప్రకటించడం. వాటిని ఒక మొక్కుబడిగా అమలు చేయడం. ఇదీ చంద్రబాబు పాలన. అందుకే బీసీలు ఆయనకు దూరమయ్యారు. ఇక ఆయనకు మిగిలేది యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి పనికిమాలిన వారు మాత్రమే.

ఎన్టీఆర్‌ పేరు ప్రతిష్టలు పెంచాం:
    కానీ మా సీఎం వైయస్‌ జగన్‌గారు, ప్రతి పని చిత్తశుద్ధితో చేస్తున్నారు. అన్నింటినీ పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నారు.
ప్రజలందరికీ మా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. అలాంటి వాటి కోసం గతంలో ఏనాడైనా చంద్రబాబు కనీసం ఆలోచించారా?
    మేము ఎన్టీ రామారావు పేరు ప్రతిష్టలను పెంచాం. ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయేలా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాం. కానీ దాన్ని చంద్రబాబు కానీ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కానీ కనీసం హర్షించలేదు. మేము మళ్లీ చెబుతున్నాం. ఎన్టీఆర్‌ గౌరవాన్ని తగ్గించబోము.
    మాకు దొంగచాటు దెబ్బలు, వెన్నుపోట్లు చేతకావు. మా నాయకుడు మనసులో ఉన్న మాట చెబుతారు. ప్రతి పని చిత్తశుద్ధితో చేస్తార‌ని మంత్రి జోగి ర‌మేష్ పేర్కొన్నారు.

Back to Top