కొవ్వూరు: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే కందకూరు ఘటన చోటు చేసుకుందని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు మంత్రి వనిత తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. గురువారం మంత్రి కొవ్వూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పబ్లిసిటి పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే పబ్లిసిటి పిచ్చితో చంద్రబాబు ఉన్నారని, గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు వనిత. చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటి పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి ఖర్మ రా బాబు అని బాధపడుతున్నారన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏంటని హోం మంత్రి ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని ఆమె చెప్పారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి తానేటి వనిత తెలిపారు. చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని చూసి ప్రజలు మాకు ఇదేమి ఖర్మ, ఇలాంటి ప్రతిపక్షం ఏంటని బాధపడుతున్నారన్నారు. కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని, ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు.