నేరానికి పాల్పడితే.. ఎంతటి వారైనా వదిలే ప్ర‌స‌క్తే లేదు

హోం మంత్రి మేకతోటి సుచరిత  

సున్నితమైన అంశాల‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరం

గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని  రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి  సుచ‌రిత హెచ్చ‌రించారు.  రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని టీడీపీ నాయకులు రాజకీయ లబ్ది కోసమే వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో నిందితులు అందరినీ అరెస్ట్ చేసిన వారం తరువాత టీడీపీ మహిళా నాయకులు  రాద్దాంతం చేయడం ఏంటని హోంమంత్రి ప్రశ్నించారు. సున్నితమైన బాలిక ఘటనను కూడా టీడీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 43 మందిని అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

బాధితురాలు ఆరోపించిన వారితో పాటు..సహకరించిన వారిని కూడా పోలిసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.  ఈ కేసు విచారణలో సొంత పార్టీ కి సంబంధించిన వ్యక్తిపై ఆరోపణలు వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి శిక్షించిన ఘనత ఉందన్నారు.

తెలంగాణ కు సంబంధించిన ఆరుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో ప్రత్యేక బృందాలు వారిని అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.ఈ రోజు టీడీపీ మహిళా నాయకులు కావాలనే సున్నితమైన బాలిక అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనం కోసం, పబ్లిసిటీ కోసం వాడుకోవడం అత్యంత బాధకు గురిచేసిందన్నారు.

  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారు పోలీసు శాఖ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. ప్రతి కేసు విషయంలోనూ పోలీసు శాఖ పారదర్శకంగా విచారించి చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అన్నారు.

అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల విషయంలో సీఎం వైయ‌స్  జగన్ గారు ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తుంటే టీడీపీ నాయకులు రచ్చ చేయడం మంచి ప‌ద్ధ‌తి కాదన్నారు. సీఎం వైయ‌స్ జగన్ గారు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడాన్ని కూడా టీడీపీ నాయకులు తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో జరిగిన నేరాల విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. మహిళలను, దళితులను కించపరుస్తూ టీడీపీ నాయకులు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని హోంమంత్రి మండిపడ్డారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క నిందితుడు తప్పించుకున్న సందర్భాలు లేవని స్పష్టంచేశారు. స్వయంగా చంద్రబాబు నాయుడే దళితుల గురించి, ఆడబిడ్డల పుట్టుక గురించి నీచంగా మాట్లాడి..ఇప్పటి వరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని హోంమంత్రి తెలిపారు.

నిజంగా దళితులు, మహిళలు విషయంలో టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వారి ప్రభుత్వంలో జరిగిన ఘటనలపై నిజానిర్ధారణ కమిటీ వేయాలని సూచించారు.  రాష్ట్ర ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనను కొనియాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఎలాగైనా జగన్ గారి పైనా, ప్రభుత్వం పైనా నిందలు వేయాలని టీడీపీ నాయకులు చూడటం తగదన్నారు.

ఇప్పటికైనా టిడీపీ నాయకులు సున్నితమైన మహిళల విషయాలను రాజకీయం చేయడం మానుకొని.. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, మీ స్వార్ధ రాజకీయాల కోసం వారి జీవితాలను రోడ్ల మీదకు లాగడం మంచి పద్ధతి కాదని హోంమంత్రి హితవుపలికారు.

Back to Top