తాడేపల్లి: గురుపూజ్యోత్సవం అంటేనే ఒక స్పూర్తిదాయకమైన రోజు అని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటామన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. సెప్టెంబర్ 5 గురుపూజ్యోత్సవం అంటేనే ఒక స్పూర్తిదాయకమైన రోజుగా గుర్తుండిపోతుంది. సమాజాన్ని మంచి భవిష్యత్ వైపు నడిపించడానికి మనల్ని తీర్చిదిద్దే ఏ వ్యక్తినైనా మనం గురువుగా భావించవచ్చు. తల్లిదండ్రుల తర్వాత మనకు సంపూర్ణత ఇచ్చేది గురువు మాత్రమే. మనల్ని ఒక దిక్సూచిలా నడిపించేది గురువు మాత్రమే, అలాంటి వారికి నిజమైన స్పూర్తినిచ్చేలా గౌరవాన్ని మనం ఇవ్వాలి. సమాజంలో భవిష్యత్ తరాలను తీర్చిదిద్దగలిగే శక్తి విద్యారంగానికి ఉంటుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన స్పూర్తిని మాటల కంటే చేతల్లో అమలుచేసిన ప్రభుత్వ అధినేతగా నాడు వైయస్ఆర్ గారు కొంత చేస్తే దానికంటే పది అడుగులు ముందుకేసి తీసుకెళ్ళింది వైయస్ జగన్ గారు. విద్యాలయాలు అంటే విద్యార్ధులకు మంచి భవిష్యత్ ఇచ్చే వేదికలుగా తీర్చిదిద్ది ఆచరణలో చూపిన వ్యక్తి వైయస్ జగన్ గారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు చదువు ఒక భారంగా బాధపడకుండా ఇష్టంతో వెళ్ళేలా తీర్చిదిద్దిన ఘనత వైయస్ జగన్ గారి హయాంలో చూశాం. చదువుతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, సృజనాత్మక విధానం ఇలా ప్రతి విషయంలో చొరవ తీసుకుని జగన్ గారు నాడు నేడు పేరుతో స్కూల్స్ రూపురేఖలు మార్చారు. విద్యావ్యవస్ధనే ఒక గొప్ప స్ధాయికి తీసుకెళ్ళడం అనేది మొదటిసారి వైయస్ జగన్ గారి హయాంలోనే చూశాం. విద్యార్ధులను గ్లోబల్ స్టూడెంట్స్‌గా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలను గ్లోబల్ స్టాండడ్స్‌కు సమానంగా తీర్చిదిద్దారు. ఇందులో ఉపాధ్యాయుల పాత్రను గుర్తించి వారికి సమాజంలో గౌరవం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఒక తరాన్ని తయారు చేసే శక్తి ఉపాధ్యాయులకు ఉంది. వైయస్ జగన్ గారి ఆలోచనలను వారు కూడా ముందుకు తీసుకెళ్ళారు. పులివెందులలో కోట్ల విలువైన భూములను ఉచితంగా స్కూల్స్, కాలేజీలుకు ఇచ్చి నాడు వైయస్ఆర్ గారు విద్యను పేదలకు అందిస్తే అదే స్పూర్తిని ఇప్పటికీ ఆ కుటుంబం కొనసాగిస్తుంది. విద్య ప్రాముఖ్యతను గుర్తించి పేదరికం ఉన్నత విద్యకు అడ్డురాకూడదని వైయస్ జగన్ గారు భావించారు. విద్య, వైద్యం రెండూ ప్రముఖమైనవి. మెడికల్ కాలేజీలు అంటే కేవలం సీట్లు కాదు, సామాన్య ప్రజలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని, కార్పొరేట్ మెడికల్ సౌకర్యం అందాలని ఆయన తపించారు. అలాంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తే వాటి ప్రయోజనం ఏం ఉంటుంది. ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం తయారవ్వాలనే స్పష్టమైన వైఖరితో జగన్ గారు ముందుకెళ్ళారు. మన పిల్లల్లానే అందరి పిల్లలు చదవాలని వైయస్ఆర్ కుటుంబం తపించింది. నాడు నేడు క్రింద దాదాపు రూ. 15,000 కోట్లతో పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్‌కు ధీటుగా తయారుచేశారు. ఏ సీఎం చేయనన్నిసార్లు విద్యావ్యవస్ధపై వైయస్ జగన్ గారు సమీక్షలు చేశారు. విద్య మాత్రమే రేపటి భవిష్యత్ అని బలంగా నమ్మి మహాయజ్క్షం చేపట్టారు. మళ్ళీ ప్రభుత్వం మారగానే విద్యావ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన ఏ సమస్యను కూడా వెంటనే పరిష్కరించి, దశాబ్ధాలుగా పెండింగ్ అంశాలను కూడా పరిష్కరించిన ఘనత జగన్‌గారిది. విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఉపాధ్యాయులకు కూడా ఇచ్చి వారిని కీలక భాగస్వామ్యం చేశారు. ఏపీ భవిష్యత్ నిర్మాణంలో విద్యారంగం, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా వైయస్ఆర్‌సీపీ విధానాల రూపకల్పన జరుగుతుంది. మరింత మెరుగైన విధానాలను అమలుచేసే దిశగా అందరం కలిసి ముందుకెళదాం. గురువులందరినీ తలుచుకుంటూ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ, వైయస్ఆర్ టీఎఫ్ అధ్యక్షుడు గురుపూజోత్సవం అంటే నాడు వైయస్ఆర్ గారు, తర్వాత వైయస్ జగన్ గారు గురువులకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు పులివెందులలో పేదపిల్లలకు మంచి విద్య అందించాలని కార్పొరేట్ స్కూల్ ఏర్పాటుచేసి తన గురువు గారు వెంకటప్ప పేరుతో నడిపారు, ఆ స్కూల్‌ను ఇప్పటికీ అదే శ్రద్దతో ఇప్పుడు భారతమ్మ నడుపుతున్నారు. జగన్ గారు సీఎంగా ఉన్న సమయంలో విద్యకు, పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు ఇలా విద్యావ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులను గౌరవంగా చూసుకున్న సీఎం జగన్ గారయితే చంద్రబాబు అవమానించారు. టీచర్స్ కమ్యూనిటీకి ఎంతో మంచి చేయాలని జగన్ గారు తపించారు, చేశారు, మళ్ళీ అధికారంలోకి రాగానే చేస్తారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం, ఆ తర్వాత డాక్టర్ వైయస్ఆర్ గారు, జగన్ గారు విద్యవల్లే సమాజంలో మార్పువస్తుందని నమ్మారు, జగన్ గారి పాలనలో నాడు నేడు పేరుతో స్కూల్స్ ఆధునీకరణ ఇవన్నీ మనం చూశాం. విద్యారంగం నిర్వీర్యమైతే సమాజ మనుగడే ప్రశార్ధకమవుతుంది. నేటి విద్యావిధానం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమయిందని బాధగా ఉంది. గురువుకు వైయస్ఆర్ గారి కుటుంబం ఇచ్చిన ప్రాధాన్యతను ఆ కుటుంబం ఇప్పటికీ కొనసాగిస్తుంది. భవిష్యత్‌లో గురువులు సమాజానికి దిక్సూచిలా ఉండాలి, విలువలతో కూడిన సామాజిక దృక్పదంలో మీరంతా ప్రధాన భూమిక పోషించాలి. జగన్ గారు 2029లో సీఎం అయిన తర్వాత మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగిస్తారు. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, కాకుమాను రాజశేఖర్, అంకంరెడ్డి నారాయణమూర్తి, పుత్తా శివశంకర్, వైయస్ఆర్ టీఎఫ్ నేతలు జాలిరెడ్డితో సహా పలువురు వైయస్ఆర్ టీఎఫ్ నేతలు పాల్గొన్నారు.