తాడేపల్లి: రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా సీఎం చంద్రబాబు అల్లిన కట్టుకథే లిక్కర్ స్కాం అని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అల్లిన ఈ కట్టుకథలకు మరికొన్ని పిట్టకథలను జత చేయడమే సిట్ చేస్తున్న పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారం లోకి రాగానే సీఎంగా చంద్రబాబు అబద్దాల పునాదుల మీద లిక్కర్ స్కాంను ప్రారంభించారని ధ్వజమెత్తారు. రాజకీయంగా చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, వెంటనే లిక్కర్ స్కాంలో అరెస్ట్‌లు అంటూ ఎల్లో మీడియా ద్వారా హోరెత్తించడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు ఎనిమిది వందల కేసులు పెట్టారు. పదుల కొద్ది మందిని జైలుకు పంపారు. వైయస్ఆర్సీపీ విషయంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల మీద వేల కొద్ది తప్పుడు కేసులు పెట్టారు. సాక్షి పత్రికపైన కూడా ఇదే విధంగా అక్రమ కేసులను బనాయించేందుకు తెగబడ్డారు. సాక్షి ఎడిటర్ పై అయిదు ఎఫ్ఐఆర్లు పెట్టి, బెదిరించే ప్రయత్నం చేశారు. కూటమి పాలనకు భజన చేసే వారిని తప్ప, వారి వైఫల్యాలను ఎత్తి చూపే వారిని సహించమనే దోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కీలక ఆధారాలు దొరికాయంటూ ప్రతిసారీ హంగామా చంద్రబాబు ప్రారంభించిన ఈ లిక్కర్ స్కాం కట్టుకథలో సిట్ ఇప్పటి వరకు కనీసం ఆధారాలను కూడా చూపలేకపోయింది. ఎవరు పడితే వారి ఇళ్ళలో సోదాలు చేయడం, కీలక ఆధారాలు దొరికాయంటూ ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి, నిరాధారమైన కథనాలను ప్రచారంలోకి తేవడం, బురదచల్లడం సిట్ పనిగా మారింది. తాజాగా రెండు కంపెనీల అడ్రస్‌లు ఒకే బిల్డింగ్‌లో ఉన్నాయంటూ, కంప్యూటర్లు దొరికాయంటూ, ఫైల్ స్వాధీనం, హార్డ్ డిస్క్‌లు సీజ్ అంటూ విచిత్రమైన కథనాలను ఎల్లో మీడియాలో రాయించారు. రామోజీ గ్రూపుల్లో సవాలక్ష కంపెనీలు ఉన్నాయి. వీటి ఆఫీసులు ఎక్కడున్నాయి? ఒక వ్యక్తి ఒకటే కంపెనీ నడపాలని రూల్ ఏమైనా ఉందా? కనీస పరిజ్ఞానం లేకుండా ఇలాంటి కథనాలు రాయడం, అదేదో భారీ తప్పిదనం అన్నట్లుగా ప్రచారం చేయడం జరుగుతోంది. దేశంలో ఏ కంపెనీలోకి వెళ్ళినా కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఫైళ్ళు ఉంటాయి. అవి ఉండటం నేరమా? వాటిల్లో ఏదైనా తప్పు ఉంటే చూపించండి. కొందరు ఉద్యోగుల్ని బెదిరించి వారిచేత వాంగ్మూలాలు తీసుకుని కొంతమందిని అరెస్ట్ చేశారు. వారి ఫోన్‌కాల్ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో... వారందరినీ పిలిచి విచారించడం, ఇంతకు మించి చేసేదేముందీ? బేవరేజెస్ కార్పోరేషన్‌కు కార్టన్లు సప్లై చేసేవాళ్ళను, లారీలు సప్లై చేసే వారిని, వాటి మెయింటెనెన్స్ చూసేవారిని కూడా చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసిరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రూ.11 కోట్ల నగదు సీజ్ చేశామని గతంలో వెల్లడించారు. అయితే ఈ సొమ్ము ఎక్కడిదో తేల్చారా అని న్యాయస్థానం ప్రశ్నిస్తే సిట్ అధికారులు తెల్లముఖం వేశారు. తమ కట్టుకథలు న్యాయస్థానం ముందు బయటపడిపోయాయని కంగారు పడ్డారు. చివరికి న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కూడా తప్పులు తకడకగా ఉండటం సిట్ చేస్తున్న దర్యాప్తులోని డొల్లతనంను బయటపెట్టింది. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటూ, వారు ఎవరిపేరు చెబితే వారిని లిక్కర్ స్కాం దోషులుగా చెబుతూ, ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా అరెస్ట్ చేస్తూ సాగిస్తున్న డ్రామాలు న్యాయస్థానాల ముందు దాగడం లేదు. డైవర్షన్‌లో భాగంగానే లిక్కర్ స్కాం అరెస్ట్‌లు రాష్ట్రంలో ఎరువులు లేక రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కూటమి నేతలను రైతులు ప్రశ్నిస్తుంటే, దానిని డైవర్ట్ చేసేందుకు లిక్కర్ స్కాంలో దర్యాప్తు కొత్త మలుపు అని ప్రచారం చేస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నిత్యం తమ పత్రికల్లో రోజుకో కొత్త కథలను ప్రచురిస్తుంటాయి. ఈ కథల ప్రకారం సిట్ చార్జ్‌షీట్ తయారు చేస్తోంది. న్యాయస్థానాల్లో ఈ చార్జ్‌షీట్‌లోని లోపాలను సమర్థించుకోలేని అసమర్థత. సిట్ అధికారుల కుప్పిగంతులను చూస్తుంటే, లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు, లోకేష్‌లు అల్లిన కథలేనని తేలిపోతోంది. మొదట్లో రూ.50 వేల కోట్లు, తరువాత రూ.30 వేల కోట్లు, ఆ తరువాత రూ.18వేల కోట్లు అన్నారు. చివరికి రూ.2000 కోట్ల పైచిలుకు అన్నారు. సీజ్ చేసింది మాత్రం కేవలం రూ.11 కోట్లు. ఈ సొమ్ము కూడా ఎలా వచ్చిందో కూడా చెప్పలేని స్థితిలో సిట్ ఉంది. అసలు లిక్కర్ స్కాం పేరుతో సృష్టించిన బేతాళ కథలను, కుట్రను వివరిస్తూ, వాస్తవాలను వెలువరిస్తూ వైయస్ఆర్సీపీ రిలీజ్ చేసిన డాక్యుమెంట్, మూడు ఎపిసోడ్లుగా చిత్రీకరించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం. దానిని ప్రజలు చూస్తే, ఎలా ఈ బేతాళకథలను తయారు చేశారో అర్థమవుతుంది. వైయస్ఆర్సీపీ నాయకులను, వైయస్ జగన్‌ను అరెస్ట్ చేసి, జైలుకు పంపాలనే నీచమైన ఆలోచనల నుంచి సృష్టించిందే ఈ లిక్కర్ స్కాం. రాజకీయ కక్షలను సాధించేందుకే ఈ కేసులను పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో చేస్తున్న కుట్రలను న్యాయస్థానంలో ఎదుర్కొంటాం. చివరికి అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన వారికి బెయిల్ వస్తే, దానిని కూడా అడ్డుకునేందుకు సిట్ అధికారులు నానా తిప్పలు పడ్డారు. 7 కేసుల్లో చంద్రబాబు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు మద్యం వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసింది. మద్యం విక్రయం తగ్గింది, ఆదాయం పెరిగింది. ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేసింది. అలాంటప్పుడు స్కాం జరిగడానికి అవకాశం ఎక్కడ? కానీ కూటమి ప్రభుత్వం లిక్కర్ షాప్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, రూ.వేల కోట్లు దండుకుంటున్నారు. బెల్ట్ షాప్‌ల పేరుతో పెద్ద ఎత్తున లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. మద్యం ధరలను పెంచి, జేబులు నింపుకుంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో లిక్కర్ స్కాంలో చంద్రబాబు ఆదారాలతో సహా సీఐడీకి దొరికిపోయారు. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ రోజు ఏడు కేసుల్లో నిందితుడుగా ఉన్న చంద్రబాబు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నాడనేది వాస్తవం కాదా? ఇప్పుడు సీఎంగా తన అధికారాన్ని ఉపయోగించుకుని, గతంలో తనపై నమోదైన కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును నమ్మి మోసపోయారు కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారు. సూపర్ సిక్స్‌లో కనీసం యాబైశాతం హామీలు కూడా ప్రారంభించలేదు. మిగిలినవి కూడా అరకొరగా ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. తొలి ఏడాది పూర్తిగా పథకాలను ఎగ్గొట్టేశారు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అంటూ అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఒక బహిరంగసభను నిర్వహించింది. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున జనాన్ని ఆ సభకు తరలించారు. సభ ప్రారంభమయ్యే సమయానికి ఆ సభ జనం లేక వెలవెలపోయింది. రాష్ట్రంలోని ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని అనవసరంగా నమ్మి మోసపోయామని ఒకవైపు చెప్పుకుంటున్నారు, మరోవైపు రాష్ట్రంలో విషజ్వరాలు, అంటువ్యాదులతో మరణాలు జరుగుతున్నాయి. తురకపాలెంలో అంతుపట్టని వ్యాధులతో వంద రోజుల్లో దాదాపు నలబైకి పైగా ప్రజలు మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం విజయోత్సవం పేరుతో సభలు నిర్వహించుకుంటోంది. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ... రామోజీ కుమారుడు కిరణ్ తన పత్రిక ఈనాడులో నాపైన లిక్కర్ స్కాం ట్రాన్స్‌పోర్టేషన్‌లో అవినీతికి పాల్పడినట్లుగా రాశారు. ఈనాడు పత్రిక ఒక కథనం రాస్తే, సిట్ అధికారులు దాని ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఈ ప్రభుత్వంపై మాట్లాడతారో, వారిపై లిక్కర్ స్కాంను ప్రయోగిస్తున్నారు. ఇంతకు ముందు సత్తెనపల్లిలో విజిలెన్స్ ఎంక్వయిరీ అన్నారు. పార్టీలోని ముఖ్యనాయకులపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయడం, దాని ప్రకారం సిట్ అధికారులు కేసులు పెట్టడం జరుగుతోంది. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. అలా చేయడాన్ని అడ్డుకుంటామని మాజీ సీఎం వైయస్ జగన్ చాలా స్పష్టంగా తమ విధానాన్ని చెప్పారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొనేవారు తొందరపడి తీసుకుంటే, మా ప్రభుత్వం వస్తే వాటిని రద్దు చేసి, ప్రభుత్వరంగంలోనే నడుపుతామని చెబితే తప్పా? మెడికల్ కాలేజీలను కొనేవాళ్ళు పెట్టుబడిదారులా? చంద్రబాబు తన తాబేదార్లకు ఈ ప్రభుత్వ కాలేజీలను కట్టబెట్టుందుకు ప్రయత్నిస్తున్నారు. పేదవాడికి వైద్య విద్యను అందనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, చేతులు కట్టకుని చూస్తూ ఊరుకోవాలా? మేం రాజధాని అమరావతి కాదని ఎప్పుడూ చెప్పాలేదు. ఈ రోజు లక్ష కోట్ల రూపాయలను అమరావతి కోసం ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. దీనిలో 52 వేల కోట్ల రూపాయల అప్పు. ఇలా ప్రజాధనంను వృధా చేయడం ఎందుకు? గుంటూరు-విజయవాడ మధ్యలో 500 ఎకరాలు తీసుకుంటే రాజధానికి సరిపోతుందని వైయస్ జగన్ గారు చెప్పారు. కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. కానీ వాటికి నిధులు ఇవ్వాలంటే కష్టం అంటూ ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. రాజధాని పేరుతో మాత్రం వేల కోట్లు అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఉన్న ప్రాంతాలను రాజధానులుగా ఎంపిక చేసుకుంటారా? లేక రాజధానిని సృష్టిస్తారా? అమరావతి పేరుతో లక్ష ఎకరాలను సేకరిస్తారా? హైకోర్ట్, శాసనసభ, సచివాలయం నిర్మిస్తే, దాని చుట్టూ రాజధాని అభివృద్ది చెందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడుతుంటే, లక్షల కోట్లు అప్పుల పాలు చేస్తున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు నేడు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. చివరికి కొత్తగా వేసిన హైవే రోడ్డును కూడా తవ్వితే కానీ నీరు బయటకు పోలేదు. దీనిని బట్టి అమరావతి ఎంత లోతట్టుప్రాంతమో తెలిసిపోతోంది. అమరావతి చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఈ మూడున్నర ఏళ్ళు కాదు, ముప్పై ఏళ్ళు అయినా చంద్రబాబు చెబుతున్న హంగులతో కూడిన అమరావతి పూర్తి కాదు. అమరావతిని ఒక ఏటిఎంగా చంద్రబాబు మార్చుకున్నాడు. మెబిలైజేషన్ అడ్వన్స్లు ఇవ్వడం, దానిలో కమీషన్లు దండుకుంటున్నారు.