తాడేపల్లి: ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు.. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్.. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తంచేస్తూ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే పెన్షన్‌తో సహా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపనపడ్డామని వివరించారు. గతంలో ఎవ్వరూ కూడా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడిన సందర్భాలు లేవని సీఎం గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీపీఎస్‌ను తీసుకువచ్చామన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించామని చెప్పారు. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని, అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్‌లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామని సీఎం వైయస్ జగన్ చెప్పారు.