ఉద్యోగులను ద్వేషించేవారి ఉచ్చులో పడకండి

ప్రభుత్వ ఉద్యోగులకు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి

చిత్తశుద్ధి ఉంది కాబట్టే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం

దయ ఉంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోండి

హెచ్‌ఆర్‌ఏ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది..

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు ఇది

తాడేపల్లి: ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దయ ఉంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తులు, అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడకండీ అని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్ద చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. 

కరోనా లాంటి విపత్కర పరిస్థితులు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమంలో సీఎం వైయస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి కోరుతున్నాం తప్పితే.. ఏరకంగా నష్టపర్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తోందని చెప్పారు. 

ఐఆర్‌ 2, 3 శాతం ఇచ్చిన గతంలో ఒప్పుకునేవారని, కానీ, పరిస్థితులు బాగుంటాయి.. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భావించే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే అధికమని చెప్పారు. కరోనా లాంటి పరిస్థితుల్లో పక్కరాష్ట్రం తెలంగాణ ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చిందా..? అని ప్రశ్నించుకోవాలన్నారు. మూడు డీఏలు పెండింగ్‌ పెట్టి, 2 డీఏలు మాత్రమే ఇస్తామని చెప్పకుండా.. 5 డీఏలు ఒకేసారి ఇస్తామని సీఎం చెప్పారని గుర్తుచేశారు. 

హెచ్‌ఆర్‌ఏ గురించి ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం దానిపై ఆలోచన చేస్తుంది.. ఉద్యోగులతో చర్చలు జరుపుతుందన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదని, దయ ఉంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. మొండి వైఖరితో, ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తులు, అసభ్యపదజాలంతో దూషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. రాష్ట్రంలో 1.30 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మున్సిపల్‌ కార్మికుల జీతాలు పెంచడమే కాకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా పేస్కేల్‌ ప్రకారం జీతాలు ఇవ్వమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది సరైన పద్ధతి కాదన్నారు. 
 

Back to Top