ఉద్యోగులకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారు

ఏపీ ఎన్జీవో రాష్ట్ర‌ మహాసభల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని సీఎం నమ్మారు

వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు నాలుగేళ్లలోనే పరిష్కారం

అడ్డంకులను అధిగమించి ఉద్యోగులకు సీఎం మేలు చేయగలిగారు

కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం ముందడుగు వేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకం

తాడేపల్లి: మాది ఉద్యోగుల ఫ్ల్రెండీ ప్రభుత్వం.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని సీఎం వైయస్‌ జగన్‌ బలంగా నమ్మారు.. అందుకే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను నాలుగేళ్లలోనే పరిష్కరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులకు సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. ప్రజల మేలు కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా అందరం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రజల చెంతకు చేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులదే కాబట్టి వారు పనిచేసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పించారన్నారు. ఉద్యోగులకు సమస్యలు లేకుండా ఉంటే మరింత మనసుపెట్టి పనిచేయగలరని బలంగా విశ్వసించిన నాయకుడు కాబట్టే.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించారని చెప్పారు. ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.

‘‘రెండు ప్రాతిపదికల మీద సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. 1.ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోకూడదు. 2.ఉద్యోగులు మనసుపెట్టి పనిచేయకపోతే ఏ ఆలోచన, రాజకీయంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు అమలు కావు అని సీఎం వైయస్‌ జగన్‌ నమ్మారు. ఎప్పుడైతే ఇలాంటి స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ పాలన ఎలా ఉంటుందో.. సమస్యలను పరిష్కరించే ఆలోచన, సమయం ఎంత తక్కువగా ఉంటుందో ఈ నాలుగేళ్లలో అందరూ చూశారు. 

ఒక వ్యక్తిగా సంఘం తరఫున వచ్చినా అది పరిష్కారానికి నోచుకోగలిగింది అయితే, ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించేదిలా ఉంటే అది ఏదైనా చేసేయాలనే ఒక తపనతో ప్రయత్నం చేస్తున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ఈ నాలుగేళ్లలో ఉన్న అడ్డంకులను అధిగమించి ఉద్యోగులకు మేలు చేయగలిగారు. 

కోవిడ్‌ సంక్షోభం వచ్చినప్పుడు ప్రపంచంతో సహా రాష్ట్రం కుంగిపోయినప్పుడు అన్నింటికీ తెగించి అన్ని రకాలుగా ప్రజలకు మేమున్నామని ప్రభుత్వం ముందడుగు వేయడంలో సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనకు తోడు ఉద్యోగుల పాత్ర కూడా కీలకం. అందుకే దేశంలోనే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా ఏపీ నిలబడింది. కోవిడ్‌ ఆర్థికంగా ఎంత దెబ్బతీసిందో అందరికీ తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించే విషయం సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన వల్లే సాధ్యమైంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు అని ముఖ్యమంత్రి నమ్మారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 

Back to Top