తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కలిసి తమ సమస్యలను వివరించారు. దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డి, కొద్ది నెలల క్రితం తనపై జరిగిన హత్యాయత్నం, విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటనను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు తనపై దాడి చేశారని వివరించారు. అలాగే గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఫిబ్రవరిలో హత్యకు గురైన ఘటనపై వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్నారనే కారణంతోనే తమ భర్తలను దారుణంగా హతమార్చారని బాధితుల భార్యలు తెలిపారు. ఈ ఘటనలపై స్పందించిన వైయస్ జగన్, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా పార్టీ తరఫున సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొంటామని, అవసరమైన న్యాయ సహాయం పార్టీ లీగల్ విభాగం ద్వారా అందిస్తామని తెలిపారు. పోలీసుల వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్రంగా స్పందిస్తూ, వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఆకూరి వెంకటరెడ్డి, భావనా రిషి, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, అలాగే కొమ్మినేని వెంకటేశ్వర్లు, వేముల చలమయ్య, జంజనం తిరుపతిరావు, సైదయ్య, చెన్నారెడ్డి, షేక్ ఇమాం వలీ తదితర నాయకులు ఉన్నారు.