చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి

ఈ ప్రభుత్వం ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సచివాలయం: ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగానే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూస్తున్నారని, ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అడగకుండానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీకి సంబంధించి ఉద్యోగుల స్టీరింగ్‌ కమిటీ సభ్యులు.. మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఉద్యోగ సంఘాల నేతలందరూ కలిసివస్తే.. సమగ్రంగా చర్చించి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, తమ పరిధిలో లేకపోతే పైస్థాయికి తీసుకెళ్తామని ఉద్యోగుల స్టీరింగ్‌ కమిటీకి చెప్పామన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారు అడిగినా, అడక్కపోయినా చేయగలిగినంత చేస్తుందన్నారు. ఉద్యోగులకున్న సందేహాలు తొలగించడానికి, నష్టం సరిదిద్దడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసే చర్యలు కచ్చితంగా తీసుకుంటుందన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇంతకాలం అధ్యయనాలు చేసి, చర్చలు జరిపి.. పీఆర్సీ ప్రకటించిన తరువాత ఇప్పుడు ఆందోళన చేయడం కరెక్ట్‌ కాదని ఉద్యోగులకు అప్పీల్‌ చేశారు. 27వ తేదీ మరోసారి చర్చలకు రమ్మన్నామని, వారితో మరోసారి చర్చిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top