మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చాం

 ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌

అమరావతి: ఎన్నికల  మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలు చేశారని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ రాజ్‌భవన్‌ నుంచి ప్రసంగిస్తున్నారు. గవర్నర్‌ మాట్లాడుతూ..గతేడాది తలసరి ఆదాయాన్ని పోల్చితే ఈ ఏడాది 12 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన 129 హామీల్లో ఇప్పటికే 77 హామీలు నెరవేర్చారని చెప్పారు. 39 హామీలు పరిశీలనలో ఉన్నాయన్నారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా నెరవేర్చారని తెలిపారు. 2019–2020లో 8.16 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధిరేటు సాధించినట్లు వివరించారు. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధిరేటు సాధించినట్లు చెప్పారు. వివిధ పథకాల కింద 3.98 కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇందు కోసం రూ.42 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశామన్నారు. నాడు–నేడు, మన బడి కార్యక్రమం కింద మూడేళ్లలో 48 వేల పాఠశాలలను ఆధునీకరిస్తామన్నారు.జగనన్నన వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి కలిగిందన్నారు. జగనన్న వసతి దీవెన కోసం రూ.3857 కోట్లు ఖర్చు చేశామన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇందుకోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశామన్నారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. దీనికోసం రూ.72.82 కోట్లు ఖర్చు చేశామన్నారు.వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇందుకోసం 53.85 కోట్లు ఖర్చు చేశామన్నారు. గ్రామ సచివాలయాల్లో 12 వేల వైయస్‌ఆర్‌ క్లినిక్స్‌కు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 1060 కోత్త 108, 104 వాహనాలు సిద్ధం చేశామన్నారు. నాడు–నేడు కింద ఆసుపత్రుల ఆధునీకరణకు రూ.15,337 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

చెప్పినదానికన్నా అధనంగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా
రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా రూ.12,500 ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు చెప్పారని, చెప్పినదానికన్నా అధనంగా మరో వెయ్యి రూపాయలు చేర్చుతూ ..13,500 ఏటా చెల్లిస్తున్నామని గవర్నర్‌ తెలిపారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసపా పథకం మొదటి దశ పూర్తి అయ్యిందన్నారు. మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూరిందన్నారు.ఇందుకు రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశామన్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గ స్థాయిలో 147 వైయస్‌ఆర్‌ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేశామన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కుల,మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గవర్నర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 11,158 గ్రామ సచివాలయాలు, 3876 వార్డు సచివాలయాలు ఉన్నాయన్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం 2 వేల మంది అవసరాలను తీరుస్తుందన్నారు. ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బంది, 40 మంది వాలంటీర్లు ఉన్నారన్నారు. 

30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
రాష్ట్రంలో రూ.7 వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నామని గవర్నర్‌ హరిందన్‌ పేర్కొన్నారు. మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తామన్నారు. నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తామని తెలిపారు. 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. 

సున్నా వడ్డీ పథకం
సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని గవర్నర్‌ తెలిపారు.45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు  వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. రాజకీయ ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారిత కోసం నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన కల్పించామన్నారు.

జలయజ్ఞం
జలయజ్ఞం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.ఈ ఏడాది పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, సంగం బ్యారేజీ , నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార–నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు.

డిస్కంలకు కేటాయింపులు
విద్యుత్‌ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ.17,904 కోట్లు కేటాయించినట్లు గవర్నర్‌ వివరించారు.ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించామని తెలిపారు. దీనిద్వారా రూ.11,548 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. 

వైయస్‌ఆర్‌ నవోదయం
చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం వైయస్‌ఆర్‌ నవోదయం పథకాన్ని ప్రారంభించినట్లు గవర్నర్‌ బిశ్వభూషన్‌ వివరించారు. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశామన్నారు. జీఎంఆర్‌ సంస్థతో రూ,2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. రామయ్యపట్నం, మచిలీపట్నం, బావనపాడులో  మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.3,200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తామన్నారు.

అవినీతిరహిత పాలనే ధ్యేయం
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉందని గవర్నర్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశామన్నారు.

కరోనా పరీక్షల నిర్వహణలో ముందు
కోవిడ్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని గవర్నర్‌ పేర్కొన్నారు. కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని తెలిపారు. రోజుకు దాదాపు 15 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు..జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉందన్నారు. రికవరీ రేటు..జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం టెస్టింగ్‌ ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచిందని తెలిపారు.మిలియన్‌కు 10 వేల పరీక్షలు పూర్తి చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రణ కు జిల్లాల్లో 65 ఆసుపత్రులు, 5,400 ఐసీయూ బెడ్స్, 38 వేల ఐసోలేషన్‌ బెడ్స్, ఆక్సిజన్‌ సరఫరాతో 15 వేల బెడ్స్‌ ఉన్నాయన్నారు. ఇవేకాక అనేక సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందిస్తోందని గవర్నర్‌ తన ప్రసంగంలో వివరించారు.
 

Back to Top