కోవిడ్‌ వేళ ఆరోగ్యశ్రీనే శ్రీ‌రామ ర‌క్ష‌

వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద ఏకంగా 1.11 లక్షల మందికి ఉచిత వైద్యం

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో కోవిడ్‌కు ఉచిత చికిత్స

ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ ఉచిత చికిత్సలకు రూ.332.41 కోట్లు వ్యయం చేసిన సర్కార్‌

అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైయ‌స్సార్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏడాదిలోనే 1.11 లక్షల మంది కోవిడ్‌ రోగులకు ఉచిత వైద్యసేవలు అందాయి. కోవిడ్‌ సోకిన పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు అప్పులు పాలుకాకుండా, వారి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది.

ఇందులో భాగంగా గతేడాది ఏప్రిల్‌ 7 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 1,11,266 మంది కోవిడ్‌ రోగులకు ఉచిత వైద్యం అందింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.332.41 కోట్లు వ్యయం చేసింది. మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వ పథకంలో కోవిడ్‌ చికిత్సలను చేర్చి ఉచిత వైద్య చికిత్సలను అందించకపోవడం గమనార్హం. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎంతో ముందుచూపుతో ఆలోచించి కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్లే గతేడాది కాలంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు నగదు సమస్యను ఎదుర్కోలేదు.

అన్ని ప్రైవేటు, బోధనాస్పత్రుల్లో 100 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకే..

కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తి ఉచితంగా చికిత్సను అందించడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉత్తర్వుల ప్రకారం.. 
► కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించిన అన్ని ప్రైవేటు, బోధనాస్పత్రుల్లో పూర్తిగా 100 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కింద కేటాయించి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. పరిస్థితులు, అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లు మరికొన్నిటిని కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించాలి.
► కోవిడ్‌ చికిత్స కోసం ప్రకటించిన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కూడా కనీసం 50 శాతం బెడ్లను కేటాయించాలి. 50 శాతం కోటా పూర్తయినప్పటికీ, సంబంధిత ఆస్పత్రిలో ఇతర బెడ్లు ఖాళీగా ఉంటే వాటిని కూడా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఇవ్వాలి. 
► అలాగే తాత్కాలికంగా కోవిడ్‌ చికిత్స కోసం మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్‌ హాస్పిటల్స్‌గా జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. వీటిలో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. వీటి చికిత్సా వ్యయాన్ని వైయ‌స్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ భరిస్తుంది.
► తాత్కాలికంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్‌ ఆస్పత్రులుగా గుర్తించిన వాటి వివరాలను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకి అందించాలి.
► ప్రతి సమయంలోనూ 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఖాళీగా ఉంచాలని చెప్పి నాన్‌ ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్ల చికిత్సను తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరీక్షల ఆధారంగా బెడ్‌ కేటాయించవచ్చు.
► సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులు ఈ నిబంధనలు పాటించాలి.
► ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చిన రోగులను పాజిటివ్‌ టెస్టు లేదంటూ తిరస్కరించకూడదు.
► ఆస్పత్రిలో చేరిక అనేది పూర్తిగా అవసరాన్ని బట్టి లేదా డాక్టర్‌ లేదా రోగుల పరీక్షల నిర్ధారణపై ఆధారపడి ఉంటుంది.
► వివిధ కారణాలను చూపుతూ ఒక్క రోగి కూడా చికిత్స లేదా కావాల్సిన ఔషధాలకు దూరం కాకుండా చూడాలి.  

తాజా వీడియోలు

Back to Top