తిరుపతి: హైందవర్మ పరిరక్షణ కోసం వేదపారాయణదారుల నియామకం ఎంతో అవసరమని టీటీడీ మాజీ చైర్మన్ , వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో వేదపారాయణదారులు పోస్టుల భర్తీ నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయడం దారుణమన్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. `వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతున్నది..హైందవర్మ పరిరక్షణకోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందని గతంలో నేను పాలకమండలి చైర్మన్ గా వున్నపుడు 700 పోస్టులను క్రియేట్ చేశాం. ఈ పోస్టుల భర్తీకి ఈ రోజున(సెప్టెంబర్11) నిర్వహించాల్సిన ఇంటర్వ్యూ లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఉద్దేశపూర్వకంగా రద్దు చేశాడు. ఈ వేదపారాయణ ఇంటర్వ్యూ లకు సంబందించి ఎంతో ఉన్నతమైన సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు టీటీడీ లో ఉంటారు. వీరికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ ఆధ్వర్యంలో కృష్ణయజుర్వేదం విభాగం అధ్యాపకుడైన ఫణియజ్ఞేశ్వరయాజులు నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. 700 వేదపారాయణదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేది.. కానీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైన గోవిందరాజన్‌ను పక్కన పెట్టాలనే ఈ ఇంటర్వ్యూలను ఆపివేశారు. తనకు కావలసిన వాళ్ళని వేదపారాయణదారులుగా తీసుకోవాలని కుట్ర తప్ప మరొకటి కాదు. 700 మంది వేదపారాయణదారులకు భృతి కల్పించే అవకాశాన్ని ఏ కారణం లేకుండా ఆపివేయటం మొత్తం బ్రాహ్మణ సమాజానికి ఆవేదన కలిగించే విషయం. ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తాం. భయపడే ప్రసక్తే లేదు టీటీడీ లో వ్యవహారాల గురించి మాట్లాడుతుంటే చైర్మన్ నామీద ఆరుగురు బ్లాక్ మెయిల్ చేసేవారిని ఉంచారని అంటున్నారు. బీఆర్ నాయుడు..మీరు ఆరుగురినికాదు 600 మందిని ఉంచినా, వారందరు నా చుట్టూనే ఉంచినా భయపడేది లేదు.. అద్దాల మేడలో మీరు ఉండి మా మీద రాళ్లు వేస్తే నష్టం కలిగేది మీకే అన్న విషయాన్నీ తెలుసుకోండి. మీరు ఏ తప్పు చేయకపోతే భయమెందుకు? మంచి పనులు చేస్తే అభినందనలు అందుకుంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు` అని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.