నోటీసులు లేకుండా భూముల స్వాధీనానికి టీడీపీ ఎమ్మెల్యే దౌర్జ‌న్యం

 చౌడూరు పొలాల్లో రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా :  ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ పరిధిలోని సాగు భూములను ఎటువంటి ముందస్తు నోటీసులు, చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా ఏపీఐఐసీ(APIIC) పేరుతో ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దారికోసం అనే నెపంతో రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతూ, బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసినట్టు రైతులు ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైనది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వ్యవహారమేనని వారు పేర్కొన్నారు. పంటలతో ఉన్న పొలాల్లోకి జేసీబీలు, బుల్‌డ్రోజ‌ర్లు దూసుకురావడంతో ఆగ్రహించిన రైతులు యంత్రాలను అడ్డుకొని నిరసనకు దిగారు. “మమ్మల్ని చంపిన తర్వాతే మా పొలాలు స్వాధీనం చేసుకోండి” అంటూ రైతులు నినాదాలు చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారం అయిన భూములను చట్టబద్ధమైన ప్రక్రియలు లేకుండా తీసుకోవడం అన్యాయమని వారు అన్నారు.

రైతుల నిరసనకు మద్దతుగా ప్రొద్దుటూరు మాజీ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్కడికక్కడే ధర్నాకు దిగారు. రైతులకు అండగా నిలిచి, ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా ఖండించారు. భూముల స్వాధీనానికి సంబంధించి నోటీసులు ఇవ్వకుండా, పరిహారం, పునరావాసం వంటి అంశాలపై స్పష్టత లేకుండా చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. రైతుల హక్కులు కాపాడే వరకు వెనక్కి తగ్గేది లేదని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే ఈ అక్రమ చర్యలను నిలిపివేసి, రైతులతో చర్చలు జరిపి, చట్టబద్ధమైన విధానంలోనే ముందుకు వెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి  వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

Back to Top