యువ వైద్యులకు అండ‌గా ఉంటాం

ప్రభుత్వ మెడలు వంచైనా వారికి పీఆర్ ఇప్పిస్తాం

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి 

ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా వేధించ‌డం దారుణం

న్యాయం చేయ‌మంటే పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించి బెదిరించారు 

రాష్ట్రంలో వైద్య రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ఆగ్ర‌హం 

తాడేపల్లి: ఫారెన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేష‌న్‌ ప‌రీక్ష పాసై, ఇంట‌ర్న్‌షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్‌లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. 
ఇంకా ఆయనేమన్నారంటే...

కూట‌మి ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు ఎవ‌రూ అతీతం కాద‌ని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ను వేధించి ప‌రాభ‌విస్తున్నారు. విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్ర‌భుత్వంపై శాంతి యుతంగా నిర‌స‌న‌కు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివి ప్ర‌జాసేవ చేయ‌డానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్ట‌ర్స్ డే' అని కూడా చూడ‌కుండా పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవ‌మానించింది. పేద కుటుంబాల నుంచి వ‌చ్చి ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి వైద్య విద్య‌న‌భ్య‌సించ‌డంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కండా వేధించ‌డానికి ప్ర‌భుత్వానికి మ‌న‌సెలా ఒప్పిందో అర్థం కావ‌డం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్ల‌పాటు చేయాల‌నే నిబంధ‌న పెట్టి వేధిస్తున్నారు. ఇంట‌ర్న్‌షిప్ చేసిన వారిని రిలీవ్ చేయ‌డం లేదు. ప‌క్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొద‌లుపెట్ట‌డ‌మో, కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో ప‌నిచేయ‌డ‌మో లేదా పీజీలు రాసుకుంటున్నారు. కానీ ఒక్క ఏపీలో మాత్ర‌మే ఇంట‌ర్న్‌షిప్ చేసిన దాదాపు 1500 మందికిపైగా విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్నారు. త‌మ స‌మస్య‌ల‌ను తెలియ‌ప‌ర్చ‌డానికి హెల్త్ యూనివ‌ర్సిటీకి వ‌చ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని క‌లిస్తే ఆయ‌న వారి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో మెడిక‌ల్ విద్యార్థులు శాంతియుతంగా త‌మ నిర‌స‌న తెలియ‌జేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు. తమ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ యువ వైద్యులు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌ని క‌లిశారు. వారికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైయ‌స్ఆర్‌సీపీ సీరియ‌స్ గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.

వైద్యరంగంపై చంద్రబాబు నిర్లక్ష్యం

రాష్ట్రంలో మొత్తం వైద్యరంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైయస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణపనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మద్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఎంబీబీయ‌స్ డాక్ట‌ర్లు, పీజీ డాక్ట‌ర్లను నియ‌మించుకోకుండా ఎలా వైద్యం అందించాల‌నుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో  వైద్యారోగ్య‌శాఖ‌లో ఐదేళ్ల‌లో 54 వేలమంది నియామ‌కం జ‌రిగితే అందులో డాక్ట‌ర్లే 3800 మంది ఉన్నారు. మెడిక‌ల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాక‌రిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వ‌చ్చిన వారికి రిజిస్ట్రేష‌న్లు చేయ‌కుండా వేధిస్తున్నారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్ర‌భుత్వ వైద్య‌రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర‌కు కూట‌మి ప్ర‌భుత్వం తెర‌దీసింది. ఆయుష్మాన్ భార‌త్‌లో కలిపే పేరుతో ఆరోగ్య‌శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఒక్క రూపాయి లేకుండా ఆప‌రేష‌న్లు జ‌రిగితే ఇప్పుడు కూట‌మి పాల‌న‌లో యూజ‌ర్ చార్జీల పేరిట రోగుల‌ను దోచుకుంటున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ఆరోగ్య‌శ్రీ బిల్లులు పెండింగ్ పెట్ట‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో కోపేమెంట్‌ల పేరుతో వసూలు చేసి ఆస్ప‌త్రుల‌ను న‌డిపించుకోవాల్సిన ప‌రిస్థితి ఆస్ప‌త్రి యాజమాన్యాలది. ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించ‌క‌పోతే రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ఉద్యమిస్తాం. ప్ర‌భుత్వం మెడ‌లు వంచుతాం. 

Back to Top