కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అని, పొత్తులతో గెల్చిన పార్టీలు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అన్నింటా దారుణ వైఫల్యం చెందిందని, ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి పార్టీలు, అధికారంలోకి మాట తప్పాయని, అన్నీ గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. ఏ పొత్తూ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన వైయస్ఆర్‌సీపీ అఖండ విజయంతో ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న శ్రీ వైయస్ జగన్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. కాగా, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నీ సర్వనాశనం చేసిందని కడపలో మీడియాతో మాట్లాడిన రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ఆ 5 ఏళ్లలో విప్లవాత్మక మార్పులు: గత ప్రభుత్వ హయాంలో ఆ 5 ఏళ్లలో సీఎం శ్రీ వైయస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులే అందుకు నిదర్శనం. ఆ అభివృద్ధిని, వాటి ఫలాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో పూర్తిగా నాశనం చేసింది. ఏ ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినా, రికార్డుస్థాయిలో ఏడాదిన్నర కాలంలో రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేస్తోంది. సంపద సృష్టించడం తనకు తెలుసని, ఆ పని చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను నమ్మించిన చంద్రబాబు, అధికారం చేపట్టాక అన్నీ గాలికొదిలేశారు. అదే శ్రీ వైయస్ జగన్, ఆ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు. సొంతంగా పోటీ చేసి గెలవడం వల్లనే నిర్దిష్టమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగారు. అదే పొత్తులతో పోటీ చేసి గెల్చిన పార్టీలు అధికారంలోకి వచ్చాక, ఏ హామీ అమలు చేయకుండా, అన్నీ గాలికొదిలేశాయి. అలా ప్రజలను దారుణంగా మోసం చేశాయి. ఏనాడూ పొత్తు లేదు: పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి సొంతంగా పోటీ చేసి గెలవడంతో పాటు, కార్యకర్తలు కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకునేలా జగన్‌గారు ప్రజాపాలన అందించారు. దేశం మొత్తం చూస్తే ప్రతి ఎన్నికలోనూ సొంతంగా పోటీ చేస్తున్న పార్టీ ఒక్క వైయస్ఆర్‌సీపీ మాత్రమే. అందుకే జగన్‌గారి నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి నాయకులకు అప్పుడే నిద్ర లేని రాత్రులు: రాబోయే ఎన్నికల గురించి ఆలోచించి ఇప్పట్నుంచే చంద్రబాబు సహా కూటమి నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. జగన్‌గారికి జనబలం ఉంది కాబట్టే వారికి ఈ భయం. నిజానికి కూటముల ద్వారా, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజలకు మేలు జరగదు. రాష్ట్రాలు అభివృద్ధి చెందవు. ఏకైక నాయకత్వం ద్వారానే నిర్దిష్టమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడం వీలవుతుంది. వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలే దీనికి నిదర్శనం. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. జిల్లాల పునర్విభజన. రాజకీయ కుట్ర: రాజకీయ కుట్రతోనే అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు పేరు మారుస్తున్నారు. నిజంగా ఆయన శ్రీ వెంకటేశ్వస్వామి భక్తుడైతే శ్రీవారికి 30 వేలకుపైగా కీర్తనలు రాసి స్వామి వారిని ఆనంద డోలికల్లో ఓలలాడించిన అన్నమయ్య పేరును కనుమరుగు చేయబోడు. చంద్రబాబు ఆ పని చేస్తే, అది ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గాయపర్చడమే. జిల్లాల పునర్విభజన చేసేటప్పుడు పరిపాలన సౌలభ్యం, ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆలోచించాలి. కానీ జిల్లాల పునర్విభజనలోనూ చంద్రబాబు హేతుబద్ధతకు తిలోదకాలిచ్చి అందులోనూ రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం, జిల్లాలను విభజించుకుంటూ పోతే నైతికత ఏముంటుంది? ఆ ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం కూడా పోతుంది. వీటన్నింటి ద్వారా పెద్దిరెడ్డిగారి కుటుంబాన్ని ప్రజల్లో కనపడనీయకుండా చేయాలన్న పగ చంద్రబాబులో కనిపిస్తోందని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు.