అమరావతి యాత్ర..రాజకీయ యాత్ర

మాజీ మంత్రి కొలుసు పార్థసారధి

బలహీన వర్గాలకు చోటు లేని రాజధాని ఎవరి కోసం?

29 గ్రామాల రైతులకు ఎవరి హయాంలో మేలు జరిగిందో ఆలోచించాలి

రియల్‌ ఎస్టేట్‌ కోసం ప్లాన్‌ చేసిన రాజధాని అమరావతి

తాడేపల్లి: రైతుల పేరుతో చేపట్టిన అమరావతి యాత్ర..రాజకీయ యాత్ర అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్నారని గుర్తు చేశారు. బలహీన వర్గాలకు చోటు లేని రాజధాని ఎవరి కోసమని ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని ప్రజలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందా లేదా అన్నది ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు చేసిన మేలు ఏంటో గమనించాలన్నారు. చంద్రబాబు స్వార్థం కోసం ప్లాన్‌ చేసిన రాజకీయ యాత్ర అని ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు. 

 

ఎమ్మెల్యే పార్థసారథి ఏం మాట్లాడారంటే..:

దిక్కు తోచక దిగజారుడు రాజకీయం:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాలన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేతకు దిక్కు తోచడం లేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న మేలు చూసి, తనకు రాజకీయ సమాధి తప్పదన్న భయంతో చంద్రబాబు విద్వేషపూరిత రాజకీయాలకు పురి కొల్పుతున్నారు. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట.
    రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమానాభివృద్ధి, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ప్రాంతీయ విద్వేషాలకు తావుండకూడదన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం మూడు రాజధానులపై ఆలోచన చేస్తోంది. కానీ దాన్ని అర్ధం చేసుకోకుండా ఇప్పుడే విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇది దారుణం.

ఒకే చోట అంత ఖర్చు! ఆలోచించండి:
    చంద్రబాబు ప్లాన్‌ చేసిన అమరావతి నిర్మాణం కోసం ఇవాళ్టి ధరల ప్రకారం దాదాపు లక్షన్నర కోట్లు కావాలి. అంతే కాకుండా రాజధాని నిర్మాణానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది. ఆ విధంగా చూస్తే, ఒక్క రాజధాని నిర్మాణం కోసమే దాదాపు 6 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని విజ్ఞులైన ప్రజలంతా ఆలోచించాలి. రాష్ట్ర ఇతర ప్రాంతాల అభివృద్ధిని తాకట్టు పెట్టి, కేవలం ఒక్క అమరావతినే అభివృద్ధి చేయడం సబబా? అన్నది ఆలోచించాలని కోరుతున్నాను.

వారికి నా సూటి ప్రశ్న:
    ఇవాళ చంద్రబాబు స్పాన్సర్‌ చేసిన నాయకులంతా ఒకే మాట చెబుతున్నారు. అమరావతి మాత్రమే రాజధాని. అది ఒకటే ఉండాలని అంటున్నారు.
    నేను వారిని ఒకే ప్రశ్న అడుగుతున్నాను. రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అప్పుడు ఇదే కాంగ్రెస్‌ పార్టీ కానీ, వామపక్షాలు కానీ ఎందుకు ప్రశ్నించలేదు? తెలుగుదేశం వైఖరిని ఎందుకు ఖండించలేదు? అంటే విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తప్పా? మరి ఎవరి కోసం ఇవాళ ఆందోళన చేస్తున్నారు? పాదయాత్రలు చేస్తున్నారు?

ఆనాడే ఆయన వైఖరి అర్ధమైంది:
    నిజానికి అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ చేసిన రోజే చంద్రబాబు వైఖరి అందరికీ అర్ధమైంది. ఆయన ఆరోజు వేదిక మీద స్థానిక దళిత ఎమ్మెల్యేకు కానీ, బలహీనవర్గాలకు చెందిన డిప్యూటీ సీఎంలకు కానీ స్థానం కల్పించలేదు. కేవలం తనకు కావాల్సిన వారినే చంద్రబాబు ఆ వేదికపై కూర్చోబెట్టారు.

దమ్ముంటే చర్చకు రండి:
    మేము రాజధాని ఎలా కడతామని అంటున్నారు. మేము మీ మాదిరిగా విద్యార్థుల వద్ద రూ.5, ప్రభుత్వ ఆఫీస్‌ల వద్ద హుండీలు పెట్టినట్లు కానీ, ఇంకా జోలె పట్టి అడుక్కోవడం కానీ చేయబోము. అంత దౌర్భాగ్యస్థితికి మాత్రం వెళ్లబోమని స్పష్టం చేస్తున్నాను. మేము 29 గ్రామాల రైతులకు అన్యాయం చేశామంటున్నారు. దమ్ముంటే దీనిపై చర్చకు రండి.
    జగన్‌గారి హయాంలో ఆయా గ్రామాల రైతులకు మేలు జరిగిందా? లేక చంద్రబాబు హయాంలో మేలు జరిగిందా అన్నది చర్చిద్దాం. 

రైతులకు ఉరితాళ్లు బిగించలేదా?:
    ఇది కేవలం చంద్రబాబు స్వార్థం కోసం ప్లాన్‌ చేసిన రాజధాని. తనకు కావాల్సిన రియల్టర్లకు కోట్ల రూపాయల లాభం రావాలనే ఉద్దేశంతో, అమరావతి చుట్టూ 100 కి.మీ పరిధిలో గ్రీన్‌ జోన్‌ ప్రకటించి, అక్కడి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించలేదా? ఇది వాస్తవమా? కాదా? ఆ 100 కి.మీ పరిధిలో ఎటువంటి నిర్మాణాలు, ఇళ్ల పథకాలు, పరిశ్రమలు రాకూడదని ఉత్తర్వులు ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.
    మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి దీనిపై చర్చించండి. కానీ పిరికిపందలా పారిపోయి, ఇలాంటి విద్వేషపూరిత రాజకీయాలు చేయడం సరికాదు. ఇతర పార్టీల్లో ఉన్న నీ తాబేదార్లను ముందు పెట్టి మాట్లాడిస్తున్నావు. ఇది ఒక ప్రజా రాజధాని అని వారితో చెప్పిస్తున్నావు. ఇది ఎంత వరకు సబబు?

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దా?:
    చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే అమరావతిలో కోటీశ్వరులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ స్కూళ్లకు అతి చౌకగా భూములు ఎందుకిచ్చారు? అంటే వారికి భూములు ఇవ్వొచ్చు కానీ, నిరుపేదలకు ఎందుకు ఇవ్వకూడదు? పేదలకు భూములిస్తే, ఇక్కడ సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందా?

మార్పులను స్వాగతించాలి:
    ఒకప్పుడు రాష్ట్రంలో సమితిలు ఉండేవి. ఆనాడు వాటిని రద్దు చేసిన ఎన్టీ రామారావు, మండల వ్యవస్థలను తీసుకొచ్చారు. మరి ఆనాడు సమితి కేంద్రాల ప్రజల వచ్చి, అలా చేస్తే తమ వ్యాపారం దెబ్బ తింటుందని, భూముల ధరలు తగ్గుతాయని అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే, కొత్త వ్యవస్థ వచ్చేదా? అదే విధంగా 1990 వరకు మన దేశంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉండేది కాదు. కానీ సరళీకృత విధానం అమలు తర్వాత ఈ దేశం అభివృద్ది చెందలేదా?
    ఎప్పుడైనా ఒక నాయకుడికి ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు, దాన్ని అమలు చేయడం సహజం. కానీ దానిపై ఈ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమిటన్నది అర్ధం కావడం లేదు. 
    నిజానికి ఇవాళ ప్రజలు ఏ పని కోసమైనా పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో సచివాలయాలు వచ్చాయి. అక్కడే అన్ని సేవలు అందుతున్నాయి. అయితే గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సేవలు అందొద్దన్నది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. 

మీకు కళ్లుంటే అన్నీ చూపిస్తాం:
    ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఒక నాయకుడు ప్రశ్నిస్తున్నారు. మీకు కళ్లుంటే అన్నీ చూపిస్తాం. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చిన నాయకుడు ఈ దేశంలో మరెవ్వరూ లేరు. ఇది వాస్తవం.చంద్రబాబు మాదిరిగా హామీలు అమలు చేయకుండా తప్పించుకోలేదు. అంతే కాకుండా, అద్దె కోట్లు వేసుకొచ్చిన వారిని చూపించి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పడం లేదు.
    జగన్‌గారు సీఎం అయ్యాక పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. దాదాపు రూ.40,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇన్ని జరుగుతున్నా కూడా కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దిగజారి మాట్లాడుతూ, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
    మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి. ఈ మూడేళ్లలో ప్రజలకు ఏమేం చేశామో చెబుతాం. కానీ మీకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. రాష్ట్రంలో ఇలాంటి విపక్షనేత ఉండడం మరో దౌర్భాగ్యం. ఇది చాలా దురదృష్టకరం.

యాత్రకు ఆదరణ లేదు:
    అసలు ఇవాళ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగానా ఆ యాత్ర? నిజంగా ప్రజల్లో ఆ యాత్రకు స్పందన, ఆదరణ ఉంటే, బౌన్సర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో పేదలకు, కోట్లాది కుటుంబాలకు మేలు జరుగుతోంది. ఇది వాస్తవం. కాబట్టి చంద్రబాబు వేసే ఎత్తుగడలకు, ప్రజలు మోసపోవద్దు.

అదే మా లక్ష్యం:
    రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రతో పాటు, వెనకబడిన రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి. అదే మా ప్రభుత్వ లక్ష్యం.
    చంద్రబాబను నేను ఒకటే అడుగుతున్నాను. గతంలో మీరు కలిసి అధికారం పంచుకున్న బీజేపీనే ఆనాడు స్వయంగా చెప్పింది. రాయలసీమలో హైకోర్టు కావాలని కోరింది. ఇదే విషయాన్ని బీజేపీ మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఈ యాత్ర ఎందుకు? కేవలం రాజకీయ స్వార్థంతోనే ఈ కార్యక్రమం.

 అది టీడీపీ యాత్ర మాత్రమే:

    ఇప్పుడు జరుగుతున్న యాత్ర పూర్తిగా తెలుగుదేశం పార్టీ యాత్ర. ఇది రైతులకు సంబం««ధించింది కాదు. వేరే పార్టీల్లో ఉన్న మద్దతుదారులు, లేకపోతే వారి తాబేదార్లు.. అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఈ యాత్ర చేస్తున్నారు.
    రాజధాని అమరావతిలో నిరుపేదలకు ఇళ స్థలాలు ఇవ్వొద్దని చంద్రబాబు కుట్ర చేశారు. కానీ అదే మా సీఎంగారు ఇక్కడ కూడా నిరుపేదలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని చూస్తున్నారు. అందుకే సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించి, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది పేదల పట్ల ఆయనకున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top