అనంతపురం: కూటమి పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత సాకె శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, పోలీసులే చట్టాన్ని అతిక్రమించి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్దిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం రంగాల్లో విఫలమైంది. ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను నోళ్లు మూయించడానికి, రాజకీయ కక్షసాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. కొంతమంది పోలీసులు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి చట్టాలను అతిక్రమిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. కొంతమంది పోలీసుల ప్రవర్తన రౌడీలకన్నా దారుణంగా మారింది. కోర్టులు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మహిళల విషయంలో పోలీసుల ప్రవర్తన మరింత దారుణంగా ఉంటోంది. చట్టాలను ఉల్లంఘించి మహిళల అక్రమ అరెస్టులు రెండు రోజుల క్రితం కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన అనే దళిత మహిళను అరెస్ట్ చేసిన తీరు పోలీసుల వ్యవస్థను ప్రజలు చీదరించుకునేలా ఉంది. ఊరిలో జరిగిన సంఘటన విషయంలో అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా నైటీలో రాలేను, చీర కట్టుకుని వస్తానని ఆమె పోలీసులను వేడుకున్నా వినకుండా లాక్కుని పోయిన ఘటన గురించి తెలిసి ప్రజాస్వామ్య వాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వేకువజామున 3 గంటల సమయంలో 20 మంది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి, కోర్టులో మాత్రం ఉదయం అరెస్ట్ చేసినట్టు చూపించారు. అంతకుముందు కూడా పెద్దిరెడ్డి సుధారాణి, పాలేటి కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తలను మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి పలు స్టేషన్లు తిప్పి వేధించారు. గత ఎన్నికల్లో వైయస్సార్సీపీ పరాజయం తర్వాత సుధారాణి, చిలకలూరిపేటను వదిలి కుటుంబంతో సహా తెలంగాణ వెళ్లిపోయి బతుకుతున్నా వదలకుండా ఆమెను రప్పించి మరీ జైలు పాలు చేశారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించిన తీరు బాధాకరం. పోలీసులు అదుపులోకి తీసుకున్న మూడురోజుల తర్వాత కానీ, అరెస్ట్ చేసినట్టు చూపించలేదంటే పోలీసులు ఎంతలా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాతో ఆమె భర్తకు సంబంధం లేకపోయినా ఆయన మీద కూడా కేసులు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అనే గౌరవం లేకుండా, మహిళ అని కూడా చూడకుండా విడదల రజిని పట్ల సీఐ సుబ్బానాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో పోలీసులున్నారా? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటికీ మాయమాటలు చెబుతున్నారు. ప్రసార మాధ్యమాలన్నీ తమ చేతుల్లో పెట్టుకుని ప్రజలను మోసం చేయొచ్చనే కలల్లో బతుకుతున్నారు. వాటి నుంచి ఎంత తొందరగా బయటకొస్తే వారికే మంచిది. సత్యమేవ జయతే కి అర్థమే మార్చేశారు పోలీస్ స్టేషన్‌కి వెళితే సత్యమేవ జయతే అని కనిపిస్తుంది. దాన్ని పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అమలు పరుస్తున్నారు. మహిళల మీద జరుగుతున్న ఇలాంటి అనైతిక చర్యలకు శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రోజురోజుకీ హింసాప్రవృత్తి పెరిగిపోతోంది. రోజురోజుకీ క్షీణిస్తున్న శాంతిభద్రతలే దీనికి కారణం. ఏడాది పాలన పూర్తికాకుండానే విమర్శలను సహించలేని స్థితికి చేరుకున్నారంటే కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ న్యాయస్థానాలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబుకి ఇలా వ్యవహరించడం తగదు. ఒక కింది స్థాయి పోలీస్ అధికారి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఏకవచనంతో మాట్లాడుతుంటే, ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిందిపోయి.. సీఎం చంద్రబాబు సహా టీడీపీ నాయకులు వెనకేసుకుని రావడం చూస్తుంటే వారే ప్రోత్సహిస్తున్నారని అర్థమైపోతుంది. స్వేచ్ఛ సమానత్వం, మానవహక్కులను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. మహిళల పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల హోంమంత్రి అనిత కూడా పునరాలోచన చేసుకోవాలి.