నెల్లూరు జిల్లా: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని డి.ఆర్.ఉత్తమ్ హోటల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ` ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షాలపై ఉంటుంది. పోరాటాలకు, విమర్శలకు పరిమితం కాకుండా, సమాజం పట్ల అందరం బాధ్యత వహించాలి. విద్య, వైద్యం అనేవి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు అని మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిత్యం పర్యవేక్షించారు. నాడు నేడు పధకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత వైయస్ జగన్‌ది. కోవిడ్ లాంటి దురదృష్టకర పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకున్నారు. వైయస్ జగన్ కోవిడ్ లాంటివి విపత్కర పరిస్థితిని చూసి రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు. వైయస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొనివచ్చారు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి, 5 మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యి, మిగిలినవి వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. వైయస్ జగన్ తీసుకుని వచ్చిన 17 మెడికల్ కాలేజీల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభించింది. చంద్రబాబు ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని వర్గాల సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం భేరాసారాలు చేస్తుంది తప్ప, విరమించుకునే ఆలోచన చేయడం లేదు. దేశంలో పలు రాష్ట్రాలలో మెడికల్ విద్య ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తూ, తిరుగుబాటు చేయడంతో ఆయా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. చంద్రబాబు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను ఎకరం వంద రూపాయలకు ప్రైవేట్ పరం చేస్తున్నాడు. చంద్రబాబు ఎవరి ప్రలోభాలకు గురై ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేట్ పరం చేసేందుకు ఆలోచన చేస్తున్నాడో అన్నది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న. విద్యారంగం ప్రైవేట్ పరం కావడం వలన, విద్య వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు, పోరాటాలు చేస్తే పోలీసులు షరతులు విధిస్తూ, నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల సంఘాలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఆచార్యులు, మేధావులు, విద్యావేత్తలు, చట్టసభలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులను కలుపుకొని వెళ్లి, వారి సూచనలు, సలహాలు తీసుకొని ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటాం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో మా పోరాటం కొనసాగిస్తాం. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేస్తే, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పేద ప్రజలకు మేలు కలగడమే లక్ష్యంగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు` కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.