కూటమి ప్రభుత్వంలో ఆర్థిక‌ విధ్వంసం

 ఏడు నెలల్లో రూ.1.20 లక్షల కోట్లు అప్పులు

ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలం

మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం

కూటమి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు

నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి కూడా ఇవ్వడం లేదు

సంపద సృష్టించడం అంటే.. దేశంలోనే సంపన్నుడైన సీఎంగా ఉండటమా?

రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది

ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతోంది

ప్రెస్‌మీట్‌లో మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంసక పాలన సాగిస్తోందని మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల కన్నా జీడీపీ పది శాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఏడు నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.

సంపద సృష్టి అంటే..:
    సంపద సృష్టిస్తాను అని పదేపదే సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు అర్థం.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన సీఎంగా తాను గుర్తింపు పొందడం అని అర్థం చేసుకోవాలి. ఆయన పాలనలోని ప్రజల జీవితాలు మాత్రం రోజురోజుకూ పేదరికం వైపు పయనిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని దూరం చేసింది. మేనిఫేస్టోలో చెప్పిన హామీల అమలుపై దృష్టి లేదు, కానీ ఏడు నెలల్లోనే ఏకంగా రూ.1.20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. మరి ఈ నిధులను ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు?

చంద్రబాబు షో పాలిటిక్స్‌:
    మరోవైపు ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.16 వేల కోట్లు విద్యుత్‌ ఛార్జీల రూపంలో మోపారు. సంక్రాంతి పండుగకు ప్రభుత్వం కానుక రాకపోతే, కనీసం వారు బయటి మార్కెట్‌ లో నిత్యావసరాలను సైతం అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. గొప్ప విజనరీని అంటూ ప్రతిసారీ డాక్యుమెంట్లను విడుదల చేసి, షో పాలిటిక్స్‌ చేస్తున్న చంద్రబాబు తన పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను ఏ మాత్రం  పట్టించుకోవడం లేదు. 

ఇప్పుడు వైయస్‌ జగన్‌ ఉండి ఉంటే..:
    వైయస్‌ జగన్‌ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫేస్టోను తూచా తప్పకుండా అమలు చేశారు. ప్రజలకు సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించి పక్కాగా పథకాలన్నీ అమలు చేశారు.
    ఈసారి ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే.. గత ఏప్రిల్‌ నెలకు సంబంధించి వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకార భరోసా, డీజిల్‌ సబ్సిడీ ఇచ్చేవారు. జూన్‌ నెలలో అమ్మ ఒడి, జులై లో విద్యాకానుక, వాహన మిత్ర, కాపునేస్తం, చిరువ్యాపారులకు జగనన్న తోడు వచ్చేవి. ఆగస్టులో రెండో విడత విద్యాదీవెన, నేతన్న నేస్తం అందేది. సెప్టెంబర్‌ లో వైయస్‌ఆర్‌ చేయూత, అక్టోబర్‌ లో రెండో విడత రైతుభరోసా, నవంబర్‌ లో మూడో విడత విడత విద్యాదీవెన, రైతులకు సంబంధించి సున్నావడ్డీ, డిసెంబర్‌ లో ఈబీసీ నేస్తం, లా నేస్తం జమ చేసేవారు. జనవరిలో జగనన్న తోడు, రైతుభరోసా జమ చేసే వారు.

ఏమీ లేకున్నా రూ.1.20లక్షల కోట్ల అప్పు:
    కూటమి ప్రభుత్వం వాటిలో ఏ ఒక్కటీ ఈ ఏడు నెలల్లో ఇవ్వకపోయినా, ఏకంగా రూ.1.20 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసింది. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కొనసాగించక పోగా, ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు. నిరుద్యోగభృతి ఇవ్వడం లేదు. మరి తెచ్చిన ఆ అప్పంతా ఏమైందన్న దానికి సమాధానం లేదు. మరి మీరు చేస్తున్న అప్పులు ఎవరికి మేలు చేయడానికి? కూటమి ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజల జీవన శైలి కూడా మారుతోంది. పథకాల అమలు లేక ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతోంది

ఆరోగ్యశ్రీ పథకం ఉసురు తీస్తున్నారు:
    ఎందరికో ప్రాణదానం చేసిన ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఆ పథకంపై గత మా ప్రభుత్వంలో దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశాం. శస్త్ర చికిత్స తర్వాత రోగులకు విశ్రాంతి సమయంలో కూడా ఆర్థిక సాయం చేస్తూ, అమలు చేసిన ఆరోగ్య ఆసరాలో 24 లక్షల మందికి దాదాపు రూ.1400 కోట్లు ఇచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం, పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, నెట్‌వర్క్‌  ఆస్పత్రులకు బిల్లులు కూడా చెల్లించడం లేదు. ఏకంగా రూ.3 వేల కోట్లు బకాయి పడడంతో, ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద చికిత్సను పూర్తిగా నిలిపివేశాయి. అలా పథకాన్ని నిర్వీర్యం చేసి, ఇప్పుడు బీమా పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

Back to Top