పెనుకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానం హాస్యాస్పదమని పెనుకొండలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, అమరావతి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎండగట్టారు. ప్రెస్‌మీట్‌లో ఉషాశ్రీ చరణ్ ఇంకా ఏమన్నారంటే.. అమరావతిపై నమ్మకం లేకే పదేపదే తీర్మాణం గతంలో 2014–2019లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే తీర్మానం చేయడం చూస్తే, వాళ్లకే నమ్మకం లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడిన తీరు చూస్తే, మళ్లీ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందనే భయంతో తమకు తామే సంజాయిషి ఇచ్చుకున్నట్టుంది. మొదటి విడత రైతులకు తీవ్ర అన్యాయం రాజధాని కోసం మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. 33 వేల ఎకరాలు సేకరించిన తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదు. ఆ భూములపై రుణాలు తెచ్చి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలి. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో మరోసారి భూములు సేకరించి వాటిని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. రాజధాని ప్రాంతంలో చంద్రబాబును మరోసారి నమ్మి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వారి సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ భూసేకరణకు ప్రయత్నించడం అన్యాయం. అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు వైయస్ఆర్‌సీపీ అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి కూడా రాజధానిగా ఉండాలని శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నమ్మి ఓట్లు వేసిన బీసీలకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుచేయలేదు. నిరుద్యోగ భృతి జాడే లేదు. ఆడబిడ్డ నిధి అడ్రస్ లేదు. వైయస్ జగన్ పాలనలో ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారు. కానీ రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం రూ.3.41 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. రెండో విడత ల్యాండ్ పూలింగ్ అన్నది కేవలం చంద్రబాబు ఆడుతున్న నాటకం మాత్రమే. ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయంతో బయటకు రావడం లేదు. అసెంబ్లీలో మీకు మీరే భజన చేసుకుంటూ ప్రతిపక్షాన్ని విమర్శించడం సరైంది కాదు. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని పరిపాలనపై దృష్టి పెట్టాలి” అని ఉషాశ్రీ చరణ్ స్పష్టం చేశారు.