రాజమహేంద్రవరం: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి మార్గాని భరత్‌రామ్ అన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆయన ఆధ్వర్యంలో కోటగుమ్మం వద్ద వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కూరగాయలు, ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని, గ్యాస్ సిలిండర్లను భుజాలపై మోస్తూ, పెరిగిన ధరలకు సంబంధించిన వస్తువులను బండిపై ఉంచి ప్రదర్శన నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ధరలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ధరలను పోలుస్తూ ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ బియ్యం, నూనె, ఉల్లి, గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిత్యావసర ధరలు తగ్గించే వరకు వైయస్ఆర్‌సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, ప్రజా సమస్యలపై స్థానిక సంస్థల్లో బలంగా ప్రశ్నించే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, గుర్రం గౌతమ్, రావిపాటి రామచంద్రరావు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.