కాకినాడ: టైకి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున 10 లక్షలు, కంపెనీ తరఫున 40 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం లక్ష, కంపెనీ రూ. 3 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇక మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇండ్ల స్థలం(ప్రభుత్వం తరఫున) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాల పక్షాన పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం ఆటోనగర్ వద్ద బల్క్‌డ్రగ్స్ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో సూపర్‌వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.