అనంతపురం: కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తన వల్లే రాయలసీమ లిఫ్ట్ స్కీం ఆగిందని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి... పనులు నిలిపివేతకు బాబు అంగీకరించారంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనే వారిద్దరి రహస్య బంధాన్ని బట్టబయలు చేసిందని స్పష్టం చేశారు. దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. చంద్రబాబు తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం జరిగిందని.. తాజాగా మరలా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డ చంద్రబాబు తీరువల్ల రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమవుతాయని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో రూ.3850 కోట్లతో ప్రారంభిస్తే... ఆ పనులను ముందుకు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... ● చేతకాని ప్రభుత్వమిది.. రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు అధికారికంగా కేటాయించబడిన నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి అనువుగా వైయస్.జగన్ హయాంలో ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపుచేయించామన్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే... ఏపీ సీఎం చంద్రబాబు చేతగానితనానికి నిదర్శనం. ఈ విషయంలో అవసరమైతే నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ చేద్దాం, చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ను ఆపివేయాలని కోరితే దానికి బాబు అంగీకరించాడన్న ఏకంగా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు వైఫల్యానికి నిదర్శనం. ఇంత నగ్నంగా తెలంగాణా సీఎం వాస్తవాన్ని భయటపెట్టిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబుకు ముఖ్మమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఎక్కడ ఉంది? ● స్వప్రయోజనాల కోసం రాష్ట్రం తాకట్టు... తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాకు సిద్ధం కావాలి. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. రాయలసీమ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రకృతి నిరాదరణ కారణంగా బీడుబారి, కరువు బారిన పడిన ఈ ప్రాంతంలో కేవలం మిగులు జలాలు, ఇతర ప్రాజెక్టులు ఆధారంగానే నడుస్తున్నాయి. ఇవి కూడా ఎప్పుడు ఆగిపోతాయో, వీటి వీళ్ల నీళ్లు అందని పరిస్థితి వస్తుందేమోనని రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. ● నోరు మెదపని చంద్రబాబు... ఇవాళ ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచుతూ తీర్మానించిన క్యాబినెట్ రూ.70 వేల కోట్లతో త్వరితగతన ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఆ సందర్భంలో కూడా మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే చంద్రబాబు.. తనకు అత్యధికంగా ఎంపీలున్నా.. నోరు మెదపలేదు. గతంలో కూడా చంద్రబాబు కీలకంగా ఉన్నప్పుడే... ఆల్మట్టీ డ్యామ్ ఎత్తుపై నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు. ఇవాళ మరలా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే ప్రక్రియ పూర్తైతే రాయలసీమ ప్రాజెక్టులకు నీరందరడమే గగనం అవుతుంది. గాలేరు-నగరి, హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిర్వీర్యం అవ్వడం ఖాయం. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి దారుణం. ● వైయస్.జగన్ హయాంలోనే ప్రారంభం... వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోతురెడ్డిపాటు ద్వారా కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి దాదాపు రూ.3850 కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తొలిదశ పనులు ప్రారంభించే సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్, ఎక్స్ పెర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా దానికి బ్రేక్ పడింది. అయితే తాగునీటి అవసరాల కోసమే పనులు చేశాం, పర్యావరణ అనుమతులతో ఈ మాత్రం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని గట్టిగా వాదించి.. పనులు కొనసాగించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే వైయస్.జగన్ అనే సంకుచిత ఆలోచనలతో చంద్రబాబు వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించాలని ప్రజా సంఘాలు సైతం చంద్రబాబుపై ఒత్తడి తెచ్చారు. కానీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ద్వారా వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపడింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు... వాళ్లిద్దరి అవినాభావ సంబంధం గురించి ఓటుకు నోటు కేసు నుంచి అందరికీ తెలుసు. వాళ్లిద్దరూ ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్న విషయము కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన రేవంత్.. ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబుకు ఉన్న లాలూచీ కూడా అందరికీ తెలుసు. చంద్రబాబు ఇంత నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడటాన్ని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబుకి లేదు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు సమాధానం చెబుతారు. ఓ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి తాను చంద్రబాబునాయుడిని ప్రభావితం చేయడం వల్లే... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయని ఆధారాలతో సహా నిరూపిస్తానంటే.. టీడీపీ నేతలు దీనిపై ఏం సమాధానం చెబుతారు. 101 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు రావాల్సి ఉంటే.. రెండు దశాబ్దాల కాలాన్ని తీసుకుంటే ఒకటి, రెండు సందర్భాల్లో మినహా ఎప్పుడూ రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీళ్లు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైయస్.జగన్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే... మరోవైపు చంద్రబాబు వైఖరి కారణంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ● అక్రమ ప్రాజెక్టులపై ఎందుకు మౌనం? మరోవైపు తెలంగాణాలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాదాపు రూ.950 కోట్లు ఫైన్ విధించినా కూడా పాలమూరు-రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులను ఏ మాత్రం ఖాతరు చేయకుండా తెలంగాణా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. అయినా చంద్రబాబు నాయుడు తెలంగాణా అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు. అదే సమయంలో కృష్ణా జలాల వివాదంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు తీర్పు, రాష్ట్ర విభజన చట్టం చెప్పిన దానికి భిన్నంగా విచారణ ముందుకు కొనసాగుతోంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్దంగా, విభజన చట్టానికి భిన్నంగా కె డబ్ల్యూ టీ -1 అవార్డుని పునహ్ సమీక్షించడానికి వీల్లేదని వైయస్.జగన్ దాన్ని ఆపించింది. ఇవాళ మరలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పునహ్ సమీక్ష చేసి మనకు కేటాయించిన జలాల్లో మార్పులు చేస్తే రాష్ట్ర ప్రాజెక్టులన్నీ తలక్రిందులవుతాయి, మన ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిసినా ఈ ప్రభుత్వం పేలవంగా ప్రవర్తించింది. కేవలం తనపై ఉన్న అవినీతి కేసులను ఎత్తివేయించుకోవడానికే చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ.. తనమీదున్న అవినీతి కేసుల్లో వాదించడానికి వచ్చిన లాయర్లకు రూ.కోట్లలో ప్రజాధనాన్ని దోచిపెడుతున్నాడు. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడ్డానికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటుంటే ఎందుకు సమర్ధవంతమైన అడ్వకేట్లను నియమించలేకపోతున్నాడు. ● రాయలసీమపై మమకారం లేని బాబు... చంద్రబాబుకు ఎప్పుడూ రాయలసీమ ప్రాంత ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయన ఏనాడూ మానవత్వంతో వ్యవహరించలేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రాజెక్టులపై కనీస శ్రద్ద చూపని చంద్రబాబు... జీతభత్యాలు కూడా చెల్లించలేదు. వైయస్.రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత హంద్రీనీవా, గాలేరు-నగిరి ప్రాజెక్టు పనులు పరుగులెత్తించారు. అందువల్లే అనంతపురం వంటి జిల్లాలో గొప్ప మేలు జరిగింది. ప్రజలు కొద్దో గొప్పో సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం జిల్లాకు కేటాయించిన నీటినే తీసుకుని రాలేకపోతుంది. వైయస్.జగన్ హయాంలో రూ.6,500 కోట్లతో హంద్రీ నీవా కాలువ విస్తరణ ద్వారా 6 వేల క్యూసెక్కులు నీటిని తీసుకునిపోయే విధంగా నిర్మించడానికి టెండర్లు కూడా పిలిచారు. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత రూ.3 వేల కోట్లతో కేవలం రూ.3,500 క్యూసెక్కులకు కాలువల సామర్ధ్యాన్ని తగ్గించారు. దీనిపై పూర్తస్దాయి విచారణ జరపాలి. వైయస్.జగన్ హయాంలో హంద్రీ-నీవాను గాలేరు-నగరితో లింక్ చేయడం ద్వారా అనంతరపురం వరకే దీన్ని పరిమితం చేయకుండా.... రూ.1500 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టుల లింక్ పనులు కోసం ఖర్చుపెట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టుల అనుసంధానం ఆగిపోయింది. దీనికి కేవలం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. కానీ ఇవాళ కళ్లముందు చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులను గాలికొదిలి... ఈ ప్రాంత ప్రయోజనాలను గాలికొదిలి మభ్యపెట్టే మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడ్డానికి చంద్రబాబును నిలదీయాలి. వైయస్.జగన్ ప్రారంభించి దాదాపు పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను ఎందుకు అడ్డుకుంటున్నారు? వెనుకబడిన ప్రాంతాలపట్ల, ఈ విద్యార్ధుల పట్ల మీ వైఖరేంటి అన్నది ప్రజలకు అర్ధం అవుతుంది. రాయలసీమ నుంచి వచ్చిన మీరు ఎందుకు ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు? అమరావతి కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. అమరావతి నిర్మాణం కంటే అక్కడ వచ్చే కమిషన్ల మీదే మీ దృష్టి ఉందన్నది అందరికీ అర్ధం అవుతుంది. రాష్ట్ట్రంలో మిగిలిన ప్రాంత ప్రజల బాధలు గురించి కూడా ఆలోచన చేసే తీరిక చంద్రబాబుకి లేకుండా పోయింది. ప్రశ్నించాలని నీతులు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అసలు రాష్ట్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఏం జరుగుతుందో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అర్దం కావడం లేదు, ఆయన ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఆయన కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డికి చంద్రబాబు, టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. ఏ మాత్రం నైతికత ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.