గుమ్మం ముందుకే నిత్యావసర సరుకులు

సరుకుల పంపిణీ వాహనాన్ని పరిశీలించిన మంత్రులు కొడాలి నాని, బుగ్గన, శ్రీరంగనాథరాజు

విజయవాడ: అవినీతికి తావు లేకుండా నాణ్యమైన నిత్యావసర సరుకులను పేదల  ఇంటికే చేర్చాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం విజయవాడ సబ్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నిత్యావసర సరుకుల పంపిణీకి  రూపొందించిన మొబైల్‌ వాహనాలను మంత్రులు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీరంగనాథరాజు పరిశీలించారు. కొన్ని మార్పులు చేర్పులను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తద్వారానే రాష్ట్రంలో సంక్షేమ రాజ్య స్థాపన సాధ్యమవుతుందని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢంగా విశ్వసిస్తున్నారన్నారు. 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ద్వారా నిత్యావసర వస్తువులను డోర్‌ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. 
 

Back to Top