సచివాలయం: ఉపాధ్యాయుల బదిలీకి వెబ్ ఆప్షన్ ప్రక్రియ నిర్వహించామని, 99 శాతం మంది టీచర్లు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను వినియోగించుకున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రేపు అర్ధరాత్రి వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉంటుందని, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వినియోగించుకోవాలని
సూచించారు. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘వెబ్ ఆప్షన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ జోన్‌లో 26,117 మంది 99 శాతం వినియోగించుకున్నారు. కేవలం 292 మంది ఉపాధ్యాయులు మిగిలి ఉన్నారు. వారి కోసం ఇంకా ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉంచాం.
మొత్తం 76,119 మంది వెబ్ కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకుంటే.. వారిలో 74,414 మంది అంటే సుమారు 98 శాతం వినియోగించుకున్నారు. రిక్వస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి 50 వేల మందిలో 48,589 మంది అంటే సుమారు 98 శాతం వినియోగించుకున్నారు. ఇంకా పెండింగ్‌లో 1,413 మంది ఉన్నారు. కంపల్సరీలో 292 మంది పెండింగ్‌లో ఉన్నారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాల వారీగా సర్వర్లను విడగొట్టడం జరిగింది. ఎవరైనా నమోదు చేసుకున్న ఆప్షన్‌లను మార్పులు చేసుకోవాలనుకుంటే 18వ తేదీ అర్ధరాత్రి వరకు ఆప్షన్‌లను ఎనేబుల్ చేసే ఉంచుతాం. 19వ తేదీ నుంచి ఫ్రీజింగ్ ప్రక్రియ మొదలుపెడతామని, నాలుగైదు రోజుల తరువాత ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ సిస్టమ్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.