అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం అంటే పేదవాడి ఆరోగ్య రక్షణగా నిలిచిందని డిప్యూటి సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూర్వ వైభవం తీసుకువచ్చారన్నారు. రూ.1000 వైద్యం ఖర్చు దాటితే ఆ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఆరోగ్యశ్రీ పథకంపై జరిగిన చర్చలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మందికి ప్రాణదానం చేశారు. స్వతహాగా ఆయన డాక్టర్ కాబట్టే ఇలాంటి కార్యక్రమం అమలు చేశారు. దురదృష్టవశాత్తు మహానేత మరణం తరువాత చంద్రబాబు సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు..విలువ లేదు. ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆరోగ్యశ్రీకి పేరు మార్చి ప్రక్షాళన చేశానని అనుకున్నాడు. ఆరోగ్యశ్రీని పేదలకు అందకుండా చేశారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.477 పెండింగ్‌లో పెట్టారు. బిల్లులు కట్టాలనే ఆలోచన చంద్రబాబు చేయలేదు. టీడీపీ హయాంలో జరిగిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని అసెంబ్లీలో చంద్రబాబు ఆందోళన చేశారే తప్ప..పేదల గురించి ఆలోచన చేయలేదు. హెల్త్ స్కీమ్‌లో కూడా రూ.154 కోట్లు బకాయిలు పెట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడమో కాదు..ఆ రోజు బకాయిలు రూ.631 కోట్లు చెల్లించారు.
పాదయాత్ర సమయంలో ప్రజల మనోభావాలు తెలుసుకున్న వైయస్ జగన్ ఈ రోజు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు చేర్పులు చేశారు. ప్రతి పేదవాడికి కూడా ఈ పథకాన్ని చేరువ తీసుకెళ్లారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆదాయ పరిమితి గతంలో రూ.80 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. రాష్ట్రంలో నెట్‌వర్క్ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ..వాటి పరిధిని 1400కు పెంచాం. ఇతర రాష్ట్రాల్లో 137 ఆసుపత్రులను ఆరోగ్యశ్రీపరిధిలోకి తీసుకువచ్చాం. క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వరకు ప్రభుత్వమే భరించింది. గతంలో 1059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ప్రస్తుతం 2436 చికిత్సలకు పెంచారు. కోవిడ్‌ను కూడా చేర్చామన్నారు. పేద ప్రజలు ఎక్కువగా ఏ వ్యాధి బారిన పడుతున్నారో ఆ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రలను నియమించారు.
వైద్యం అందించి అంతటితో ఆగకుండా ఆపరేషన్ చేయించుకున్న తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఆ పేషేంట్‌కు బలవర్ధకమైన ఆహారం అవసరం. అలాంటి అవసరాన్ని తీర్చేందుకు వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద ప్రతి రోజు రూ.220 చొప్పున ఎన్ని నెలలు అవసరమైతే అన్ని నెలలు పింఛన్ ఇస్తున్నాం. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా నాణ్యమైన అందించేందుకు టీచింగ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. పీహెచ్‌సీ స్థాయి వరకు రూ.16000 కోట్లతో వైద్య ఆరోగ్య రంగానికి ఖర్చుచేస్తున్నాం. గిరిజనులకు సరైన చికిత్స అందక ఎంతో మంచి మృత్యువాత పడ్డారు. ఐటీడీఏ పరిధిలో ఐదు మల్టి స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేదల వైద్యానికి ఎక్కడా ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.