మీ బిడ్డల అభివృద్ధి కోసమైనా.. తీరు మార్చుకోండి

రాసనపల్లె గ్రామస్తులకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశం

చిత్తూరు: సారా తయారీలో మునిగిపోయి రాసనపల్లె అభివృద్ధికి దూరమైందని, సారా తయారీ ఆపేస్తామని ప్రతినబూనాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. మీ బిడ్డల అభివృద్ధి కోసమైనా మీ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులను ఆయన ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని రాసనపల్లె దళితవాడలో సారా నిర్మూలన కోసం ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాజరయ్యారు. కుటుంబాలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యపాన నిషేధ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా బెల్ట్‌షాపులు రద్దుచేశారని, మద్యం దుకాణాలను కూడా తగ్గించారన్నారు. సారా తయారీ ఆపేస్తామని రాసనపల్లె గ్రామస్తులు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top