బాబు కోవర్టుల స్క్రిప్టునే అమిత్‌ షా, నడ్డా చదివారు

సభ ఎందుకు పెట్టారు..? ఆ సభ నుంచి ఎవరి ప్రభావంతో డైవర్ట్‌ అయ్యారు?

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని మోడీ చెప్పారు

ఆ మాటలను అమిత్‌ షా, నడ్డా మరిచిపోయారా..?

పలు సందర్భాల్లో సీఎం వైయస్‌ జగన్‌ని ప్రధాని మోడీ మెచ్చుకున్నారు

చరిత్రహీనుడైన చంద్రబాబుతో లాలూచీపడితే ఒరిగేదేమీ ఉండదు

మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ ఇవ్వండి.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ 

సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తే.. వారు ఆంధ్రులకు మరింత దూరమవుతారు తప్ప ఇసుమంతైనా గౌరవం పొందలేరని, బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు ఇచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌ షా, నడ్డా చదివి వెళ్లిపోయారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోయిన చంద్రబాబుతో లాలూచీపడి.. బాబు కోర్టుల మాటలు విని టీడీపీతో చేతులు కలిపితే ఒరిగేదేమీ ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బీజేపీ పెద్దలు అమిత్‌ షా, నడ్డా చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ను పలు సందర్భాల్లో ప్రధాని మోడీ మెచ్చుకున్నారని, దానికి విరుద్ధంగా ఇప్పుడు అమిత్‌ షా, నడ్డా మాట్లాడుతున్నారన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

‘‘సీఎం వైయస్‌ జగన్‌పై టీడీపీ కోవర్టులు చెప్పిన మాటలను ప్రధాని మోడీ నమ్మితే.. బడ్జెట్‌ లోటు కింద రూ.10 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపు రూ.13 వేల కోట్లు.. ఇలా ఏకకాలంలో 23 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం సీఎం వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకానికి ప్రతీక కాదా.. సీఎం వైయస్‌ జగన్‌పై పూర్తి నమ్మకం ఉండబట్టే మోడీ ఫండ్స్‌ రిలీజ్‌ చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా ఏరోజూ పైసా విదిల్చలేదు. 

చంద్రబాబును నమ్మలేదు కాబట్టే ప్రధాని మోడీ నిధులు ఇవ్వలేదు.. సీఎం వైయస్‌ జగన్‌ మీద నమ్మకం ఉండబట్టే ఆనాటి బ్యాక్‌లాక్‌ నిధులు కూడా రిలీజ్‌ చేశారు.. దీన్ని అమిత్‌షా, నడ్డా మరిచిపోవడం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. పోలవరం గురించి ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు సభలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎం కార్డులా వాడుకుంటున్నాడని, నిధులు దోచేస్తున్నాడని చెప్పిన మాటను  అమిత్‌షా, నడ్డా మర్చిపోయారా..? చంద్రబాబుపై నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు నాయకులు మరిచిపోయి విచిత్రంగా మాట్లాడుతున్నారు. 

ప్రధాని మోడీతో అమిత్‌షా, నడ్డాకు మధ్య గ్యాప్‌ ఏదైనా వచ్చి ఉండాలి. లేకపోతే బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టుల ప్రభావం అయినా వీరిద్దరిపై పనిచేసి ఉండాలి. సీఎం వైయస్‌ జగన్‌పై అమిత్‌షా, నడ్డా మాటలు అర్థరహితం. నిజంగా మోడీకి సీఎం వైయస్‌ జగన్‌తో సత్సంబంధాలు లేకపోతే చంద్రబాబు అడిగినా ఇవ్వని నిధులు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.. సీఎం ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను విని తగిన నిర్ణయాలను ప్రధాని మోడీ తీసుకుంటున్నారు. అలాగే కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాలు, తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ లేదు. 

తొమ్మిది సంవత్సరాల మోడీ పరిపాలనపై మహాజన సంపర్క్‌ పేరిట సభ పెట్టి  చెప్పాల్సిన విషయం మర్చిపోయి ఇద్దరు నేతలు మాట్లాడారు. సభ ఎందుకు పెట్టారు.. ఆ సభ నుంచి ఎవరి ప్రభావం వల్ల డైవర్ట్‌ అయ్యారో ఆలోచన చేసుకోవాలి. చెప్పుడు మాటలు విని సీఎంపై చౌకబారు విమర్శలు చేస్తే అది వారి స్థాయికి సరిపోదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఆంధ్రుల చిరకాల కోరిక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటను నిలబెట్టుకొని మీ చిత్తశుద్ధిని చాటుకోండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకొని ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగండి.. విశాఖ రైల్వేజోన్‌ ఉత్తర్వులను అమల్లోకి తీసుకొచ్చి ఆంధ్రుల అభిమానాన్ని చురగొనండి’’ అని అమిత్‌ షా, నడ్డాలకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సూచించారు. 

Back to Top