మొక్కజొన్న రైతుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఆందోళన

వినతిపత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు 

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలోని కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమం జరిగింది. నందిగామ నియోజకవర్గానికి చెందిన రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న‌రావు ఈ నిరసనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రైతులు మొక్కజొన్న కంకులతో నిరసన వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పీజీఆర్ఎస్‌లో వినతిపత్రాన్ని సమర్పించారు.

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గ పరిధిలోని మొక్కజొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్థానికంగా ఉన్న రెండు డిస్టిలరీలు రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి డిస్టిలరీలకు సరఫరా చేయాలని, నందిగామ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు. పంట చేతికొచ్చినా రైతుల నుంచి కొనుగోలు చేయకుండా దళారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నందిగామలోని డిస్టిలరీలు స్థానిక రైతుల పంటను కొనుగోలు చేయకపోతే, రైతుల తరఫున పెద్దఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.
 

Back to Top