విశాఖపట్నం: సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త ఉందని ప్రశ్నించిన వారిపైనే కేసులా? అంటూ వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఏం మాట్లాడారంటే..: కూటమి ప్రభుత్వ పని. వ్యవహారం హేయం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి పులిహోర ప్రసాదంలో నత్త రావడంపై ప్రశ్నించిన భక్తులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడం అత్యంత దారుణం. ప్రసాదం అపవిత్ర ఘటనపై ప్రశ్నించడమే తప్పు అయినట్లు భక్తులను తప్పుడు కేసులతో భయపెట్టడం దుర్మార్గం. పైగా ఫిర్యాదు చేసినవారిపైనే కేసు నమోదు చేయడమనేది, బహుషా మన రాష్ట్రంలో తప్ప, ఎక్కడా జరగడం లేదు. ఎందుకంటే ఇక్కడ భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం కాగా, ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. భక్తితో కళ్లకు అద్దుకుని, కళ్లు మూసుకుని ప్రసాదం తినే భక్తులు, ఇక నుంచి ఆ ప్రసాదాన్ని మొత్తం జాగ్రత్తగా చూసి కానీ, సేవించే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం.