అంబేద్క‌ర్ స్మృతివ‌నం ప‌నులు నాణ్య‌త‌తో ఉండాలి

విజ‌య‌వాడ‌కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చేలా నిర్మాణాలుండాలి

స్మృతివనంలో కన్వెన్షన్‌ సెంటర్ కూడా అత్యంత ప్రధానమైనది

నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

అధికారుల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

అంబేద్కర్‌ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై సీఎం సమీక్ష

తాడేపల్లి: అంబేద్కర్ స్మృతివనం శాశ్వతమైన ప్రాజెక్టు అని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాల‌ని, పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల‌ని సూచించారు. విజయవాడలో డాక్ట‌ర్ బీ.ఆర్‌.అంబేద్కర్‌ భారీ విగ్రహం, స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 

స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని, అన్ని స్లాబ్ వర్క్స్‌ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పిటికే సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని చెప్పారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివరించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ప‌నులు నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాల‌ని సూచించారు. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్‌ సెంటర్ కూడా అత్యంత ప్రధానమైనద‌ని,  నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని ఆదేశించారు.  అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాల‌ని, పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల‌ని ఆదేశించారు. 

ఈ స‌మీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, ప్లానింగ్‌ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జి. విజయ్‌ కుమార్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి. సృజన, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top