ఇడుపులపాయ: దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైయస్సార్’’ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్ వైయస్సార్ సహధర్మచారిణిగా వైయస్ విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైయస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని వైఎస్ విజయమ్మ తన తొలి పలుకులో తెలిపారు. వైయస్సార్ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో... ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు. మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో ఆమె వివరించారు. వైఎస్సార్ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా...ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని విజయమ్మ పేర్కొన్నారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నానని వైయస్ విజయమ్మ అన్నారు.