డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది సేవ‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు

కోవిడ్‌ పోరాటంలో నిమగ్నమైన సిబ్బందికి అభినందనలు

డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఎలాంటి సహాయ, సహకారానికైనా సిద్ధం

కరోనా బాధితుల్లో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స 

అధిక చార్జీలు వసూలు చేసే ప్రైవేట్‌ ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు

ఆక్సిజన్‌ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ జరగాలి

కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలి

కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: డాక్టర్లు, వైద్య సిబ్బంది అసమాన సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో ఒక్క తల్లి మాత్రమే ఇలాంటి సేవలు అందించగలదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. డాక్టర్లు వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌పై పోరాటంలో నిమగ్నమైన సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం సీఎం ఏం మాట్లాడారంటే.. ‘మన రాష్ట్రానికి మహానగరాలు లేవు.. అంత పెద్ద మౌలిక సదుపాయల్లేవు. కానీ, గట్టి కృషి ద్వారా కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, వలంటీర్లు, ఆశ వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఇది సానుకూల పరిస్థితి. 

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కరోనా సోకినవారిలో 70 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నాం. 50 శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి. ప్రైవేట్‌ ఆస్పత్రులు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తే కేసులు పెట్టాలి. ఆరోగ్య మిత్రలు సమర్థవంతంగా పనిచేయాలి. 

అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. ఇది మహమ్మారి సమయం, ప్రతి పేదవాడికి సేవలు చేయాల్సిన సమయం. 104 కాల్‌ సెంటర్‌ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా పెట్టాం. మన బంధువులే మనకు ఫోన్‌ చేస్తే ఎలా స్పందిస్తామో.. 104కు ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాగే స్పందించాలి. జర్మన్‌ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలి. ఆక్సిజన్‌ ఎయిర్‌ కండిషన్‌ పెట్టాలి. శానిటేషన్‌ బాగుండాలి. రోగులకు మంచి ఆహారం అందించాలి. 

ఆక్సిజన్‌ సరఫరా 330 టన్నుల నుంచి 600 టన్నుల సామర్థ్యానికి పెంచాం. కనీసం రెండ్రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాం. ఆక్సిజన్‌ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ జరగాలి. ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నాం. 

దేశ వ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌కు వాడే ఇంజక్షన్లు కొరతగా ఉన్నాయి. ఒక్కో రోగికి వారానికి కనీసం 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3 వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2 వేల ఇంజక్షన్లు వస్తాయని చెబుతున్నారు. ఇవన్నీ కూడా సరిపోని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా కృషిచేస్తున్నాం. ఉన్నవాటిని జాగ్రత్తగా వినియోగించడంపై దృష్టిపెట్టాలి. 

కోవిడ్‌ నియంత్రణ కోసమే కర్ఫ్యూ విధించాం. కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని మరిచిపోవద్దు. మాస్క్‌ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం,  శానిటైజ్‌ చేసుకోవడం ఇవన్నీ కూడా పాటించాలి. జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలి. లేకపోతే ఎస్పీలు, కలెక్టర్లు విఫలమైనట్టుగా భావించాల్సి వస్తుంది. కర్ఫ్యూలో మినహాయింపులు ఉన్నవాటిని తప్ప మిగతా విషయాల్లో కర్ఫ్యూ కచ్చితంగా పాటించాలి’ అని కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top