తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం వైయస్ఆర్ జిల్లాకు బయల్దేరనున్నారు. నేటి నుంచి శనివారం వరకు వైయస్ఆర్ జిల్లా సీఎం పర్యటిస్తారు. నేడు ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత బద్వేలుకు వెళ్లి అక్కడ నూతన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గోపవరం వద్ద సెంచురీ ఫ్‌లై వుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తికి చేరుకుని అక్కడ పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. 24వ తేదీన ఇడుపులపాయ, పులివెందులలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈనెల 25వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం చేరుకుంటారు. సీఎం వైయస్ జగన్ నేటి పర్యటన షెడ్యూల్.. ►11.20 నుంచి 11.35 గంటల వరకు ప్రొద్దుటూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 1.00 గంట వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ►1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ–1కు చేరుకుంటారు. ►1.50 నుంచి 1.55 గంటల వరకు బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ►1.55 నుంచి 2.25 గంటల వరకు మెజర్స్ సెంచురీ ఫ్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ►2.55 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకుంటారు. స్థానిక నాయకులతో మాట్లాడతారు. 3.10 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైయస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు. ►3.25 గంటలకు వైయస్ఆర్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్‌క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ►5.05 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ 5.20 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. ►5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.