చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమం

 43.96 లక్షల  మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి

మూడో ఏడాది అమ్మ ఒడి ద్వారా రూ. 6, 595 కోట్లు తల్లుల ఖాతాలో నేరుగా జమ

నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో అందాలి

సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశా

పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం

మన పిల్లలు ప్రపంచంతో పోటీపడే రోజులు రావాలి

అలాంటి రోజు రావాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి చేయక తప్పని పరిస్థితి
అతిపెద్ద ఎడ్యుకేషన్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం

కుయుక్తులు, కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతుంది

మారీచులతో మనం యుద్ధం చేస్తున్నాం

ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా? లేదా? అనేది కొలబద్దగా తీసుకోండి

 శ్రీ‌కాకుళం: చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదన్నారు. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని చెప్పారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్‌.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇద‌ని తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమం సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.
  

చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క, చెల్లెమ్మ, సోదరుడు, స్నేహితుడు, అవ్వా, తాతలకు ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి, చిట్టి బాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం.

43.96 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ...
దేవుడి దయ వల్ల ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు 43.96 లక్షల మంది తల్లులకు తద్వారా 80 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరేలా ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.6595 కోట్లు జమ చేస్తున్నాం. 

ప్రతి అక్క, చెల్లెమ్మ వారి పిల్లలు గురించి, వారి భవిష్యత్‌ గురించి ఆలోచన చేసే విషయంలో ఆ అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్యగా తోడుగా ఉన్నానని తెలియజెప్పే గొప్ప కార్యక్రమం ఇది.

తలరాతనే మార్చగలిగే శక్తి - చదువు మాత్రమే..
మీ కుటుంబాల భవిష్యత్తును మీ పిల్లల చదువుల్లోనే చూసుకుంటున్న..... ఆ పిల్లల తల్లులకు మీ అన్న మీ కుటుంబ సభ్యుడు.. మీ జగన్‌ శుభాకాంక్షలు చెబుతున్నాడు.
ఒక మనిషి తలరాతైనా, కుటుంబం తలరాతైన, వారి బ్రతుకునైనా  మార్చగలికే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. ఒక సమాజం తలరాతను, ఒక దేశం తలరాతను కూడా మార్చగలికే శక్తి చదువుకు మాత్రమే ఉంది. 
మనందరికి  కనిపిస్తోంది... 
చదువులు బాగా ఉన్న దేశాలలో ఆదాయాలు కూడా ఎక్కువే. అక్కడ ప్రజలు మనకన్నా ఎక్కువ ఆదాయాలు సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ల తలసరి ఆదాయం మనకన్నా ఎందుకు ఎక్కువ ఉంది ? కారణం ఏమిటంటే ? చదువు. చదువుకు ఆ శక్తి ఉంది కాబట్టే వాళ్లకు మనకూ తేడా కనిపిస్తోంది. కాబట్టి  చదువే నిజమైన ఆస్తి. అందుకే ఏ ప్రభుత్వమైనా కూడా చదువులు మీద పెట్టిన ప్రతిపైసాకూడా ఊరికే డబ్బులు వృధా చేస్తున్నట్టు కాదు. అది ఒక పవిత్రమైన పెట్టుబడి.
పిల్లల తలరాతలు, వారి భవిష్యత్తును మార్చే ఒక గొప్ప పెట్టుబడి ఆని దీన్ని విమర్శించే వారికి చెపుతున్నాను. ఓ తరాన్ని వారి తలరాతలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉంది.
ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బ్రతకగలిగే శక్తి చదువు ద్వారానే వస్తుంది.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు...
 అలాంటి నాణ్యమైన చదువులు, అలాంటి మెరుగైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకూ అందాలి అన్న తాపత్రయం,  తపనతో మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వచ్చాం.
దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా మన రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ మంచి చదువులు అన్నది ఒక హక్కుగా, బాధ్యతగా  వారందరికీ అందిస్తున్నాం. దీనికోసం అడుగులు ముందుకేస్తున్నాం.
అందులో భాగంగానే ఈ రోజు ప్రారంభిస్తున్న జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎంతో సంతోషాన్నిచ్చే కార్యక్రమం ఇది. మనం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రారంభించాం. ఈరోజుకు మూడో ఏడాది.  పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి నిరుపేద తల్లికి జగనన్న అమ్మ ఒడి డబ్బును నేరుగా బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమచేస్తున్నాం. 

1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ అమ్మఒడి..
1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌వరకూ అమ్మ ఒడి ఇస్తున్నాం. 
దాదాపుగా 80 లక్షలమంది పిల్లలకు మంచి జరుగుతోంది. 43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి  జగనన్న అమ్మఒడి కింద  రూ.6595 కోట్లు జమ చేస్తున్నాం.  
ఈ ఒక్క అమ్మ ఒడి స్కీం ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో నేరుగా తల్లుల ఖాతాల్లోకి రూ.19,618 కోట్లు జమచేశాం.

మీ పిల్లలను చదివించండి– తోడుగా ఉంటా...
పిల్లలను మీరు చదివించండి.. మీకు తోడుగా మీ అన్న ఉన్నాడని మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు అందించిన ప్రోత్సాహం ఇది. ఏ తల్లైనా కూడా తమ పిల్లలను గొప్పగా చదవించాలని ఆరాటపడుతోంది. బడి మధ్యలోనే మానేసే పరిస్థితి రాకూడదని ఏ తల్లైనా అనుకుంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకవైపు పిల్లల చదువులు, మరోవైపు చదివించలేని పరిస్థితి అక్కచెల్లెమ్మలకు శాపంగా మారకూడదు. 

నా పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశా... 
3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్నీ చూశాను. ప్రతి చెల్లెమ్మకూ నేను ఉన్నానని చెప్పాను.
చెప్పిన ఆమాటను నిలబెట్టుకుంటూ ఈ మూడు సంవత్సరాల్లో మూడోసారి కూడా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం.

పిల్లలను బడికి పంపితే చాలు...
ఈ పథకం కింద పిల్లలను బడికి పంపితే చాలు, ప్రై వేటు స్కూలు అయినా, ఎయిడెడ్‌ అయినా, ప్రభుత్వ స్కూలు అయినా.. ఎక్కడ చదివించినా జగన్‌మామకు అభ్యంతరం ఉండదు. కానీ పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యమని కచ్చితంగా చెప్తున్నాను.
అలా పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15వేల రూపాయలు అమ్మ ఒడి ద్వారా అందిస్తున్నాం. 

ఎంతమంది ఎక్కువ పిల్లలు చదువుకుంటే.. అంత సంతోషం. 
ఎంతమంది తల్లులకు అమ్మఒడి అందితే అంత ఆనందం. అయితే పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది. లేకపోతే చదువు దూరం అవుతుంది. అందుకే కనీసంగా 75శాతం హాజరు కచ్చితంగా ఉండాలని చెప్పి. జీఓ ఇచ్చే రోజునే.. ఆ విషయాన్ని  పొందుపరిచాం. అంటే నాలుగు రోజులు స్కూల్‌ ఉంటే కనీసం మూడు రోజులైనా పిల్లాడు, లేదా పాప క్లాసులకు హాజరై చదువు నేర్చుకుంటే ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పాం. 

పిల్లలను తపస్సులా చదివించాలనేదే లక్ష్యం... 
ఎందుకంటే పిల్లలను ఒక తపస్సులా చదవించాలన్నదే లక్ష్యం. అప్పుడే పిల్లల జీవితాలు మారుతాయి. తద్వారా వారి కుటుంబాల తలరాతలు మారుతాయి.అందుకే 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని నిబంధన తీసుకొచ్చాం.

 ఈ పథకం  2019–20 మొట్టమొదటగా అధికారంలోకి రాగానే తీసుకు వచ్చాం. అప్పుడు తొలిసారిగా దీన్ని ప్రారంభించాం కాబట్టి .. అప్పుడే 75శాతం నిబంధన పెట్టడం సరికాదని మినహాయింపు ఇచ్చాం. తర్వాత ఏడాది 2020–21 ఏడాదిలో అనుకోకుండా కోవిడ్‌  వచ్చింది.  దీంతో 75 శాతం హాజరు నిబంధనను మినహాయింపు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది.
ఇక గత సెప్టెంబరు నుంచి బడులన్నీ యథావిధిగా నడుస్తున్నాయి. బడి జరిగిన రోజుల్లో కనీసం 75శాతం హాజరు నిబంధన అమల్లోకి వచ్చింది. 

2021–22లో బడి జరిగిన రోజుల్లో  51వేలమంది తల్లులు అమ్మ ఒడి లబ్ధిని అందుకోలేకపోయారు. దాదాపు 44,47,402 మంది తల్లులకు గాను, ఒక్క 51వేల మంది తల్లులకు అమ్మ ఒడి ఇవ్వలేకపోయాం. మరో రకంగా దీన్ని చెప్పాలంటే 43,96,402 మంది తల్లులకు అంటే 98.86 శాతం మంది తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని ఇవ్వగలిగాం. ఈ 51 వేల మంది అంటే 1.14 శాతం మంది తల్లులకు మాత్రమే ఇవ్వలేకపోవడం బాధాకరం. 

అయినప్పటికీ భవిష్యత్తులో ఈ కార్యక్రమం అన్నది 75శాతం హాజరుతో అడుగులు ముందుకువేయాల్సి ఉంది. అందుకే నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపండి, ఈ బాధ్యతను తీసుకోమని కోరుతున్నాను. 

ఇక్కడొక  బృహత్తర యజ్ఞం జరుగుతోంది. 
ప్రతి పిల్లాడి జీవితాన్ని మార్చాలని, ప్రతి పాప బ్రతుకు మార్చాలని తపన, తాపత్రయంతో అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నాం. 

నాణ్యమైన విద్య– 75 శాతం హాజరు తప్పనిసరి...
మనం అమలు చేస్తున్న అమ్మ ఒడి, మనబడి నాడు –నేడు, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన, సీబీఎస్‌ఈ, బైజూస్‌తో ఒప్పందంతో నాణ్యమైన సులభంగా అర్ధమయ్యే విధంగా ఉండే మంచి విద్య.. పిల్లలందరికీ అందిస్తున్నాం. తద్వారా మన పిల్లలు ప్రపంచంతో పోటీపడే పరిస్థితి కల్పించగలిగే రోజు రావాలి. ఇది సాధ్యం కావాలంటే కచ్చితంగా  75శాతం హాజరు ఉండాల్సిన పరిస్థితి, అందుకనే దీన్ని తప్పనిసరి చేస్తున్నాం.

నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు...
మరో రెండు విషయాలు గురించి కూడా ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పాప, పిల్లాడుకి అర్ధమయ్యేలా చెప్పాలి. మన ప్రభుత్వ బడులలో 
నాడు– నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. మంచి స్కూళ్లు తయారువుతున్నాయి. అవి అలాగే ఉండాలంటే.. ప్రతి అక్క చెల్లెమ్మా బాధ్యత తీసుకోవాలి. తమ పిల్లలు వెళ్లే ఆ బడులు గురించి ఆలోచన చేయాలి. ఆ స్కూళ్లలో ఉన్న టాయిలెట్ల గురించి ఆలోచన చేయాలి. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలి. వాటి నిర్వహణ బాగుంటే.. పిల్లలకు మంచి వాతావరణం స్కూళ్లలో ఉంటుంది. దీనికోసమే టాయిలెట్‌ మెయింటైనెన్స్‌ ఫండ్‌  (టీఎంఎఫ్‌) ఏర్పాటు చేశాం. ప్రతి అక్కకూ ఇస్తున్న అమ్మ ఒడిలో కాస్తంత సొమ్మును  కేటాయిస్తున్నాం. 

ఇక రెండోది ఎస్‌ఎంఎఫ్‌ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. మనం దాదాపు రూ16,500 కోట్లు ఖర్చు పెట్టి నాడు–నేడులో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ఇలా స్కూళ్ల రూపురేఖలు మారిన తర్వాత..వాటిని పట్టించుకోకపోతే అవన్నీ కూడా మరో నాలుగు సంవత్సరాల్లో మళ్లీ పాత పరిస్థితికే వస్తాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ స్కూళ్ల నిరంతం బాగుండేలా ఉండే పరిస్థితులు ఉండాలంటే.. వెంటనే రిపేర్లు చేయడానికి కాస్తా కూస్తో డబ్బులు కేటాయింపులు చేయాలి. 

అందుకే అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న అమ్మఒడి సొమ్ము నుంచి కాస్తా.. అక్కచెల్లెమ్మలు పిల్లలు వెళ్లే స్కూళ్ల నిర్వహణ కోసం స్కూల్‌ మెయింటైనెన్స్‌ కింద కేటాయిస్తున్నాం. ఇవన్నీ మన పిల్లలు వెళ్లే స్కూళ్లలో మీ పేరెంట్స్‌ కమిటీ, మీ హెడ్‌మాష్టార్‌ పర్యవేక్షణలో ఖర్చు చేస్తారు. టీఎంఎఫ్‌ కింద రూ.1000, ఎస్‌ఎంఎఫ్‌ కింద మరో రూ.1000 కలిపి మన స్కూళ్ల బాగోగులు కోసం ఈ డబ్బును వీటికి కేటాయించడం వల్ల ప్రతి అక్కకూ, చెల్లెమ్మకు ఒక హక్కు వస్తుంది. ఆ స్కూళ్లు బాగాలేకపోతే వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ డబ్బు స్కూళ్లకు ఇవ్వడం వల్ల బాధ్యతగా దాన్ని ఖర్చు చేసి ఆ స్కూల్‌ బాగోగులు చూసుకుంటారు. 

విమర్శించేవారు రూ.1 కూడా ఇవ్వలేదు....
మరో విషయం కూడా చెప్పాలి. ఈ రూ.2వేలకు సంబధించి కొంతమంది కొన్ని విమర్శలు చేస్తుండటం నాకు ఆశ్చర్యమనిపించింది. దీనిపై విమర్శలు చేసే ఏ ఒక్కరైనా తమ జీవితంలో ఏనాడైనా.. చదివించే అమ్మకు ఒక్క రూపాయి అమ్మఒడి వంటి స్కీం ద్వారా ఇచ్చారా అని ఆలోచన చేయండి ? 
నిజంగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అమ్మఒడి లాంటి పథకం ద్వారా ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.15వేల నుంచి రూ.2వేలు కేటాయింపులు జరిగితే మాత్రం విమర్శించే వీరి మనస్తత్వం పై ఆలోచన చేయండి.

 మనది నిజంగా ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే మేనిఫెస్టోలో చెప్పిన 95శాతం వాగ్ధాదాలు మనం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే చేసేవారమేనా ? ఆలోచన చేయండి ?

మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా.. 
మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి నిజాయితీ ప్రతి అక్క, చెల్లెమ్మకు డబ్బులు ఇస్తూ హక్కులు కల్పిస్తూ.. మీ ఖాతాల్లోంచి రూ.2వేలు మీ పిల్లల టాయిలెట్స్, స్కూళ్ల రిపేర్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని మీకు విజ్ఞప్తి చేసి మరీ చెప్పేవారమేనా ? ఒక్కసారి ఆలోచన చేయండి ?
డబ్బు ఎగ్గొట్టాలని అనుకుంటే...  పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేసేవారమేనా ? ఆలోచన చేయండి.

ఆతిపెద్ద ఎడ్యు టెక్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం.
ఈ రోజు దేశంలోనే ఆతిపెద్ద ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. శ్రీమంతులు పిల్లలు మాత్రమే ప్రతిఏటా రూ.24వేలు ఖర్చు చేస్తే తప్ప అందుబాటులోకి రానీ ఈ బైజూస్‌ యాప్‌.. ఇవాళ పేద పిల్లలకు మీ జగనన్న ద్వారా ఉచితంగా వస్తున్న నిజం వాస్తవం కాదా ?  

8వతరగతిలోకి అడుగుపెట్టబోయే ప్రతి పిల్లాడికి కూడా ఈ సెప్టెంబరు మాసం నుంచి అంటే రెండు, మూడు నెలలు తిరక్కమునుపే రూ. 12వేలుపై చిలుకు ఖర్చయ్యే ట్యాబ్‌ను కూడా వారికి ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం.  తద్వారా రూ.500 కోట్లు ఖర్చయ్యే కార్యక్రమాన్ని...  మీ జగనన్న ప్రభుత్వానికి ఎగ్గొట్టే ఆలోచనే ఉంటే చేస్తుందా ? ఆలోచన చేయండి.

నిజాలు చెప్పని దుష్ట చతుష్టయం... 
ఈ చంద్రబాబునాయుడు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ దుష్టచతుష్టయం అంతా కూడా ఇలాంటి నిజాలు ఏనాడైనా చెప్పే ధైర్యం, నిబద్ధతా వీళ్లకు ఉందా ? అని నేను అఢుగుతున్నాను. 
బైజూస్‌ యాప్‌ ద్వారా వీడియాలు, యానిమేటెడ్‌ బొమ్మలతో 4వతరగతి నుంచి 10వ తరగతి విద్యార్ధుల వరకు వారందరికీ మరింత సులభంగా, సమగ్రంగా అర్ధమయ్యేలా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతోంది.

4.7 లక్షల మందికి రూ.500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికి సుమారు రూ.12వేల విలువ చేసే ట్యాబ్‌

సీబీఎస్‌ఈతో అనుసంధానించిన బైజూస్‌ కంటెంట్‌...
రేపటి సంవత్సరం నుంచి బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలతో వాటిని అనుసంధానించి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలోకి అడుగుపెట్టబోయే ప్రతి విద్యార్ధికి అంటే దాదాపు 4.7 లక్షల మందికి రూ.500 కోట్లతో ఒక్కొక్కరికి సుమారు రూ.12వేల విలువ చేసే ట్యాబ్‌ను ఈ సెప్టెంబరు మాసంలోనే అందించబోతున్నాం. బైజూస్‌ కంటెంట్‌ అంతా ట్యాబులో ఉంటుంది. ఆ ట్యాబు ద్వారా యానిమేటెడ్‌ చిత్రాలతో సులభంగా అర్ధమయ్యే విధంగా పిల్లలకు అందుబాటులోకి వస్తుంది.  
ఈ పిల్లలందరూ కూడా 2025 మార్చిలో పదోతరగతి సీబీఎస్‌ఈలో ఇంగ్లిషు మీడియంలో పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలు రాసే పిల్లలకు చేయి పట్టుకుని నడిపే కార్యక్రమం చేస్తున్నాం.  బైజూస్, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పిల్లలను సన్నద్ధం చేసేందుకు ఇంత గొప్ప కార్యక్రమానికి నడుం బిగించాం. ఈ ట్యాబులు 8వ తరగతిలో ప్రవేశించబోయే ప్రతి పిల్లాడికి ఇవ్వడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. 8వ తరగతిలోకి అడుగుపెట్టిన వెంటనే విద్యాకానుకతో పాటు పిల్లలందరికీ రూ.12వేలు విలువచేసే ట్యాబ్‌ అందించే కార్యక్రమం జరుగుతుంది. 

డిజిటల్‌ విధానంలో విద్య...
పిల్లలు జీవితాలు మార్చే కార్యక్రమంలో భాగంగా వారికి రాబోయే రోజుల్లో డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు బోధించే విధంగా... ప్రతి తరగతి గదిలోనూ టీవీ లేదా డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు–నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతున్నాం. ప్రతి క్లాస్‌రూంలోనూ డిజిటలో బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీనికి కారణం మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడాలి, నెగ్గాలి. మన పిల్లల బ్రతుకులు మారాలి. తలరాతలు మారాలి. అప్పుడే మనం పేదరికం నుంచి బయటపడే రోజు వస్తుంది. వారి కోసం మీ మేనమామ చేస్తాడని భరోసా ఇస్తున్నాను. 

విద్యారంగం మీద, అంటే మీ పిల్లల భవిష్యత్‌ మీద కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం.. ఎంత ఖర్చు చేసిందో మీరే చూడండి.

జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ.. 80 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,617 కోట్లు ఖర్చు చేశాం. 
గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబునాయుడుగారి పరిపాలన గమనిస్తే... ఇటువంటి అమ్మఒడి అనే పథకం గురించి కనీసం ఆలోచన కూడా చేయని రోజులు.
జగనన్న విద్యాదీవెన ద్వారా 21.55 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏ క్వార్టర్‌కు ఆ క్వార్ట్‌లో అందిస్తున్నాం. ఆ క్వార్టర్‌ పూర్తి కాగానే వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేందుకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం.
జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. 
మీరు కాలేజీకి పిల్లలను పంపిస్తే చాలు.. వారు కాలేజీకి వెళ్లినప్పుడు  వారి బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల కోసం మరో రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తే... అది కూడా భరించిలేని అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. అది కూడా సంవత్సరానికి రెండు దఫాలుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న సొమ్ము ఇది. 
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాల ద్వారా  మూడేళ్లలో దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. 
గతంలో ఐదేళ్లలో చంద్రబాబు హయాలంలో అరకొర ఫీజులిచ్చేవారు.ఆ ఫీజులు కూడా బకాయిలగా పెట్టేవారు. వాళ్లు బకాయిలుగా పెట్టిన ఆ రూ.1,778 కోట్ల కూడా మీ జగనన్న ప్రభుత్వం తీర్చింది.

జగనన్న విద్యాకానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు స్కూళ్లు తెరిచే రోజున వారి మొహంలో చిరునవ్వులు చిందే విధంగా.... మంచి నాణ్యతతో కూడిన బ్యాగులు, యూనిఫాంలు, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, బూట్లు ఇస్తున్నాం. దీనికోసం మన ప్రభుత్వంఇంతవరకు రూ.2324 కోట్లు ఖర్చు చేసింది.

 ఇదే కార్యక్రమం చేయాలన్న ఆలోచన గతంలో చంద్రబాబుకు రాలేదు. ఏదో చేశామంటే చేశామని.. సంవత్సరానికి రూ.120 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకునేవారు.

జగనన్న గోరుముద్ద ద్వారా 43.26 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. వారికి రోజుకొక మెనూతో నాణ్యమైన ఆహారం వారికిస్తూ.. ఇప్పటికే దాదాపు రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. 
గతంలో ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన గుర్తుచేసుకుంటే 8 నెలల పాటు బకాయిలు, ఆయాలకు కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితి. సరుకులు బిల్లులు పెండింగ్‌లో పెట్టిన పరిస్థితులు. ఇన్ని నెలలు బకాయిలుగా పెడితే పిల్లలకు వారు అందించగలిగే పుడ్‌ నాణ్యంగా ఎలా ఉంటుందో ఆలోచన చేయండి.

నాడు–నేడు
పాఠశాలలో కనీవీనీ ఎరుగని విధంగా నాడు–నేడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 15,715 స్కూళ్లు రూ.4వేల కోట్లతో నాడు-నేడు తొలిదశ కింద పూర్తయిన పరిస్థితి. అదనపు తరగతి గదులూ కడుతున్నారు. 
మరో  22,344 స్కూళ్లు రెండో దశ నాడు నేడులో భాగంగా రూ.8 వేల కోట్లతో రూపు రేఖలు మార్చే కార్యక్రమం జరుగుతోంది.
వైయస్సార్‌ సంపూర్ణ పోషణం ద్వారా 34,19,875 మంది చెల్లెమ్మలు, పిల్లలకు మంచి పౌష్టికాహారం కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. గతంలో చంద్రబాబు హయాంలో పోషణం అనే పథకానికి సంవత్సరానికి రూ.500 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. 
తేడా గమనించిండి. 

నేను చెప్పినవాటికే మూడేళ్లలో రూ.52,600 కోట్లు.
కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో నేను చెప్పినవి మాత్రమే లెక్కిస్తే చాలు.. రూ.52,600 కోట్లు నేరుగా మనకు కనిపించే లెక్కలు. వీటిలో ఉపాధ్యాయులు జీతాలు గురించి నేను ఇంకా చెప్పలేదు. అవి కాకుండానే ఈ పథకాలకు, పిల్లల జీవితాల్లో మెరుగులు దిద్దేందుకు, తల్లులకు మంచి చేయాలన్న తపనతో పేదరికం నుంచి ఈ కుటుంబాలను బయటపడేయాలన్న ఆరాటంతో వేసిన అడుగులుకు, విద్యా రంగంలో ఈ సంస్కరణలకు మాత్రమే ఇంత మొత్తం కనిపిస్తోంది. ఇది పిల్లలపై చేస్తున్న ఖర్చు.

ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి, విద్యారంగంలో అమలు చేస్తున్నాం. కాబట్టి దీనివల్ల వచ్చిన మార్పులు గమనించండి.

ప్రభ్వుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్ధులు...
2018–19లో 1 నుంచి 10 తరగతి పిల్లలు  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారి సంఖ్య 37.21 లక్షలు మంది. ఇదే సంఖ్య 2021–22 అంటే గత సంవత్సారికి లెక్కిస్తే 44.30 లక్షల మందికి పెరిగింది. 
అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాల 7.1 లక్షల పెరుగుదల కనిపించింది.
అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో రెండూ కలిపితే.. 1 నుంచి 10 వతరగతి  చదువుతున్న పిల్లలను చూస్తే... ఈ సంఖ్య 2018–19తో పోలిస్తే  2021–22 నాటికి 2 లక్షలు మంది పెరిగి.. 72.46 లక్షల మందికి చేరుకున్నారు. 
ఇదంతా మన కళ్లముందే కనిపిస్తోంది.
ఇవన్నీ విద్యా రంగంలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల వచ్చిన మార్పులు.

విమర్శలు చేసేవాళ్లు ఎలాంటి వారో... 
ఇలాంటి మంచి చేసే ప్రభుత్వంమీద, మీ జగన్‌ మామాయ్య మీద, మీ జగన్‌ అన్నమీద విమర్శలు చేసేవారు ఎలాంటి వారో చూడండి.

ఇవాళ మీ అందరితో ఒకే ఒక మాట చెప్తున్నాను. మీ అందరూ ఆలోచన చేయండి. యుద్ధం ఇవాళ నేరుగా జరగడంలేదు.
కుయుక్తులు, కుతంత్రాలతో యుద్ధంచేస్తున్నారు. మనం మారీచులతో, దుష్టచతుష్టయంతో యుద్ధంచేస్తున్నాం.
చంద్రబాబుతోనే కాదు ఈనాడుతో, టీవీ–5తో, ఆంధ్రజ్యోతితో యుద్ధంచేస్తున్నాం. వీరికి తోడు దత్తపుత్రుడు. వీరందరితో ఒకే ఒక్క జగన్‌ పోరాటం చేస్తున్నాడు. 

మీ ఆశీస్సులన్నంతవరకూ.... 
మీ జగన్‌కు ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి తోడుగా లేకపోవచ్చు. కాని మీ జగన్‌కు మీ మీద నమ్మకం ఉంది. మీ జగన్‌కు మీ  ఆశీస్సులు ఉన్నంతవరకూ.. దేవుడి దయ ఉన్నంత వరకూ మీ జగన్‌ వెంట్రుక కూడా పీకలేరు. కారణం మీ జగన్‌కు మీరు ఉన్నారు. 
మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్తున్నా. ఈ దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి.
మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా? లేదా? అన్నదాన్నే కొలబద్దగా తీసుకోండి. మన కుటుంబంలో మనకు జగనన్న వల్ల మంచి జరిగింది అంటే చాలు.
జగనన్నకు మద్దతు ఇవ్వండి.  దేవుడి దయతో ఇంకా మంచి జరగాలి. ప్రతి పిల్లాడికి, పాపకి మంచి జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

 

శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు

 కోడిరామ్మూర్తి స్టేడియం.. టిడిపి వాళ్లు పూర్తిగా విరగ్గొట్టి వదిలేసి వెళ్లారు. ఆ స్టేడియం బాగుచేయడానికి రూ.10 కోట్లు అదనంగా మంజూరు చేయమన్నారు. అది వెంటనే మంజూరు చేస్తున్నాను.
ఇంటిగ్రేడెట్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేయడానికి అదనంగా మరో రూ.69 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి ఆముదాలవలస నాలుగు లేన్ల రోడ్డు కోసం ఇప్పటికే రూ.40 కోట్లు ఇచ్చాం. ల్యాండ్‌ అక్విజేషన్, యుటిలిటీ కోసం మరో రూ.18 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. హిరమండలం రిజర్వాయరులోని వంశధార నుంచి గొట్టా బ్యారేజీ వద్ద లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు నేరేడు బ్యారేజీ పనులు ఆలస్యం అవుతున్న నేపధ్యంలో... రూ.189 కోట్లతో ఆ ప్రాజెక్టును కూడా మంజూరు చేస్తున్నాం. 
మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయకు రివైజ్డ్‌ ఎస్టిమేట్‌గా రూ.855 కోట్లు మంజూరు చేసి ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టబోతున్నాం. వంశధార ప్రాజెక్టు ఫేజ్‌ 2 స్టేజ్‌ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ రూ.2,407 కోట్లకు జీవో కూడా ఇచ్చాం. ఈ సంవత్సరం డిసెంబరు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెలుసు. ఆ కిడ్నీ సమస్య తీర్చాలంటే.. అక్కడ సర్పేస్‌ వాటర్‌ వస్తే తప్ప సాధ్యపడదని చెప్పి అది కూడా చేస్తున్నాం. దానికోసం పైప్‌లైన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో మొత్తం 807 గ్రామాలను పూర్తిగా బాగు చేస్తూ.. సర్పేస్‌ వాటర్‌  కోసం రూ.700 కోట్లతో పనులు జరుగుతున్నాయి. దాదాపుగా 70 శాతం పనులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు చేపట్టి పూర్తి చేశాం. ఆ ప్రాజెక్టుకు అదనంగా ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలే కాకుండా పాతపట్నం నియోజకవర్గంలో కూడా మూడు మండలాలను తాగునీటి అవసరాల కోసం చేర్చమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అడిగారు. దానికోసం మరో రూ.265 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా రూ.1000 కోట్లతో పైప్‌లైన్‌ ద్వారా కిడ్నీ సమస్య ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా కిడ్నీ సమస్య దూరం చేయడానికి వంశధార నుంచి నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 
దేవుడు మంచి చేయాలని మనసారా కోరుకుంటూ.. మంచి జరగాలని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.

 

Back to Top